పుంజుకున్న న్యూజిలాండ్‌

–  శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌
క్రైస్ట్‌చర్చ్‌ : న్యూజిలాండ్‌, శ్రీలంక తొలి టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు అనంతరం శ్రీలంక ముందంజలో నిలువగా.. మూడు రోజుల ఆట అనంతరం కివీస్‌ రేసులోకి వచ్చింది. 151 పరుగులే ఐదు వికెట్లు చేజార్చుకుని తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయే ప్రమాదంలో పడిన న్యూజిలాండ్‌ను మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌ (102, 193 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్‌ మాట్‌ హెన్రీ (72, 75 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ అర్థ సెంచరీతో మెరవటంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 18 పరుగుల ఆధిక్యం సొంతం చేసుకుంది. మైకల్‌ బ్రాస్‌వెల్‌ (25), టిమ్‌ సౌథీ (25), నీల్‌ వాగర్‌ (27) రాణించారు. ఇక శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 83/3తో ఆడుతోంది. బ్లెయిర్‌ టిక్‌నర్‌ (3/28) మూడు వికెట్లతో చెలరేగాడు. ఫెర్నాండో (28), కరుణరత్నె (17), మెండిస్‌ (14) నిష్క్రమించగా.. మాథ్యూస్‌ (20 బ్యాటింగ్‌), జయసూరియ (2 బ్యాటింగ్‌) అజేయంగా ఆడుతున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 65 పరుగుల ముందంజలో నిలిచింది.