నిశ్శ‌బ్ద పర్యావ‌ర‌ణ సంక్షోభం

డా||కె.శశిధర్‌ ‘మట్టిికి మరణించే హాక్కు లేదు… అది చచ్చినట్టు బతకాల్సిందే’ అంటారు ప్రముఖ కవి కె. శివారెడ్డి. సరిగ్గా ఇలాంటి నినాదంతోనే ప్రపంచం ఈ సంవత్సరపు పర్యావరణ దినోత్సవ వేడుకలు జరుపుకోడానికి సమాయత్తమవుతుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు, సవాళ్లు పరిష్కరించే దిశగా సమస్త ప్రజానికాన్ని చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఏటా జూన్‌ 5వ తేదీన నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఈ సంవత్సరం ‘మన భూమి.. మన భవిష్యత్తు’ అనే నినాదంతో జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను కోరింది. అత్యంత వేగంగా తరిగిపోతున్న భూవనరులని తిరిగి పునరుద్ధరించకపోతే మానవ మనుగడే కాదు, సృష్టిలోని సమస్త జీవరాశి మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందనే విషయాన్ని గుర్తించి, భూమిని క్షీణత నుండి కాపాడుకోడానికి, ఇప్పటికే క్షీణతకు గురైన భూమిని శుద్ధి చేసి తిరిగి పునరుద్ధరించుకోడానికి ప్రపంచ మానవులంతా ఒక్కటి కావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ, కరువుని ఎదుర్కొవటం అనే అంశాల ప్రాతిపదికగా జరుగుతున్న ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకి సౌదీ అరేబియా దేశం సారధ్యం వహిస్తుంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న పశ్చిమ ఆసియా దేశాలలో రెండవ దేశంగా సౌదీ అరేబియా నిలుస్తుంది. 2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా క్షీణిస్తున్న భూమిని 50 శాతం పునరుద్ధరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ‘గ్రూఫ్‌ ఆఫ్‌ 20 గ్లోబల్‌ ల్యాండ్‌ ఇనిషియేటివ్‌’ లో సౌదీ అరేబియా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల భూమి క్షీణతను, ఎడారీకరణను ఎదుర్కొనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకులకి సారధ్యం వహించే అవకాశం సౌదీ అరేబియాకి లభించింది.
పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి నేడు అనేక పర్యావరణ సమస్యలతో సతమతమవుతుంది. జీవజాతుల మనుగడే కాదు, పంచభూతాల స్వచ్ఛత కూడా నేడు ప్రశ్నార్ధకమవుతుంది. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకీ, సవాళ్లకీ మానవుడే కారణం. మానవుడు పుట్టక ముందే ఈ సృష్టిలో అనేక జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. మానవుడు అభివృద్ధి పేరుతో చేపడుతున్న అనేక స్వార్ధపూరిత చర్యల వల్ల పర్యావరణం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం ఎంతటి ప్రమాదకరమంటే, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు మరింత విషమిస్తే మానవ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం మానవుని అనాలోచిత చర్యలే పర్యావరణం ఎదుర్కొంటున్న ఈ విషమ స్థితికి కారణం. వాతావరణంలోకి నిత్యం పెద్దయెత్తున్న విడుదలవుతున్న కలుషితాల వల్ల ఋతువులు గతి తప్పాయి. సహజవనరులు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. కోట్లాది ఎకరాల సాగు భూములు తమ సారాన్ని కోల్పోయి బీడు భూములుగా మారిపోతున్నాయి. ప్రపంచానికి పరిశుభ్రమైన ప్రాణవాయువుల్ని అందించటం ద్వారా జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన శ్వాసకోశాలుగా పిలువబడే అడవులు అత్యంత వేగంగా అంతరించిపోతున్నాయి. జీవులన్నీ చావుకు దగ్గరవుతున్నాయి. జల వనరులన్నీ విషతుల్యమై పోతున్నాయి. జీవించడానికి కావాల్సిన సత్తువనిచ్చే ఆహారం కూడా కలుషితమై ప్రాణాలను హరించే హంతకిగా మారిపోయింది. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణ్రోగ్రతల వల్ల భూగోళమంతా మండుతున్న అగ్నిగుండమయ్యింది. సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్‌ పొర విచ్ఛినమై పోయింది. భూవాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ధృవప్రాంతాల్లోని మంచుశిఖరాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. ధృవ ప్రాంతాల నుండి పెద్దయెత్తున్న నీరు వచ్చి చేరటం వల్ల సముద్రాలన్నీ కట్టలు తెంచుకుని ఉప్పొంగుతున్నాయి. తీరప్రాంతాలన్నీ మృత్యు భయంతో విలవిల్లాడుతున్నాయి. నేల, నింగి, గాలి అన్న తేడా లేదు. అన్నీ కాలుష్య కేంద్రాలుగా మారిపోయాయి. పారిశ్రామిక శకం ప్రారంభమైన అనంతరం అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశకర చర్యల వల్ల వెదజల్లబడుతున్న కలుషితాలు వాతావరణాన్ని తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్య కర్బన ఉద్గారాల వల్ల భూవాతావరణం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కిపోతుంది. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పెద్దయెత్తున్న వెదజల్లబడుతున్న కాలుష్యం భూమ్మీద జీవరాశుల మనుగడతో పాటు, ఆ మనుగడలో కీలకపాత్ర పోషిస్తున్న భూమి, అడవులు, గాలి వంటి జీవ వనరులు తమ జీవత్వాన్ని అత్యంత వేగంగా కోల్పోతున్న సంకట పరిస్థితులలో మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సం జరుపుకుంటున్నాం.
జూన్‌ 5నే ఎందుకు…
మానవునిపై పర్యావరణం కలిగించే ప్రభావాన్ని చర్చించే లక్ష్యంతో 1972లో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి ఒక అంతర్జాతీయ సదస్సును స్వీడన్‌లోని స్టాకహేోంలో నిర్వహించింది. 1972 జూన్‌ 5వ తేది నుండి 16వ తేది వరకు జరిగిన ఈ సదస్సుని ‘స్టాకహేోం కాన్ఫరెన్స్‌ ఫర్‌ ది హ్యూమన్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అని కూడా పిలుస్తారు. అత్యంత ఉన్నత లక్ష్యంతో ప్రారంభించబడిన ఈ సదస్సులో సుమారు 114 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుండి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఒక చారిత్రక ప్రసంగం ప్రపంచ దేశాలని విశేషంగా ఆకర్షించింది. ‘నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న, లేదా రానున్న కాలంలో ఎదుర్కొబోతున్న పర్యావరణ సమస్యలకీ అభివృద్ధి చెందిన అగ్రదేశాలే ప్రధాన కారణమని, అందువల్ల పర్యావరణ సమస్యలను పరిష్కరించే దిశలో అగ్రదేశాలే కీలక పాత్రను పోషించాలని’ ఆమె స్పష్టం చేశారు. అగ్రదేశాల పాపాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్దటం సరికాదని, పేదరికం, ఆకలి వంటి సమస్యలతో సతమతమవుతున్న దేశాలకు ఇది మరింత భారాన్ని కలిగిస్తుందని ఆమె చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను ఆలోచనలో పడవేసింది. అనంతరం ఈ సదస్సు అనేక తీర్మానాలని చేసింది. దానిలో భాగంగానే పర్యావరణ అంశాలపై ప్రపంచ దేశాలని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విధంగా 1972లో యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌ఇపి) ప్రారంభమయ్యింది. అప్పటి నుండి పర్యావరణ అంశాలపై జరిగే అనేక అంతర్జాతీయ కార్యక్రమాలకి యుఎన్‌ఇపి నాయకత్వం వహిస్తుంది. ప్రపంచాన్ని, మానవ, జీవ మనుగడను కలవర పెడుతున్న అనేక పర్యావరణ అంశాలపై ఆయా దేశాల ప్రజలకి అవగాహాన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. దీంతో 1973లో ‘ఒకే ఒక భూమి’ అనే నినాదంతో ప్రపంచ దేశాలన్నీ మొదటిసారి పర్యావరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. సరిగ్గా 51 సంవత్సరాల అనంతరం ‘మన భూమి.. మన భవిష్యత్తు’ అనే నినాదంతో 2024 సంవత్సరపు పర్యావరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.
జీవుల మనుగడకు భూమే ఆధారం…
నిజానికి ఈ భూమ్మీద ఏ జీవి మనుగడకైనా ఆహారమే ప్రధానం. సృష్టిలోని సమస్త జీవరాశి మనుగడకు అవసరమైన ఆహారాన్ని, ఆవాసాన్ని అందించేది భూమాతే. జీవ పరిణామ క్రమంలో అత్యంత విలువైన, సమర్ధవంతమైన, సజీవమైన పాత్రను పోషించిన భూమి నేడు అత్యంత వేగంగా క్షీణతకు గురి కావటం విషాదం. కాలుష్యం, భూతాపం వంటి పర్యావరణ సమస్యల వల్ల ఏటా లక్షల ఎకరాల్లో భూమి బీడు బారిపోతుంది. కోట్లాది జీవరాశుల మనుగడకు అవసరమైన ఆహారానికి జీవం పోసే భూమి నేడు తనకు తానుగా జీవాన్ని కోల్పోయి నిర్జీవంగా మారిపోతుండటం మరొక అతిపెద్ద విషాదం. మానవ ప్రేరిత చర్యల వల్ల ఏటా కనీసం 1.6 బిలియన్‌ హెక్టార్ల భూమి క్షీణతకు గురవుతుందని, ఇది సుమారు 3.2 బిలియన్ల ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పర్యావరణ వ్యవస్ధలలో మార్పులు రావటం వల్ల సంభవిస్తున్న వర్షాభావ పరిస్థితుల కారణంగా జలవనరులు తగ్గిపోగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిలోని పోషకాలు నశించి పోవటం వల్ల పెద్దయెత్తున భూమి క్షీణతకు గురై ఎడారిగా మారిపోతుంది. గడిచిన 10 సంవత్సరాలలో సుమారు 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఎడారిగా మారిపోయింది. యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసర్టిఫికేషన్‌ (యుఎన్‌సిసిడి) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మానవ ప్రేరిత చర్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100దేశాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎడారీకరణ వల్ల 1 బిలియన్‌ ప్రజల జీవన స్థితిగతులు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని పేర్కొంది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే రానున్న 10 సంత్సరాల్లో 40 శాతానికి పైగా భూమి తన జీవత్వాన్ని కోల్పోయి ఎడారిగా మారిపోతుందని ఆ నివేదిక అంచనా వేస్తుంది. భూక్షీణత వల్ల 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటారని ఆ సంస్ధ హెచ్చరిస్తుంది. దీంతో కోట్లాది మంది ప్రజలు పర్యావరణ శరణార్ధులుగా మారి పొట్ట చేత బట్టుకుని ఇతర ప్రాంతాలకు, లేదా ఇతర దేశాలకు వలస పోవాల్సి వస్తుంది.
ఇప్పటికే సముద్రమట్టాలు అనూహ్యంగా పెరగటం, లక్షలాది ఎకరాలు భూములు ఎడారులుగా మారటం వల్ల సముద్రతీర ప్రాంతాలకు చెందిన కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులై వాతావరణ శరణార్ధులుగా మారిపోతున్నారు. వాతావరణంలోని మార్పుల కారణంగా సంభవిస్తున్న వరదలు, తుఫానుల వల్ల కోట్లాది మంది ప్రజలు తమతమ ఆవాసాలను కోల్పోతున్నారు. 2011లో థారులాండ్‌లో సంభవించిన వరదల వల్ల సుమారు 13.6 మిలియన్‌ ప్రజలు నష్టపోయారు. సుమారు 20 వేల చదరపు కిలోమీటర్ల మేర సారవంతమైన భూమి తన సారాన్ని కోల్పోయి నిరుపయోగంగా మారిపోయింది. అదే సంవత్సరంలో జపాన్‌లో సంభవించిన సునామీ వల్ల సుమారు 1లక్షా 46వేలకు పైగా ఇళ్లు ధ్వంసమవ్వటం వల్ల వారంతా వాతావరణ శరణార్ధులుగా మారిపోయారు. పర్యావరణ సంక్షోభం వల్ల ఉన్న ఆవాసాలను కోల్పోయి శరణార్ధులుగా మారిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని పర్యావరణ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. 2020 నాటికి 50 మిలియన్లు పర్యావరణ శరణార్ధులుగా ఉన్నారని, 2050 నాటికి వీరి సంఖ్య 200 మిలియన్లకి పెరిగే అవకాశముందని ఆ సంస్ధల నివేదికలు తెలియచేస్తున్నాయి. తృతీయ దేశాలుగా పిలవబడుతున్న ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని దేశాలకు చెందిన అధికశాతం ప్రజలు పర్యావరణపరంగా దుర్భలమైన ప్రాంతాలలో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలకు చెందిన మూడింట ఒక వంతు కంటె ఎక్కువ ప్రాంతంలో పర్యావరణ వ్యవస్ధలు అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నాయని నివేదికలను బట్టి తెలుస్తుంది. అందులో 80 శాతం మంది ప్రజలు దక్షిణ అమెరికాలో జీవిస్తుంటే, 60 శాతం మంది ప్రజలు ఆసియాలోను, 50శాతం మంది ప్రజలు ఆఫ్రికా దేశాలలోను జీవిస్తునారు. వీరందరి జీవనం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతుంది. పర్యావరణంలో తలెత్తే ఈ పరిస్థితుల వల్ల ఆవాసం కోల్పోయిన కోట్లాది మందికి తిరిగి ఆశ్రయం కల్పించటం ఆయా దేశాలకు తలకు మించిన భారమవుతుంది. దీంతో కోట్లాదిమంది ఆవాసాన్ని కోల్పోయి బతకటం కోసం ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకి శరణార్ధులుగా తరలిపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటారు. అలా శరణార్థులుగా వచ్చిన వారిని ఏ దేశమూ అక్కున చేర్చుకునే అవకాశం కూడా ఉండదు. అత్యంత వేగంగా సహజవనరులు తగ్గిపోతున్న వేళ, వాతావరణ శరణార్థులకు ఆశ్రయమివ్వటం ఆయా దేశాలకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయా దేశాల్లోకి పెద్ద సంఖ్యలో శరణార్ధులు తరలివస్తే ఆహారపు సమస్య, ఆవాసపు సమస్య తలెత్తే అవకాశముంది. ఇప్పటికే అనేక దీవులు సముద్రం పాలై పోయాయి. ఆయా దీవుల్లో జీవిస్తున్న వారంతా ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. తమతమ ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో జీవనం సాగించిన వారంతా ఇతర ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులలో జీవించటం ఈ శతాబ్దపు మహా విషాదం.
ధ్వంసమవుతున్న జీవ వైవిధ్యం
ప్రపంచవ్యాప్తంగా పెద్దయెత్తున్న జరుగుతున్న భూమి క్షీణత, ఎడారీకరణ వల్ల మానవుడితో పాటు, జీవరాశుల మనుగడ సైతం ప్రశ్నార్ధకంగా మారింది. గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఔట్‌లుక్‌ నివేదిక ప్రకారం భూమ్మీద అన్ని ఆవరణ వ్యవస్ధలలోనూ కలిపి మొత్తం 140 మిలియన్‌ జీవజాతులు నివశిస్తున్నాయని, వాటిలో కేవలం 1.74 మిలియన్‌ జాతులను మాత్రమే ఇప్పటి వరకూ మానవుడు గుర్తించటం జరిగిందని తెలుస్తుంది. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయుసిఎన్‌) ఏటా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులపై నివేదికను వెల్లడిస్తుంది. ఐయుసిఎన్‌ తాజా నివేదిక భూమ్మీద నివశించే వాటిలో 11వేలకు పైగా జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని తెలియచేస్తుంది. పర్యావరణం సంక్షోభం వల్ల వాతావరణంలో వస్తున్న అనేక మార్పులు ఇలాగే కొనసాగితే రానున్న రెండు దశాబ్దాలలో 2 లక్షల 50వేలకు పైగా జీవజాతులు అంతరించి పోతాయని ఒక అంచనా. 80వ దశకంలో రోజుకొక జీవి అంతరించిపోతే, 90 దశకం నాటికి రోజుకొక జీవి అంతరించిపోయేదని, ప్రస్తుతం గంటకు పదికి పైగా జీవులు అంతరించి పోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాలలో 7వ స్థానంలో ఉన్న భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం విధ్వంసం శరవేగంగా సాగుతుందని అధ్యయనాల వల్ల తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 27 వేలకు పైగా జీవజాతులు అంతరించిపోతున్నాయని, రానున్న 30 సంవత్సరాలలో 20శాతానికి పైగా జీవజాతులు పూర్తిగా అంతరించిపోయే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు 24శాతం క్షీరదజాతులు, 12 శాతం పక్షిజాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 75 శాతం జన్యు పంటలు అంతరించిపోయాయి. భూమ్మీద జీవరాశుల మనుగడ మునుపెన్నడూ లేనంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. గడుస్తున్న ప్రతి గంటకి పదుల సంఖ్యలో జీవజాతులు అంతరించి పోతున్నాయంటే జీవవైవిధ్య విధ్వంసం ఎంత వేగంగా కొనసాగుతుందో అంచనా వేయవచ్చు. మానవుడు గుర్తించని వేలాది జీవులు ఇప్పటికే అంతరించిపోయాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భూమ్మీద నివశించే జీవజాతులలో 75శాతం పైగా జాతులు అంతరించిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యావ్తంగా వేలాది ఎకరాల్లో పచ్చిక బయళ్లు ధ్యంసం కావటం వల్ల కూడా మేత లేక ఏటా లక్షలాది పశువులు మృత్యువాత పడుతున్నాయని, వీటిని రక్షించుకోవాలంటే భూమి క్షీణతను అరికట్టి, తిరిగి వాటిని పునరుద్ధరించటం ఒకటే మార్గమని పర్యావరణ వేత్తలు హితవు పలుకుతున్నారు.
భారతదేశంలో ఎడారీకరణ…
భూమిని పుడమితల్లిగా పూజించే భారత్‌ వంటి దేశాలలో కూడా భూమి క్షీణత, ఎడారీకరణ అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి. వాతావరణ మార్పులు, మానవ ప్రేరిత చర్యల వల్ల భారత దేశంలో 32 శాతం భూమి క్షీణతకు, 25 శాతం భూమి ఎడారీకరణకు గురవుతుందని భారత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసర్టిఫికేషన్‌ (యుఎన్‌సిసిడి) భారతదేశంలో 2015 నుండి 2019 వరకూ అంటే నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు 30.51 మిలియన్‌ హెక్టార్ల భూమి క్షీణతకు గురై బీడు బారిపోయిందని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం 2019 నాటికే దేశ భూభాగంలో సుమారు 9.45శాతం భూమి క్షీణతకు గురయ్యింది. 2023లో విడుదల చేసిన తాజా నివేదికలో భారతదేశ జనాభాలో దాదాపు 18.39 శాతం మంది ప్రజలు భూక్షీణత, ఎడారీకరణ వల్ల అనేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ 2021లో విడుదల చేసిన డిసర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డిగ్రడేషన్‌ అట్లాస్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం దేశంలో సుమారు 96.40 మిలియన్‌ హెక్టార్లు భూమి అంటే దేశ భౌగోళిక విస్తీర్ణంలో 29.32 శాతం భూమి క్షీణతకు గురయ్యిందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో భూమి క్షీణత అధికంగా కనిపిస్తుందని, రాజస్ధాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, జమ్మూకాశ్మీర్‌, కర్ణాటక, జార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో 23.95 శాతం భూమి క్షీణతకు గురవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. జార్ఖండ్‌, రాజస్ధాన్‌, ఢిల్లీ, గుజరాత్‌, గోవా వంటి రాష్ట్రాలలో విస్తీర్ణంలో 50 శాతం కన్నా ఎక్కువ భూమి ఎడారీకరణకు గురవుతుంటే.. కేరళ, అస్సాం, మిజోరం, హార్యానా, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, అరుణాచల ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కేవలం 10 శాతం కన్నా తక్కువ విస్తీర్ణంలో భూములు ఎడారీకరణకు గురవుతున్నాయని ఈ నివేదిక తెలియ చేసింది. భారతదేశంలోని గ్రేటర్‌ నోయిడాలో ‘భూమిని పునరుద్ధరించండి… భవిష్యత్తును కొనసాగించండి’ అనే అంశం మీద 2019లో జరిగిన యుఎన్‌సిసిడి 14వ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాఫ్‌ 14) యొక్క ఉన్నతస్ధాయి సదస్సును భారత ప్రధాని మోడీ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘భారతీయ సంస్కృతిలో భూమిని తల్లిగా భావించి పూజిస్తామని, అటువంటి భూమి తన సారాన్ని కోల్పోయి నిర్జీవంగా మారటం అత్యంత ఆందోళన కలిగించే అంశమ’ని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు నీటి సంక్షోభం కూడా ఒక కారణమని, భూమి క్షీణతను తగ్గించడానికి వీలుగా యుఎన్‌సిసిడి గ్లోబల్‌ వాటర్‌ యాక్షన్‌ ఎజెండా ఒక దానికి రూపకల్పన చేయాలని కోరారు. భారతదేశంలో అమలు చేస్తున్న అనేక పర్యావరణ పరిరక్షణ చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని, 2015 నుండి 2017 వరకు చేపట్టిన అటవీ సంరక్షణ చర్యల వల్ల దేశంలో 3 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించబడ్డాయని తెలిపారు. భూమి క్షీణతను తగ్గించి తద్వారా ఎడారీకరణను నిలుపుదల చేసే లక్ష్యంతో చేపడుతున్న ల్యాండ్‌ డిగ్రడేషన్‌ న్యూట్రాలిటీ కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
హరిత విప్లవమూ ఒక కారణమే…
భారతదేశంలో ఎడారీకరణకు, భూమి క్షీణతకు హారిత విప్లవం పేరుతో అనుసరించిన విధానాలు కూడా ఒక ప్రధాన కారణమే. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన హారిత విప్లవం నేడు నేలను నిర్జీవంగా మార్చే ప్రక్రియకు ప్రధాన కారణమవుతుంది. విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగం, యాంత్రిక వ్యవసాయీకరణ, ఏకరూపక వ్యవసాయ సంస్కృతి మన దేశానికి హరిత విప్లవం అందించిన విధానాలు. ఇవే ఇప్పుడు పుడమి పాలిట శాపాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా హరిత విప్లవ కాలంలో అనుసరించిన వ్యవసాయక విధానాల వల్ల నేల నిర్మాణం పూర్తిగా మారిపోయింది. దీంతో పాటు అభివృద్ధి పేరుతో పెద్దయెత్తున్న సాగుతున్న అటవీ విధ్వంసం, అడ్డు అదుపూ లేకుండా సాగుతున్న పట్టణీకరణ వంటి అంశాలు పరిస్థితిని మరింత విషమం చేస్తున్నాయి. ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌ (థేరీ) అంచనా ప్రకారం భూమి క్షీణత వల్ల భారతదేశం ఏటా 48.8 బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్ధికంగా నష్ట పోతుందని స్పష్టం చేసింది. భారతదేశం కూడా భూమి క్షీణతను తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని 2015లో పారీస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ సదస్సులో ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 26 మిలియన్‌ హెక్టార్ల భూమిని తిరిగి పునరుద్ధరించే లక్ష్యంతో ఖాఫ్‌ పార్టీస్‌ చేపట్టిన బాన్‌ ఛాలెంజ్‌లో కూడా భారత భాగస్వామిగా మారింది. అయితే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎడారీకరణ, భూక్షీణతను సమర్ధవంతంగా ఎదుర్కొడానికి భారతదేశానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవటం విచారకరం.
ముంచుకొస్తున్న ముప్పు…
భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వల్ల ఒక పక్క సముద్రమట్టాలు పెరుగుతుంటే, మరొక పక్క ధృవ ప్రాంతాలలోని మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. పెరుగుతున్న సముద్రమట్టాలు తీరప్రాంత ప్రజలను భయకంపితుల్ని చేస్తుంది. ఒక పక్క పెద్ద సంఖ్యలో జీవులు అంతరించిపోతుంటే, మరొక పక్క తీరప్రాంతాలకు చెందిన కోట్లాది మంది మానవులు తమ ఆవాసాన్ని, మాతృదేశాలను కోల్పోతున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంతాలను ముంచెత్తటంతో వారంతా ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితిలోకి బలవంతంగా నెట్టబడుతున్నారు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం భూమ్మీద ఉష్ణోగ్రతలు, ఏటా సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ చొప్పున పెరుగుతూ ఉన్నాయి. వాతావరణంలో 1.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగితే సముద్ర తీరప్రాంతాలలో ఉండే వేలాది దీవులు నీట మునిగిపోయే ప్రమాదముంది. భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే 2030 నాటికి విశ్వవ్యాప్తంగా సుమారు 166 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ఉత్తర, దక్షిణ ధృవాలలోని మంచు మరింత కరిగి సముద్రమట్టాలు అనూహ్యంగా పెరుగుతాయని ప్రపంచబ్యాంకు హెచ్చరిస్తుంది. ఇదే జరిగితే సముద్రతీర ప్రాంతాలలోని అనేక ప్రఖ్యాత నగరాలుగా పేరొందిన మాన్‌హట్టన్‌, లండన్‌, చైనాలోని షాంఘై మహానగరం, జెర్మనీకి చెందిన హాంబర్గ్‌, బంగ్లాదేశ్‌కి చెందిన బ్యాంకాంగ్‌, ఇండోనేషియాకి చెందిన జకార్తా, మన దేశంలోని ముంబై, మనీలా, ఫిలిప్పీన్‌ దీవులతో పాటు, ఇటలీలోని వెన్నీస్‌ వంటి పురాతన నగరాలు కూడా నీట మునిగి పోవటం ఖాయమని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పటికే మాల్దీవులలోని 1200కి పైగా చిన్నచిన్న ద్వీపాలు సముద్రంలో మునిగిపోయాయి. ఆయా ద్వీపాలలోని ప్రజలను రక్షించి ఆస్ట్రేలియా, ఇండియా వంటి దేశాలలో పునరావాసం కల్పించాలని ఆయా దేశాలకు చెందిన నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్లాది మంది తీరప్రాంత దేశాలకు చెందిన ప్రజలు తమ ఆవాసాన్ని కోల్పోవటంతో పాటు, లక్షలాది ఎకరాలు ఉప్పునీటిలో మునిగిపోవటం వల్ల సాగుభూమి కొరత ఏర్పడి, ఆయా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముంది. గడిచిన దశాబ్దకాలంలో 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఎడారిగా మారిపోయింది. వర్షాభావ పరిస్థితులు, జల వనరులు తగ్గిపోవటం, భూతాపం వల్ల నేలలోని మూలకాలు నశించిపోవటం వల్ల వేలాది ఎకరాల సాగుభూమి ఎడారిగా మారిపోతుంది. ఇది రానున్న రోజులలో ఆహార సంక్షోభానికి కారణమవ్వటంతో పాటు, వేలాది జీవుల మరణానికి కారణమవుతుంది.
భూమి కోసం దేశాల మధ్య అంతర్యుద్ధాలు తప్పవు…
ఒక దేశం మీద ఇంకొక దేశం, ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం ఆధిపత్యం కోసం దాడులు చేసుకోవటం మనం చూశాం. కానీ పర్యావరణం సంక్షోభం వల్ల ఆయా దేశాల్లో సంభవిస్తున్న మార్పుల వల్ల దేశాల మధ్య రానున్న రోజులలో అంతర్యుద్ధాలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే జలవనరుల వినియోగంలో అనేక దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ వివాదాలను పరిష్కరించడానికి అనేక సంస్థలు, కోర్టులు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అవి మరింత జఠిలమవుతున్నాయి తప్ప పరిష్కారానికి నోచుకోవటం లేదు. భవిష్యత్తులో తరిగిపోతున్న ఆవాసం, ఆహార వనరుల కోసం, దానికి మూలమైన భూమి కోసం వివిధ దేశాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య అంతర్యుద్ధాలు తప్పవని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సహజవనరుల కోసం వివిధ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటం మనం నేడు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాల సాగుభూములు కలుషితమై తన సారాన్ని కోల్పోయి ఎడారులుగా మారిపోయాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన విధంగా భూమి, సహజవనరులు పెరగటం లేదు, సరికదా అంతకన్నా రెట్టింపు వేగంగా అంతరించిపోతున్నాయి. పెరుగుతున్న సముద్రమట్టాలు, విస్తరిస్తున్న ఎడారీకరణ, తరిగిపోతున్న సహజవనరులు, అడుగంటుతున్న భూగర్భ జలాల వల్ల కోట్లాది మంది ప్రజలు పర్యావరణ శరణార్ధులుగా మారి ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఈ వలసల వల్ల స్ధానికులను, వాతావరణ శరణార్ధులకి మధ్య వనరుల కోసం ఘర్షణ తలెత్తుతుంది. దీన్నే డార్విన్‌ జీవుల మధ్య పోరాటంగా అభివర్ణించాడు. అయితే నేడు జీవుల మధ్య తలెత్తున్న ఈ ఘర్షణను పర్యావరణ సంక్షోభంలో అంతర్భాగంగా చూడాల్సి ఉంటుంది. సకల జీవరాశులకు జీవం పోసే మట్టి జీవాన్ని కోల్పోయి నిస్సారంగా మారితే సృష్టిలోని సకల జీవరాశుల మనుగడ ఒక పెను సంక్షోభంలో పడుతుంది. ఈ సంక్షోభాన్ని అరికడితేనే జీవుల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది, లేకుంటే వినాశనమే.
(జూన్‌ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
డా||కె.శశిధర్‌