అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీలను విస్మరించింది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆశాలను పట్టించుకునే దిక్కులేదు. హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆశాలు పలు దఫాలుగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, హెల్త్ కమిషనర్‌కు వినతిపత్రాలిచ్చారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కానందున చలో హైదరాబాద్ పోరాటానికి నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆశా వర్కర్లు తమకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, బడ్జెట్‌లో తమకు వాటా కేటాయించి ఖర్చు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, తదితర సమస్యల పరిష్కారానికై పోరుబాట పట్టారు. ప్రభుత్వం తామిచ్చిన హామీని అమలు చేయకపోగా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం శోచనీయం. శాంతియుతంగా ధర్నాకు ఉపక్రమించిన ఆశాలను మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. ఆశాలపై ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక స్వభావాన్ని బయటపెట్టింది.
సంక్షేమ పథకాల అమలులో ఆశాల కీలకపాత్ర
2005వ సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)లో భాగంగా సమాజానికి ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పని చేయడానికి ప్రభుత్వం ఆశా వర్కర్లను ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఆశాలు అత్యధిక ప్రజానీకానికి ఆరోగ్య సంబంధిత సూచనలు సలహాలు అందించడంలో భారతదేశానికి వెన్నెముకగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాల రేటు తగ్గించడంలో, అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించడంలో, ఇమ్యునైజేషన్ చేయిం చడంలో, చిన్న పిల్లల సంరక్షణ గురించి సలహాలి వ్వడంలో, గర్భ నిరోధక, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటింప చేయ డంలో, అంటు వ్యాధులను నివారించడంలో, పోలియో నిర్మూలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా అతిసారం, జ్వరాలు, చిన్న గాయాల వంటి ఆరోగ్య సమస్యలకు ప్రాథమిక సంరక్షణ అందిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో జననాలు, మరణాలు, అసాధారణమైన ఆరోగ్య సమస్యలు లేదా వ్యాప్తి గురించి తెలియజేస్తారు. వివిధ జాతీయ వ్యాధి నియంత్రణ సేవల కింద సేవలందజేస్తారు. వీటితో పాటుగా ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు సమర్థవంతంగా చేరవేస్తారు. ఇన్ని రకాల ప్రజోపయోగ పనులు శక్తి వంచన లేకుండా ఆశాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం వీరికి ఎలాంటి వేతనం ఇవ్వకుండా కేవలం పనికి తగిన పారితోషికం చెల్లిస్తూ చేతులు దులుపు కుంటున్నది. ప్రభుత్వమే ఆశాల చేత పారితోషికాలు లేని అనేక అదనపు పనులు చేయిస్తూ వారి శ్రమను కారుచౌకగా దోపిడీ చేస్తున్నది. అమానవీయ పని పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన సరిపోని సిబ్బంది, ఎక్కువ పనిగంటలు, అతి తక్కువ పరిహారం, ఆమోదయోగ్యం కాని వర్క్, సౌకర్యాల లేమితో ఆశా వర్కర్ల చేత పని చేయిస్తున్నది ప్రభుత్వం. అందుకే రెండు దశాబ్దాల నుండి ఆశా కార్యకర్తలు మెరుగైన వేతనాలు, ఆరోగ్య భద్రత కోసం నిరంతరం పోరాడుతున్నారు.
అధిక పనిగంటలు..అత్తెసరు పారితోషికం
కనీస వేతనాలిచ్చి, మెరుగైన పని పరిస్థితులు కల్పించి ఆశాల సమస్యలు పరిష్కరించవలసిన ప్రభుత్వమే ఒక వైపు దోపిడీ చేస్తుంటే మరో వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలందక మరింత దారిద్య్రంలోకి నెట్టబడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వీరంతా పేదింటి ఆడబిడ్డలు. అనేకమంది ఆశాలు పొందే అతి తక్కువ, అత్తెసరు పారితోషికాలతోనే కుటుంబాల ప్రధాన ఆదాయంగా జీవిస్తున్నారు. వీరు తగినంత విశ్రాంతి లేకుండా, పోషకాహార లోపంతో ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చేస్తూ, ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రక్తహీనత, పోషకాహార లోపం, అసంక్రమిత వ్యాధుల బారిన పడుతూ కూడా తమ శక్తి వంచన లేకుండా ప్రభుత్వానికి పని చేస్తున్నారు. కోవిడ్ వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా తమ ప్రాణాలు, కుటుంబ ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తూ అనేక మంది ఆశాలు ప్రాణాలు సైతం కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీరి సేవలను గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని సన్మానించింది. ఇలాంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మన ప్రభుత్వం కనీసం కార్మికులుగా కూడా గుర్తించ లేదు. కార్మికులుగా గుర్తింపు లేనందున వీరు ఆరోగ్య బీమా, సామాజిక భద్రతా చర్యల నుండి వేరు పడుతున్నారు. అందుకని వీరు కోరుకుంటున్నది.. హెలికాఫ్టర్ పైనుండి పూలు చల్లించుకోవడమో లేదా ప్రధాని చేత కాళ్లు కడిగించుకోవడమో కాదు. తమకు కార్మికులుగా గుర్తించడం, గౌరవప్రధమైన జీవనం, మెరుగైన వేతనాలు మాత్రమే.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలైన చేయూత పథకం కింద మహిళలకు రావాల్సిన రూ 2500, విద్యార్ధినిలకు ఎలక్ట్రిక్‌స్కూటీలు, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు రూ.లక్ష, తులం బంగారం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అర్హులైన పేదలందరికీ అందడం లేదు. అసలు ఈ పథకాలన్నీ పొందాలంటే తెల్లరేషన్‌కార్డు ఉండితీరాలన్న నిబంధన పెట్టడం, ఇప్పటివరకూ అర్హులైన పేదలందరినీ గుర్తించి తెల్లరేషన్ కార్డులివ్వకపోవడం వంటి వాటిమీద కార్మికులకే కాదు, ప్రజలకు కూడా ప్రభుత్వంపై అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతుంది. గనుక ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి కార్మిక, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి.
పోరాటమే..ఆశాల ముందున్న కర్తవ్యం
కార్మికులే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, కార్మిక శ్రేయస్సుకు, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఒకవైపున చెబుతూనే, మరోవైపు కార్మిక ఉద్యమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకు ప్రభుత్వంలో ఆర్టీసి ఉద్యోగు లను విలీనం చేయకుండా జాప్యం చేయడం, ఆర్టీసి ట్రేడ్ యూనియన్‌లను పునరుద్ధరించకపోవడం, మహిళా కండక్టర్లకు రాత్రి డ్యూటీ వ్యవధిని తగ్గించకపోవడం, అంగన్‌వాడీ టీచర్స్, ఆయాల పోరాటం సందర్భంగా ప్రభుత్వమిచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రెండు లక్షలు, ఆయాలకు లక్ష రూపాయల హామికి సంబంధించిన జీవోను ఇప్పటివరకూ విడుదల చేయకపోవడం వంటి ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తుంటే ఆశాలు కూడా ఫిక్స్డ్ వేతనం పొందే విషయం కనుచూపు మేర కానరావడం లేదు. అందుకే ఆశాలందరూ ఐక్యపోరాటాల ద్వారానే ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసుకోవడం ముందున్న కర్తవ్యం.
కాసు మాధవి
9492585106