తరలిపోయిన పాటగాడు

Pata అతనికి పాటంటే ఇష్టం. మనకు అతని పాటంటే ఇష్టం. పాట ఉన్న చోట అతడుంటాడు. అతని పాట ఉన్న చోట మనముంటాం. పాటతో పాటే నడిచాడు. పాటనే బాటగా చేసుకుని సాగాడు. పాటలనే మూటలుగా కట్టి మనకిచ్చి వెళ్ళిపోయాడు. అతనే ప్రసిద్ధ సినీగీతరచయిత కులశేఖర్‌. అతనికి నివాళిగా ఈ చిరువ్యాసం…
కులశేఖర్‌ విశాఖపట్నం జిల్లా సింహాచలంలో 1971 ఆగష్టు 15న పుట్టారు. తండ్రి మహామహౌపాధ్యాయ టి.పి.శ్రీరామచంద్రా చార్యులు, తల్లి శ్రీమతి రంగనాయకమ్మ. చిన్నప్పటి నుంచే కులశేఖర్‌కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు పొందాడు. చదువు తరువాత ఈటీవి గ్రూప్‌లో విలేకరిగా పనిచేశాడు.
ప్రసిద్ధ సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీగీతాల రచనలో మెళకువలు తెలుసుకున్నాడు. తరువాత తేజ దర్శకత్వంలో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై నిర్మించిన ‘చిత్రం’ సినిమాతో గీత రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలూ ఆయనే రాశాడు. మొదటి సినిమాతోనే సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ రైటర్‌గా సాగిపోయాడు. ఎక్కువగా ఆర్‌.పి.పట్నాయక్‌, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు.
ఆర్‌.పి. పట్నాయక్‌, కులశేఖర్‌, తేజ కలిస్తే ఓ సంచలనమే. ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు వాళ్ళు కలిసి పనిచేశారు. ఓ దశకంలో ఆయన పాటలంటే ప్రేమికులందరికీ నిత్య పారాయణాలు.
‘ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండీ గళ్‌ ఫ్రెండ్సు
మళ్ళీ మళ్ళీ డబ్బుందంటే ఇస్తాలెండీ రిఫరెన్సు
హల్లో అంటే అల్లుకుపోయే లేడీస్సున్నారు
కల్లోనైనా కిస్సిమంటూ వేధిస్తున్నారు’.
(చిత్రం – 2000)

ఇలా యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా రాశాడు కులశేఖర్‌. యువత నాడి బాగా పట్టుకున్నాడు. కాలేజీలో గళ్‌ ఫ్రెండ్స్‌ వెంట తిరిగే పోకిరీలకి, నిజమైన ప్రేమికులకి. .అందరికీ ఆయన పాటే ఓ బాటైంది.
గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా
నీ చేయి చాపలేదా మా గాజు తొడగలేదా..
గాజువాకే పిల్లా మాది.. గాజులోల్లమే పిల్లా మేము..
(నువ్వు – నేను – 2001)
అమ్మాయికి లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి అబ్బాయిలంతా కులశేఖర్‌ పాటలనే ఎంచుకునేవారు. కాలేజీ క్యాంటిన్‌లలో, ప్రెషర్స్‌ పార్టీలలో.. ఎక్కడ చూసినా ఆయన పాటే పెట్టుకుని చిందేసేవారు. అంతలా పాపులర్‌ అయ్యాయి ఆ పాటలు. అమ్మాయి చేతిని పట్టుకోవడానికి గాజులోల్లమే.. అంటూ వెంటపడే తీరు ఈ పాటలో కనిపిస్తుంది. గాజువాక, మువ్వలపాలెం.. అనే ఊర్ల పేర్లని ప్రయోగించి అమ్మాయిని ఆటపట్టించే వైనం ఇక్కడ కనబడుతోంది.
ఇదే సినిమాలో..
‘నా గుండెలో నీవుండిపోవా..
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా..’
అంటూ ప్రేమికులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పాడుకుని పరవశించే ఆనందగీతాలను లెక్కలేనన్ని రాశాడు కులశేఖర్‌. ఒకరి గుండెలో ఒకరుండిపోయి, ఒకరి ఒడిలో ఒకరు ఒదిగిపోయి లోకానికి తమ ప్రేమశక్తిని చాటే తీరు కనబడుతుందీపాటలో.. ఇదే సినిమాలో రాసిన..
‘చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా..
గరిక గరిక ఒకటై ఇనుప సంకెలవదా’
అనే పాట యువత బలాన్ని తెలియజేస్తుంది. ఐకమత్యమే మహాయుధమని సందేశాన్నిస్తుంది.
‘రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడికొచ్చిందోరు కుర్రదో కుర్రది’
(జయం – 2002)
రాను రానంటూ రాములోరి గుడికి వచ్చిన హీరోయిన్‌ని హీరో ఆటపట్టించే సందర్భం ఈ పాటలో కనబడుతుంది. గుడికి వచ్చేటప్పుడు తెచ్చే పండ్లు, ఫలాలను కూడా పాటలో తెలియజేయడం ఇందులోని కొత్తదనం..
‘అనుకుంటే కానిది ఏమున్నది
మనిషనుకుంటే కానిది ఏమున్నది?
చలిచీమే ఆదర్శం..పని కాదా నీ దైవం..
ఆయువే నీ ధనం..ఆశయం సాధనం
చేయరా సాహసం..నీ జయం నిశ్చయం’
(ఔనన్నా కాదన్నా – 2005)
అనే పాటలో అసాధ్యాలను కూడా సాధ్యం చేయమనే సందేశముంది. మనిషి అనుకుంటే కొండలనైనా పిండిచేయగలడని, సాహసాలు చేసి విజయాలని సాధించగలడని తెలియ చేశాడు కులశేఖర్‌. చలిచీమను ఆదర్శంగా తీసుకుని సాగమంటున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదగమంటున్నాడు.
‘ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువు అచ్చుల్లోన హల్లువో
జడకుచ్చుల్లోన మల్లెవో’
(ఘర్షణ – 2004)
అమ్మాయిని చిలిపి కళ్ళలోని కలగా, లేతగుండెలోని లయగా చూస్తూ, అచ్చులలో హల్లుగా భావించడం కొత్తగా ఉంది. ఈ పాటలు ఎంత ఊపు ఊపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రేమ గొప్పతనాన్ని గురించి చెప్పాలంటే కులశేఖరే చెప్పాలి. ప్రేమికులు ఎలా ప్రేమించుకుంటున్నారో చెప్పాడు. ప్రేమికులకు కష్టాలు వస్తే, వాటిని ఎదురీది ప్రేమను ఎలా సాధించుకోవాలో చెప్పాడు. ప్రేమ విలువేంటో కూడా ఇలా చెప్పాడు.
‘నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికి బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్ళికిలా పల్లకిగా ఈ ప్రేమ’
(నువ్వు లేక నేనులేను – 2002)
పాటలో గలగలపారే నిండు గోదావరితో ప్రేమను పోల్చాడు. అందరికి బంధువుగా నిలబడుతుందని చెప్పాడు. రెండు మనసుల కథను ప్రేమగా నిర్వచించాడు. పెళ్ళికి పల్లకిగా మారుతుందని అన్నాడు. ఇలా ప్రేమ గురించి ఎంతో గొప్పగా వివరించాడు.
అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు
ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు
అభిమన్యుడిలాగ వీడు అర్థజ్ఞాని కాడు
అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు’
(నిజం – 2003)
అనే పాటలో హీరో రాజసాన్ని చెబుతాడు. హీరోకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని గురించి తెలియజేస్తాడు. అభిమన్యుడు అర్థజ్ఞాని మాత్రమే అని, అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడుగా ఉండడం వల్లే గెలిచాడని, హీరో ఇక్కడ స్వశక్తితో గెలుస్తున్నాడని చెబుతాడు.
‘వానా వానా వానా నీలాకాశంలోనా
నీతో చిందేసి ఆడనా..
వానా వానా వానా మేఘాలాపనలోన
నేనూ ఓ పాట పాడనా’
(శీను వాసంతి లక్ష్మి – 2004)
వానలో తడిసి పులకించిన హృదయం పాడే పాట ఇది. మేఘాల రాగంతో పాట పాడడం, వాన చినుకులతో కలిసి చిందేయడం అద్భుతమైన భావాలు.
ఇంకా..’బొమ్మరిల్లు'(2006) సినిమాలోని ‘లాలూ దర్వాజ కాడ.. గోల్కొండ కోట కాడ’, ‘వసంతం'(2003) సినిమాలోని ‘నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని’ అనే పాటలు ఎప్పటికీ సూపర్‌ హిట్టే.
ఇంకా.. సుబ్బు, మృగరాజు, స్నేహమంటే ఇదేరా, సంతోషం, హౌలీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాల్లో దాదాపు 500కు పైగా పాటలు రాశాడు కులశేఖర్‌. గీతరచయితగా పాటలు రాస్తూనే ‘ప్రేమలేఖ రాశా’ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మెదడుకు సంబంధించిన వ్యాధి సోకి కొంత కాలం జ్ఞాపకశక్తి కోల్పోయాడు. ఆ తరువాత కొన్నేళ్ళకు కొంత కుదుట పడ్డాడు. ఈ మధ్యే అనారోగ్యం పాలై నవంబర్‌ 26న హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశాడు.
పాటలా ప్రవహించాడు. పాటలా తరలి పోయాడు. మరలిరాని లోకాలకు వెళ్ళిపోయినా మరపురాని పాటలనే మనకు అందించాడు. ఆయన లేకపోయినా ఆయన పాటలు మాత్రం మన మధ్యనే ఉన్నాయి. పాటలా కులశేఖర్‌ మన మధ్యనే ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు.
– తిరునగరి శరత్‌ చంద్ర