రానున్న వేసవిలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నోడల్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారని కామారెడ్డి విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రావణ్ కుమార్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రుల ఆదేశాల మేరకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలోని 16 జిల్లాల్లో నియమిత నోడల్ అధికారులు ఈ నెల 29-01-2025 నుంచి తమ ప్రాంతాల్లో విద్యుత్ పరిస్థితిని పర్యవేక్షించనున్నారన్నారు.ఈ నేపథ్యంలో కామారెడ్డి సర్కిల్ నోడల్ అధికారి బి. శ్రీనివాస్ (ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్) కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తమ ఆధ్వర్యంలో 29-01-2025న కామారెడ్డి సర్కిల్ కార్యాలయంలో వేసవి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి తన పరిధిలోని ట్రాన్స్కో అధికారి, సర్కిల్ ఎస్ఈ, ఇతర సంబంధిత విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో పురోగతిలో ఉన్న పనులు, చేపట్టవలసిన చర్యలు, లోడును సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు చర్చించడం జరిగిందనీ, ప్రధాన అభివృద్ధి పై మాట్లాడుతూ విద్యుత్ సరఫరా మెరుగుపరిచే క్రమంలో, కామారెడ్డి 220 కేవీ సబ్ స్టేషన్ నుండి దోమకొండ 132 కేవీ సబ్ స్టేషన్ వరకు కొత్తగా 132 కేవీ లైన్ (14.7 కి.మీ.) రూ.4. 2 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కొత్త లైన్ ద్వారా దోమకొండ 132 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు, 132 కేవీ బిక్నూర్ సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని సబ్ స్టేషన్లకు, దోమకొండ, బిబిపేట్, మాచారెడ్డి, పాల్వంచ, బిక్నూర్, రామారెడ్డి మండలాల గ్రామాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు.ఈ సమీక్షా సమావేశంలో ట్రాన్స్కో, డిస్కం డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.