– హాకీ, క్రికెట్, షూటింగ్, బ్యాడ్మింటన్ అవుట్
– 2026 గ్లాస్గో కామన్‌వెల్త్ గేమ్స్
లండన్ : టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ భారీగా పతకాలు సాధించే క్రీడాంశాలను 2026 గ్లాస్గో కామన్‌వెల్త్ క్రీడల జాబితా నుంచి తొలగించారు. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ ఆతిథ్య దేశానికి వ్యయ భారంగా మారకూడనే ప్రణాళికలో భాగంగా బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ, క్రికెట్ సహా షూటింగ్‌లను క్రీడల జాబితా నుంచి తీసివేశారు. ఈ మేరకు కామన్‌వెల్త్ క్రీడల నిర్వాహకులు మంగళవారం వెల్లడించారు. బ్యాడ్మింటన్‌లో భారత్ ఇప్పటివరకు 10 స్వర్ణాలు సహా 31 పతకాలు సాధించింది. రెజ్లింగ్, షఉటింగ్‌లోనూ పతకాల పంట పండించింది. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ క్రీడల్లోనూ షఉటింగ్‌కు చోటు దక్కలేదు. తాజా గ్లాస్గో ప్రణాళికల్లోనూ షఉటింగ్‌ను తొలగించారు. హాకీ వరల్డ్‌కప్ సమీపిస్తున్న కారణంగా కామన్‌వెల్త్‌లో హాకీ క్రీడను పక్కనపెట్టడానికి కారణంగా చెప్పవచ్చు. 2026 కామన్‌వెల్త్ క్రీడలు కేవలం నాలుగు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ‘విలేజ్’ను నిర్మించటం లేదు. నగరంలోని హౌటల్స్‌లోనే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు బస ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రణాళికలు తయారు చేశారు. భారత్ పతకాలు పండించే క్రీడాంశాలను కామన్‌వెల్త్ క్రీడల నుంచి తొలగించటం పట్ల భారత క్రీడాకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.