గొర్రెతోక బెత్తెడే ..!

ముడిచిన మెట్ట .. ముక్కున కమ్మి
పాలె మొలతాడు.. బద్దల గిడుగూ
గొర్రెలమందలో వాడో గొర్రై కలసిపోతాడు
ఆకాశాన్ని పచ్చడం జేసీ
బరికమ్మ పరుపుల మీద దొర్లీ దొర్లీ ..
పోగేసిన పిండ్రికల పెంట మీంచి
పొద్దుకు ఆహ్వానం పలుకుతాడు!
మట్టిబెడ్డల పొక్కళ్లపొయ్యి మీద ఎసరై మరిగీ ..
దానిగర్రలో చల్లారిన చెమటను
అంకుడాకుదొన్నలో జావజేసి తాగుతాడు
రాత్రంతా కంటికొమ్మల మీద వాలిన
కునుకుపిట్టను తోలీ
మందచుట్టూ కోరడిలా ప్రాణాలు పాతిన కోనారి
ఆకాశానికి దాపేసి రెక్కల దొనిగర్రతో మబ్బుల్ని తెంపి
మందకు మేతేస్తాడు !
ఎండముళ్లు గుచ్చుకుంటున్నా ..
శీతగాలి కమ్మకత్తై కోతపెడుతున్నా ..
మందసారాన్ని మట్టితల్లికి అందిస్తాడు
బగాదిపెట్టి పిడుగులు పడుతున్నా ..
కప్పుకున్న తట్టకమ్మలోంచి నీటిమొక్కై మొలుచుకొస్తాడు
కళ్లంపెండిని మంద మేసిందనీ
నాయుడు కొట్టిన కొరడా దెబ్బలకి
కనిపించే చుక్కల్ని కళ్లంట రాల్చుకొన్న ఎర్రిబాగులోడు!
మన్నెంకని మేకలమందతో అడివిపట్టీసి
ఇటికీపున్నమికి ఏడాదైనా ..
పిక్కురోడు మీద దేల బోయినపుడు
చంకనెత్తుకున్న గొర్రెపిల్లలో కొడుకుని జూసుకుంటాడు
టిర్‌.. టిర్‌.. అంటూ
పగలంతా నాయుడోళ్ల పొలాలమీద మందాసీ ..
పొద్దు వాలాక ముత్తుంగింజల బత్తెం కోసం
వాళ్ల మునివాకిట బేపిలా ఎదురుజూస్తే ..
గావంచాన రాలేవి సోలడు గింజలే
వాళ్ల పండగ పబ్బాల్లో
గుండెల్ని తప్పెటగుళ్లు జేసీ ఎంత బాదుకున్నా
గొల్లోడి బతుకు గొర్రెతోక బెత్తెడే ..!
మాయదారి రోగమేదో మబ్బై ముసిరి
మందను మింగేస్తే .. వాడు
ఓ తప్పిపోయిన గొర్రెపిల్లై తల్లడిల్లుతుంటాడు !!
– సిరికి స్వామినాయుడు, 9494010330