సుకన్య సమృద్థిపై స్వల్పంగా వడ్డీ పెంపు

A slight increase in interest on Sukanya Samriddhiన్యూఢిల్లీ : బాలికలకు చెందిన పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌ఏ) పథకంపై కేంద్రం ఎట్టకేలకు స్వల్పంగా వడ్డీ రేట్లను పెంచింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ సవరించింది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి వడ్డీ రేట్లను సమీక్షించే విషయం తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన, మూడేండ్ల కాలవ్యవధి కలిగిన పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్‌లపై మాత్రమే వడ్డీ రేట్లను పెంచింది. ఎస్‌ఎస్‌ఏపై ప్రస్తుతం ఉన్న 8 శాతం వడ్డీ రేటును 20 బేసిస్‌ పాయింట్లు పెంచి 8.2 శాతానికి చేర్చింది. పోస్టాఫీసు మూడేండ్ల టైమ్‌ డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీని 7.1 శాతానికి చేర్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. మిగిలిన పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అదే విధంగా పీపీఎఫ్‌పై 7.1 శాతం, సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌ 8.2 శాతం, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ 7.4 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ 7.7 శాతం, కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీ రేట్లు 7.5 శాతం చొప్పున వడ్డీ రేట్లు ఇంతక్రితం స్థాయిల్లోనే అమల్లో ఉండనున్నాయి.