మాజీ ఎమ్మెల్యే పట్నంపై ఒకే ఎఫ్‌ఐఆర్‌

– మరో రెండింటిని కొట్టేసిన హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఫార్మా పరిశ్రమల కోసం ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం నిర్వహించిన రైతుల సమావేశంలో కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడికి కుట్ర చేశారంటూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై బొమ్రాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక ఘటనపై ఒకే ఎఫ్‌ఆర్‌ నమోదు చేయాలని చెప్పింది. నరేందర్‌రెడ్డిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదని శుక్రవారం తీర్పు చెప్పింది. ఫార్మ సిటి భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా లగచర్లలో కలెక్టర్‌తోపాటు అధికారులపై జరిగిన దాడి సంఘటనలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి శుక్రవారం తీర్పు చెప్పార్ను. ఫిర్యాదులను పరిశీలిస్తే మూడు ఫిర్యాదుల్లోను పట్నం నరేందర్‌రెడ్డి పేరు లేదని, నరేందర్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నంలో భాగంగానే వేర్వేరు కేసులు పెట్టారన్నారు. దుద్యాల్‌ ఎమ్మార్వో, వికారాబాద్‌ డీసీఆర్‌బీ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ 154, 155లను కొట్టివేసింది. ఇద్దరు అధికారులు చదువుకున్న వారనీ, వారు పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌ రాసిన ఫిర్యాదులపై సంతకాలు చేశారని తప్పుపట్టింది. ఈ రెండు కేసుల దర్యాప్తులో ఎవరి స్టేట్‌మెంట్స్‌ అయినా దర్యాప్తు ఆఫీసర్‌ తీసుకుని ఉంటే వాటిని అవసరమైతే పరిగణనలోకి తీసుకోవచ్చునని చెప్పింది. అన్నింటినీ ఒక కేసుగానే తొలి ఎఫ్‌ఐఆర్‌ 153నే దర్యాప్తు చేయాలని తీర్పులో పేర్కొంది. ఇదే ఘటనలో తనను అన్యాయంగా ఇరికించారంటూ 33వ నిందితుడు కావలి శేఖర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్డు డిస్మిస్‌ చేసింది. తాను సైన్యంలో పని చేశాననీ, సంఘటనా స్థలంలో లేనని పిటిషనర్‌ రిట్‌లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పిటిషనర్‌ ఉన్నారంటూ పీపీ ఫొటోలను సమర్పించారు. దీంతో పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.