ధనిక రాష్ట్రాన్ని దోచుకున్నారు

ధనిక రాష్ట్రాన్ని దోచుకున్నారు– బాధితులుగా వచ్చేవారందరికీ పోలీసులు న్యాయం చేయాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌కు అప్పజెప్తే 10 ఏండ్లలో దోచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అప్పులు చేయడం, దోచుకోవడం, దాచుకోవటం చేశారని విమర్శించారు. అందుకే తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో వేసి కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీరామ్‌నగర్‌లో మంగళవారం కాంగ్రెస్‌ నియోజకవర్గ బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను నూరు శాతం అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలకు కేసీఆర్‌ స్వేచ్ఛ లేకుండా చేశారని, ఇప్పుడు 24 గంటలు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాభవన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ ఓడిపోయారని, అందుకు కారణం స్థానిక నాయకులలో ఐకమత్యం లేకపోవడం, సరిగా పనిచేయకపోవడం, కొందరు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలని సూచించారు.
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్‌లలో ఇంకా బీఆర్‌ఎస్‌ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారు పద్ధతి మార్చుకోవాలని.. ఏ పార్టీ వారు అయినా బాధితులుగా పోలీస్‌ స్టేషన్లకు వస్తే న్యాయం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కొన్ని డివిజన్‌లలో గంజాయి, డ్రగ్స్‌, బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నట్టు స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. స్థానిక పోలీసు అధికారులు పూర్తి బాధ్యత వహించి వాటిని నిర్మూలించాలని కోరారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్‌ డీసీసీ ప్రెసిడెంట్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నాయకులు అజాహరుద్దీన్‌, అసదుద్దీన్‌, భవాని శంకర్‌, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.