– అఫ్గాన్ చేతిలో అనూహ్య ఓటమి
– అఫ్గనిస్థాన్ 159/6, న్యూజిలాండ్ 75/10
టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్ న్యూజిలాండ్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. గ్రూప్-సి తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (80) మెరుపులతో తొలుత అఫ్గాన్ 159 పరుగులు చేయగా.. ఛేదనలో కివీస్ కుప్పకూలింది. 15.2 ఓవర్లలో 75 పరుగులకే చేతులెత్తేసింది. టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గనిస్థాన్‌కు ఇదే తొలి విజయం.
నవతెలంగాణ-ప్రొవిడెన్స్
పసికూన కాదు. ఫేవరేట్లను సైతం పరాజితులను చేయగల సత్తా ఉన్న జట్టుగా అఫ్గనిస్థాన్ మరో మెరుపు విజయం సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ గ్రూప్-సిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్ ఘన విజయం సాధించింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (80, 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (44, 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో తొలుత అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ అనూహ్యంగా కుప్పకూలింది. పేసర్ ఫరూకీ (4/17), స్పిన్నర్ రషీద్ ఖాన్ (4/17) నాలుగు వికెట్ల మ్యాజిక్‌తో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (18, 18 బంతుల్లో 2 ఫోర్లు), మాట్ హెన్రీ (12, 17 బంతుల్లో 1 సిక్స్) మాత్రమే కివీస్ తరఫున రెండెంకల స్కోరు సాధించారు. అఫ్గాన్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గ్రూప్-సిలో వరుసగా రెండో విజయం సాధించిన అఫ్గనిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇదే గ్రూప్‌లో వెస్టిండీస్ సైతం ఉండటంతో.. గ్రూప్ దశలోనే ఓ అగ్ర జట్టు నిష్క్రమించనుంది.