– అత్యంత ఉష్ణమయ మార్చి
న్యూఢిల్లీ: పుడమిపై తాపం నానాటికీ పెరుగుతోంది. గత నెల.. అత్యంత ‘ఉష్ణమయ మార్చి’గా నిలిచిపోయింది. దీంతో గత ఏడాది జూన్ నుంచి వరుసగా పదో నెలలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన కొత్త రికార్డు నమోదైంది. ఎల్‌నినో వాతావరణ పోకడ, మానవచర్యలతో ఉత్పన్నమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులే ఇందుకు కారణం. ఐరోపా సంఘానికి చెందిన కోపర్‌నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన అంశాల ప్రకారం.. గడచిన మార్చిలో పుడమి సరాసరి ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్ ఉంది. పారిశ్రామికీకరణకు ముందునాటి కాలం (1850-1900)తో పోలిస్తే ఇది 1.68 డిగ్రీల సెల్సియస్ అధికం. 1991- 2020 కాలంలో మార్చి నెలలో నమోదైన వేడితో పోలిస్తే ఇది 0.73 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. ఇప్పటివరకూ మార్చికి సంబంధించి అధిక ఉష్ణోగ్రతలు 2016లో నమోదయ్యాయి. నాటితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 0.10 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైంది. గడచిన 12 నెలల్లో (2023 ఏప్రిల్ నుంచి గత నెల వరకూ) పుడమి సరాసరి ఉష్ణోగ్రతలో రికార్డు చోటుచేసుకుంది. ఇది.. 1991-2020 కాలంలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత కన్నా 0.70 డిగ్రీల సెల్సియస్ అధికం. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇది 1.58 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని ‘పారిస్ ఒప్పందం’ నిర్దేశిస్తోంది. జనవరితో ముగిసిన ఏడాది కాలం మొత్తం ఈ పరిమితి దాటిపోయింది. ఇది దీర్ఘకాలం పాటు అనేక సంవత్సరాలు కొనసాగితే.. దాన్ని శాశ్వత పోకడగా పరిగణిస్తారు. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే ఇప్పటికే పుడమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. గడచిన 1.25 లక్షల ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వేడి లేదు. ప్రపంచవ్యాప్తంగా కరవులు, కార్చిచ్చు, వరదలకు ఇదే కారణమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 174 ఏళ్లలో 2023 సంవత్సరమే అత్యంత ఉష్ణమయ ఏడాదిగా నిలిచింది. 2024లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చు.