మున్సిపల్‌ కార్మికులకు రూ.21వేల వేతనం అమలు చేయాలి

– కార్మికులు సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి
– మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ డిమాండ్‌
నవతెలంగాణ – సిరిసిల్ల :
మున్సిపల్‌ కార్మికులకు రూ.21వేల వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలకు సిద్దం కావాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం నెహ్రూ నగర్‌ లోని ఆర్‌ఎంపి భవన్‌ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ హాజరై మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో ఇస్తున్న మాదిరిగా కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా రూ.20లక్షలు వర్తింపజేయాలని, పీఎఫ్‌ పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోరాట కార్యచరణనను రూపొందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్‌ లలో పనిచేస్తున్న కార్మికులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు మూషం రమేష్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కాసారపు శంకర్‌, జిల్లా కార్యదర్శి గుర్రం అశోక్‌, సిరిసిల్ల మున్సిపల్‌ అధ్యక్షులు సుల్తాన్‌ నరసయ్య, మున్సిపల్‌ కార్యదర్శి పందుల మల్లేశం, సిరిసిల్ల – వేములవాడ మున్సిపల్‌ల నుంచి యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.