ఇటు గులాబీ.. అటు హస్తం..

Here's a rose.. That's a hand..– నడుమ సడేమియా పాత్రలో కమలం…
– కేసీఆర్‌ ఛరిష్మాపై విశ్వాసంతో బీఆర్‌ఎస్‌
– ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ ధీమా
– 15 సీట్లు గెలిచి ప్రభుత్వాలను ఉల్టా పల్టా చేయొచ్చనే వ్యూహంతో బీజేపీ
– ఎన్నికల వేళ ఎన్నో జిమ్మిక్కులు.. మరెన్నో మ్యాజిక్కులు…
బి.వి.యన్‌.పద్మరాజు
ఎన్నికల రణరంగంలో గెలిచి తీరేందుకు.. తద్వారా అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం ఎన్నో జిమ్మిక్కులు.. మరెన్నో మ్యాజిక్కులకు అవి సిద్ధమవుతు న్నాయి. ఈ క్రమంలో లాజిక్కులకు అందనంత రీతిలో ఆ మూడు పార్టీల్లోకి వచ్చే వారు వస్తుండగా.. వాటి నుంచి బయటకు పోయేవారు పోతుండటం గమనార్హం. వీరిలో దశాబ్దాల తరబడి పార్టీని అంటిపెట్టు కుని ఉండి, పదవులన్నింటినీ అనుభవించిన వారి దగ్గర్నుంచి, జూనియర్లు, సబ్‌ జూనియర్లు కూడా ఉండటం గమనార్హం.
ఈసారి ఎలాగైనా గెలవటం ద్వారా ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ తహతహలాడుతున్నది. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ అనేక రీతుల్లో ‘పక్కా ప్రణాళికల’ను ఇప్పటికే సిద్ధం చేసినట్టు వినికిడి. కాంగ్రెస్‌ను వీడి ఇటీవల గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తరహాలోనే మరికొంత మంది ‘పెద్ద తలకాయల’ను ఆకర్షించేందుకు సీఎం మంతనాలు నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న ఊపు, ఉత్సాహం రీత్యా ఇప్పటికిప్పుడు ఆ తలకాయలు పార్టీని వీడకపోయినా.. ఓట్ల సమాయానికి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పని చేసే అవకాశాలున్నాయనే చర్చలు కొనసాగుతుండటం గమనార్హం. దీంతోపాటు ప్రతీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా తన ఛరిష్మా పని చేస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వగైరా కారును గట్టెక్కిస్తాయంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో ఉన్న అనైక్యత కూడా తమను గట్టెక్కించటంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
ఇక కర్నాటక ఫలితాలు, విజయభేరీ సభలతో జోరు మీదున్న కాంగ్రెస్‌… ఈసారి ప్రభుత్వం తనదేననే ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తోడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటూ హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో చేపట్టబోయే బస్సు యాత్రలు, సోనియా, రాహుల్‌ సభలు, ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కారుకు బ్రేకు లేస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీకి ‘రిక్త హస్త’మిచ్చి… వెన్నుపోటు పొడిచే నాయకులపై నిఘాను పెంచటం ద్వారా ఎవరూ ‘చే’జారిపోకుండా ఉండేలా కాంగ్రెస్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ధరణి చిక్కులతోపాటు దళిత, బీసీ, మైనారిటీ బంధులోని లోపాలు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం కింద అర్హులైన వారందరికీ ఇండ్లు రాకపోవటం, ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు, వాటి వాయిదా తదితరాంశాల్లో బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు ఓట్లు రాలుస్తుందనే ఆశ కాంగ్రెస్‌ శ్రేణుల్లో కనిపిస్తోంది.
ఇక మొన్నటిదాకా తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ ఇప్పుడు చల్లబడింది. ఏది చేసైనా.. ఎలాగైనా 15 నుంచి 20 సీట్లు గెలిచేందుకు కమలం పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు చెబుతున్నట్టు సమాచారం. ‘కచ్చితంగా 15 నుంచి 20 సీట్లలో గెలవటానికి తీవ్రంగా శ్రమించండి. అందుకు కావాల్సిన ”సహాయ, సహకారాలను” అందజేస్తాం. అలా గెలవగలిగితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా…ఆ ప్రభుత్వాన్ని ఉల్టా ఫల్టా చేయొచ్చు. తద్వారా అధికార మార్పిడి చేయొచ్చు. ఈ విషయాన్ని గమనించి, సీరియస్‌గా పని చేయండి…’ అంటూ ఇటు అభ్యర్థులకు, అటు కార్యకర్తలకు బీజేపీ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బలం లేని జనరల్‌ నియోజకవర్గాల్లో కాకుండా కొంతలో కొంత కలిసొచ్చే ఎస్సీ, ఎస్టీ స్థానాలపై గురి పెట్టాలంటూ వారు సూచించినట్టు సమాచారం. అయితే దేశం మొత్తం మీద బీజేపీ ఎలాంటి జిమ్మిక్కులు చేసినా సరిపోతుంది గానీ… తెలంగాణలో మాత్రం దాని పప్పులుడకబోవంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఈ మూడు పార్టీలు గెలుపు కోసం కిందా మీదా పడుతున్న తరుణంలో… ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబరు మూడు వరకూ ఆగాల్సిందే.