పార్లమెంటులో మెజారిటీ లేకున్నా ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ తనకు సంక్రమించిన నిరంకుశ అధికారంతో నియమించిన ప్రధాని మైఖేల్ బార్నియర్ అవిశ్వాస తీర్మానంతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. దీంతో మరోసారి రాజకీయ, అధికార అనిశ్చితి తలెత్తింది. పార్లమెంటు ప్రతిఘటనతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఆరుగంటల్లోనే ఎత్తివేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు అభిశంసనను ఎదుర్కోనున్నాడు.యూన్ సుక్ యోల్ రాజీనామా చేసేంతవరకు నిరవధిక సమ్మె జరపనున్నట్లు కొరియా కార్మిక సంఘాల సమాఖ్య(కెసిటియు) ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ పని పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ సమ్మెలకు నోటీసులు, తేదీలను ప్రకటించిన పూర్వరంగంలో ఉత్తర కొరియా కమ్యూనిస్టుల నుంచి ప్రమాదం వచ్చిందని, ప్రతిపక్షాలు వారితో చేతులు కలుపుతూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు కుంటిసాకులు చెప్పాడు.
అత్యవసర పరిస్థితి ప్రకటించగానే దక్షిణ కొరియా మిలిటరీ పార్లమెంటు చుట్టూ మోహరించి, కార్యకలాపాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి అత్యవసరపరిస్థితి అమల్లోకి వస్తున్నట్లు చెప్పారు. అయితే చీకటి మాటున ప్రతిపక్షం, అధికార పక్షంలో అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తున్న వారు గోడలు దూకి, చాటుమాటుగా పార్లమెంటులో ప్రవేశించి అధ్యక్షుడి చర్యకు వ్యతిరేకంగా నాలుగు గంటల తరువాత తీర్మానం చేయటమే కాదు, అత్యవసర పరిస్థితి రద్దు ప్రకటన వెలువడే వరకు తాము పార్లమెంటు నుంచి బయటకు వచ్చేది లేదంటూ భీష్మించారు. దాంతో బుధవారం తెల్లవారుజామున 4.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరిపి ఆ మేరకు ప్రకటించారు. అధికారపక్ష ఎంపీలు కూడా గోడలు దూకిన వారిలో ఉన్నారంటే మిలిటరీ చూసీ చూడనట్లుగా లేకపోతే సాధ్యం కాదు. దీనంతటికీ కారకుడిగా భావిస్తున్న రక్షణ మంత్రి రాజీనామా చేసి తప్పుకున్నాడు. అధ్యక్షుడిని తొలగించేందుకు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టేందుకు నిర్ణయించారు. దానికి గాను అవసరమైన 200 ఓట్లకు గాను మరో ఎనిమిది మంది అధికారపక్షం వారు ఓటేస్తేనే నెగ్గుతుంది. దానికి సుప్రీంకోర్టు లోని తొమ్మిది మందికి గాను ఆరుగురు న్యాయమూర్తులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఫ్రాన్సు ఐదవ రిపబ్లిక్(1958 నుంచి) చరిత్రలో లేటు(73) వయస్సులో అధికారానికి రావటంలోనూ అత్యంత అల్పకాలం(మూడు నెలలు) అధికారంలో ఉన్న ప్రధానిగా మైఖేల్ బార్నియర్ చరిత్ర కెక్కాడు. ప్రధాని కాగానే నూతన యుగానికి ఆరంభం అని చెప్పాడు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు దేశం ఎక్కడికి పోతుందో తెలియదని హెచ్చరించి ఆప్రక్రియ ముగియగానే ఇంటిదారి పట్టాడు.పచ్చిమితవాద నేషనల్ రాలీ పార్టీ నాయకురాలు మేరీ లీపెన్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వరని బారియర్ వేసుకున్న అంచనాను తన రాజకీయంతో ఆమె వమ్ముచేశారు.వచ్చే ఏడాది జూలై వరకు పార్లమెంటును రద్దుచేసే అవకాశం లేకపోవటంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మక్రాన్ మరోసారి పెద్ద పక్షంగా ఎన్నికైన వామపక్షపార్టీని కాదని అడ్డగోలుగా మరో కొత్త ప్రభుత్వాన్ని నియమిస్తారా, చేసిన తప్పును సవరించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ప్రభుత్వ పతనం నిజానికి మక్రాన్‌కు తగిలిన ఎదురుదెబ్బ, స్వయంకృతమే. జనంలో గబ్బు పట్టిన ఆ పెద్దమనిషి పదవికి రాజీనామా చేస్తారా అంటే అదంతా భ్రమ అంటూ తిరస్కరించాడు.
పార్లమెంటు ఆమోదంతో నిమిత్తం లేకుండా కార్మికులపై భారాలు మోపేందుకు వీలు కల్పించే నిర్ణయం తీసుకోవటంతో ప్రతిపక్షం అవిశ్వాసతీర్మానం పెట్టి బార్నియర్ సర్కార్‌ను గద్దెదించింది. జీడీపీలో 60శాతానికి మించి అప్పు ఉండకూడదన్న ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలకు భిన్నంగా 112శాతం రుణంతో ఫ్రాన్సు ఉంది.మరిన్ని అప్పులు చేయకుండా లోటును తగ్గించే పేరుతో 60బిలియన్ యూరోల పన్ను విధింపునకు ప్రభుత్వం పూనుకుంది. సామాజిక భద్రత ముసుగులో పార్లమెంటులో చర్చ అవసరం లేని రాజ్యాంగ నిబంధనను ప్రయోగించింది. ఫ్రాన్సు, దక్షిణ కొరియా రెండు చోట్లా కార్మికవర్గంపై అక్కడి పాలకులు సాకులు చూపి, నిరంకుశ పద్ధతుల్లో కార్మికవర్గాన్ని అణచివేసేందుకు, భారాలు మోపేందుకు చూసిన తరుణంలోనే ఈ పరిణామాలు సంభవించాయి.