లిఫ్ట్‌లో ఇరుక్కున్న సెక్యూరిటీ గార్డ్‌

– గంటన్నరపాటు నరకయాతన
– నిజామాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీలో ఘటన
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
ప్రమాదవశాత్తు సెక్యూరిటీ గార్డు లిఫ్టులో ఇరుక్కున్నాడు. కాళ్లు బయట, దేహం లిఫ్టు లోపల ఉండటంతో సుమారు గంటన్నరపాటు నరకయాతన అనుభవించాడు. ఫైర్‌ రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లిలో గల లావణ్య అక్రేడ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సదరు షాపింగ్‌ కాంప్లెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ హౌసింగ్‌ లోన్‌ బ్యాంక్‌లో మహేందర్‌గౌడ్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉదయం 8.30 గంటల సమయంలో వాష్‌ రూమ్‌ కోసం లిఫ్ట్‌లో వెళ్లి తిరిగి వస్తుం డగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దిగే క్రమంలో మధ్యలో లిఫ్టు ఆగిపోయింది. వెనుకకు జరిగి కుంగినట్టు కావడంతో జారి కాళ్లు ఇరుక్కు పోయాయి. కాళ్లు బయట.. బాడీ లోపల ఉండిపోయి ఇరుక్కున్నాడు. అరుపులు, కేకలు పెట్టినా.. ఆ సమయంలో పైన ఎవరూ లేకపోవడంతో అలాగే ఉండిపోయాడు. పైనకు వెళ్లిన ఆయన ఇంకా రాలేదని మరో సెక్యూరిటీ గార్డు వెళ్లి చూసి.. ఫైర్‌ సహాయక సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ ఫైర్‌ స్టేషన్‌ రెస్క్యూ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి అరగంటలో అతన్ని బయటకు తీశారు. గంటన్నర పాటు నరకయాతన అనుభవించిన సెక్యూరిటీ గార్డు మహేందర్‌గౌడ్‌ను లిఫ్టు నుంచి వెలుపలికి తీశాక 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు గంటలైనా సరిగా పట్టించు కోలేదని బాధితుడి కుటుంబీకులు వాపోయారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.