వక్తగా, ప్రొఫెసరుగా ఎంత గొప్పగా మాట్లాడుతాడో, అంతే గొప్పగా చిక్కని, చక్కని కవిత్వం రాసే కాశీం గుండె నిండా తాడిత పీడితులపై ప్రేమాభిమానాలు గల కవి. 1994 – 2014 మధ్య రాసిన కవిత్వాన్నంతా 90 కవితలు, ఐదు దీర్ఘ కవితలతో పుస్తకంగా తెచ్చారు. తెలంగాణ కోసం ఎంత తపించాడో అంతే బడుగు బలహీనుల అభ్యున్నతి కోసం తపించే నికార్సయిన వ్యక్తి కాశీం. ఈయన కవిత్వంలో రాజ్యహింస, సాయుధ పోరాటతత్వం, పాలకుల దమననీతి స్పష్టంగా కనబడ్డది.
‘వాడు’లో.. ‘నేను విద్యార్థులను ప్రేమించటమే/ నేరమంటున్నాడు’ అని చెప్తూ ‘వాడు/ అధర్మయుద్ధానికి సెంట్రి/ నేను పాలపిట్టకు చెలికాడ్ని’ అని ఒకవైపు రాజ్య దమననీతిని ప్రశ్నిస్తూ తనెవరో, ఎవరి పక్షమో చిన్న చిన్న మాటలతో చెప్తాడు.
మలిదశ తెలంగాణోద్యమంలో యువకులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం చూసి ‘వీరులు వెలిగించిన/ రణభూమిలో/ పొద్దు ఆత్మహత్య చేసుకోలేదు’ అంటూ యువకులకు భరోసాయిస్తూ, ‘బిడ్డలారా/ మీరు తెలంగాణలో పుట్టారని మర్చిపోవద్దు’ అంటూ ఒకవైపు తెలంగాణ ధీరత్వాన్ని తెలుపుతూ, మీరు ఆత్మహత్యలకు పాలుపడొద్దంటూ హితవు పలకడంతో కాశీంకున్న తెలంగాణ పట్ల ఆర్తిని తెలుసుకుంటాం.
రెండేసి పంక్తుల్లో ‘మనిషి’ మొదలగు వారికి కాశీం యిచ్చిన నిర్వచనం అపురూపంగా భావించాలి.
‘మనిషి’ కవితలో మనిషి కాలికిందపడి విరిగిన/ చీమకాలి శబ్దాన్ని విన్నవాడే/ కవి అని, మట్టి పెళ్ళలకింద చిట్లిన రక్తాన్ని/ మునివేళ్ళతో తాకినవాడే/ రచయిత, వెలివాడ కలల్ని/ గానం చేసినవాడే/ గాయకుడు అంటూ, చిందిన రక్తానికి/ కారిన కన్నీటికి/ కారణం అడిగిన వాడే/ మనిషి అనడంలో కాశీం వ్యక్తిత్వంతోబాటు సామాజిక చింతన, తనువంతా నింపుకున్న అర్హతగల వాడుగా కాశీం మనముందు కనబడ్తాడు.
‘తెలంగాణ’ కవితలో కాశీం తీసుకున్న ప్రతీకలు, పోలికలు చదువుతుంటే హృదయస్పందన మరింత పెరుగుతుంది.
‘రాజద్రోహం’ కవితలో ప్రజాకవులు, సామాజిక చింతనాపరులైన ఏ ప్రభుత్వమైనా పన్నే కుట్రకేసులకు ధీటుగా ఇలా సమాధానం చెప్తున్నాడు. ‘నేను తెలంగాణ గోసను/ ప్రజలతో సంభాషిస్తూ ఉంటాను/ పోలీసులకు కుట్ర కన్పించింది’, ‘తెలంగాణ కన్నీళ్ళను కలంలో నింపడం/ ద్రోహమైతే/ నేను రాజద్రోహం చేయడానికి సిద్ధం’ అని ప్రభుత్వానికి ఒక సవాలుగా చెప్తున్నాడు. ‘ఆర్ట్స్ కాలేజి’ ఔన్నత్యాన్ని చక్కగా వర్ణిస్తూ ‘గడ్డిపూల పెదవులపై అల్లిన/ చారిత్రక కావ్యం/ ఆర్ట్స్ కాలేజ్’ అని వర్ణిస్తూ ‘ఐదు లక్షల మంది ఈనింది/ ప్రసవించిన నెత్తుటి పొత్తిళ్ళలో/ ఉద్యమానికి కాపలా కాస్తుంది’ అని చెప్పడంలో కవిత్వీకరించే పదునైన కలం కాశీం చేతుల్లో ఉండడం చూడగలం.
ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళను ఎప్పుడూ వేధిస్తూనే వుంటాయనేది ప్రతిరోజూ వింటున్న మాటే. దీన్నే కాశీం ‘స్వేచ్ఛ’ కవితలో ‘ఈరోజు/ నా స్వేచ్ఛ/ మూడు రంగుల జెండాలో/ ప్రశ్నార్థకమైంది’ అంటాడు. ఇంకా వర్గీకరణకు సంఘీభావంగా ‘నా జాతి సాక్షిగా… ఊరి చివర నా గుడిసె సాక్షిగా/ ఉమ్మడి రిజర్వేషన్ సాక్షిగా/ ఇది/ తమ్ముడ్ని దోచుకుంటున్న/ అన్న సంగతి’ అంటూ కుండబద్దలు కొట్టినట్టు ఉమ్మడి రిజర్వేషన్ వ్యతిరేకతను కవిత్వీకరిస్తూన్న కాశీం కవిత్వాన్ని చదవడం వల్ల వలు సామాజిక సమస్యలతో పాటు రాజకీయార్థిక సమస్యల పట్ల మన ఆలోచనలను మరింత పటిష్ట పర్చుకోగలం.
– ఎనిశెట్టి శంకర్
9866630739