– ఆప్ అభ్యర్థి విజేత
– చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వివాదానికి కేంద్ర బిందువుగా మారిన చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించింది. దీంతో ఆప్‌కు భారీ విజయం సొంతమైంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎనిమిది బ్యాలెట్ ఓట్లను చెల్లుబాటు చేయకపోవటంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఎన్నికలో విజేతగా తేలారు. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీ ద్వారా చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యేవనీ, అవి ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌కు అనుకూలంగా ఉన్నాయని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌కు అనుకూలంగా పోలైన ఎనిమిది ఓట్లను పాడు చేసేందుకు అనిల్ మసీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ధర్మాసనం వెల్లడించింది. ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షించడం న్యాయస్థానం విధి అని ధర్మాసనం తెలిపింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీపై కూడా కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ అయ్యాయి. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, వీడియోను సమర్పించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి, మూడు పదవులను నిలబెట్టుకుని, కాంగ్రెస్-ఆప్ కూటమిని ఓడించింది. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీV్‌ా అవకతవకలు చేశారని ఆరోపిస్తూ, తాజా ఎన్నికలను కోరుతూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో సర్వోన్నత న్యాయస్థానం ఆప్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది.