కులం, మతం చెప్పని వారికి ప్రత్యేక కాలమ్‌

– పిటిషనర్ల విజ్ఞప్తులపై చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర కుటుంబ సర్వేలో కులం,మతం చెప్పడానికి ఆసక్తి చూపని వారికి ప్రత్యేక కాలమ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నో క్యాస్ట్‌, నో రిలీజియన్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డిఎల్‌ కృష్ణ, మహమ్మద్‌ వహీద్‌ వేసిన పిటిషన్లను మంగళవారం హైకోర్టు విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జీఏడీ, సామాజిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, బీసీ కమిషన్లకు జస్టిస్‌ ఎస్‌.నంద నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే నెల మొదటి వారానికి వాయిదా వేశారు. తొలుత పిటిషనర్ల న్యాయవాది వాదిస్తూ, కులం. మతం వెల్లడించని వారి పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదని ఇదే హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఆ మాదిరిగానే సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వద్దనకునేవారి వివరాల సేకరణకు ప్రత్యేక కాలమ్స్‌ ఉండేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు