– కరువు పరిస్థితుల్లో గాజా ప్రజలు : నివేదిక
జెనీవా : గాజాలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనవచ్చు. ఇప్పటికే గాజాలో 5,76,000 పాలస్తీనియన్లు (జనాభాలో మూడో వంతు) ”తీవ్రమైన ఆకలి , కరువు” పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. యూఎన్‌కి చెందిన 23 ఏజన్సీలు మరియు ప్రభుత్వేతర సంస్థలు సంయుక్తంగా గురువారం ఈ నివేదికను విడుదల చేశాయి. గాజాలోని మొత్తం 2.3 మిలియన్ల జనాభాలో తీవ్ర స్థాయిలో ఆకలి ఎదుర్కొంటోంది మరియు ప్రతిరోజూ కరువు ప్రమాదం పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది.
గాజాలోని జనాభా మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని , ఆ జనాభాలో 5,76,600 మంది తీవ్రమైన ఆకలి లేదా కరువు పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. గాజాకు అందించే మానవతా సాయాన్ని పెంచాలని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎసీ)లో కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్ మరోరోజు ఆలస్యమైంది. గాజాలో తీవ్రమైన ఆహార అభద్రతతో ప్రభావితమైన కుటుంబాల నిష్పత్తి ప్రపంచవ్యాప్తంగా నమోదైన వాటిల్లో అతిపెద్దదని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపీసీ) గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గాజాలో ఆకలి తీవ్రత ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్థాన్, యెమెన్‌లలో కరువును కూడా అధిగమించిందని నివేదికలోని అంకెలు తెలుపుతున్నాయి. భారీ మొత్తంలో ప్రజలు కరువు బారిన పడటం ఇప్పటి వరకు చూడలేదని, కేవలం రెండు నెలల్లో గాజాలో ఆ పరిస్థితులు ఏర్పడ్డాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్ చీఫ్ ఎకనామిస్ట్ అరిఫ్ హుస్సేన్ తెలిపారు. అంటే గాజాలో పరిస్థితి ఆందోళనకరమని, ప్రతిఒక్కరూ ఆకలితో అల్లాడుతున్నారని హుస్సేన్ పేర్కొన్నారు. తగిన పోషకాహారం అందకపోవడంతో వారు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని అన్నారు. వచ్చే ఆరువారాల్లో గాజాలోని ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటారని నివేదిక పేర్కొంది. నాలుగు నెలల యుద్ధం అనంతరం ఫిబ్రవరి 7 నాటికి గాజాస్ట్రిప్‌లోని మొత్తం జనాభా ” ఆకలి సంక్షోభం లేదా అధ్వాన్న” పరిస్థితుల్లో ఉంటుందని 23 ఏజన్సీలు అంచనావేస్తున్నాయి. ఐపిసి ఐదు దశల ఆహార అభద్రత వర్గీకరణ ప్రకారం.. మూడవ దశలో సంక్షోభం, నాలుగు ఎమర్జెన్సీ, ఐదు విపత్తు లేదా కరువు పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. ఐపిసి ఏదైనా నిర్దిష్ట ప్రాంతం లేదా దేశం కోసం వర్గీకరించిన అధిక స్థాయి తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వ్యక్తులలో గాజా అత్యధిక వాటా కలిగి ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మావనతా సంస్థ కేర్ (సీఏఆర్‌ఈ) ఈ గణాంకాలను ఆందోళనకరం అని పేర్కొంది.
గాజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ కుటుంబంపై దాడి
పాత గాజాస్ట్రీట్‌లోని జాబాలియా నగరంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బుర్ష్ కుటుంబాన్ని ఇజ్రాయిల్ సైన్యం లక్ష్యం చేసుకుందని పాలస్తీనియన్ షెహాబ్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. ఈ దాడిలో అల్ బుర్ష్ తీవ్రంగా గాయపడగా, ఆయన కుమార్తె సహా 16 మంది మరణించినట్టు పేర్కొంది. మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయని ప్రకటించింది. గాజా నగరంలోని షేక్ రద్వాస్ జిల్లాలో అబు ఇస్కందర్ ప్రాంతంలో ఓ నివాసంపై ఇజ్రాయిల్ బాంబు దాడిలో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించినట్టు స్థానిక మీడియా తెలిపింది.