శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

నవతెలంగాణ-కొండపాక
విద్యార్థి దశలో ప్రాథమిక స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ఎంఈఓ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్‌ను పరిశీలించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక ఫలితాలు క్రింది స్థాయి వరకు చేరాలని, ప్రతి స్థాయిలో సైన్స్‌ వినియోగం పెరగాలని కోరారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే పెరుగుతున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఏ విధంగా రీసైక్లింగ్‌ చేయాలో విద్యార్థులు పరిశీలించాలన్నారు. సైన్సును చెడు పనుల కోసం కాకుండా మంచి పనుల కోసం ఉపయోగించాలన్నారు. అలాగే మండలంలోని పలు పాఠశాలల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కాగా రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన సైన్స్‌డేలో కుకునూరుపల్లి ఐటిఐ కళాశాల విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించారు. దుద్దెడ గురుకుల పాఠశాలలో కొండపాక ఉన్నత పాఠశాలలో సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు పలు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఆయా పాఠశాల విద్యార్థులు గుండె పనిచేయు విధానాన్ని, సివి రామన్‌ చిత్రపటాలను వేశారు.