కీలక రంగాల మందగింపు

కీలక రంగాల మందగింపున్యూఢిల్లీ : పారిశ్రామికో త్పత్తిలో అత్యంత కీలకమైన 8 కీలక రంగాల ఉత్పత్తి మందగిం చింది. ప్రస్తుత ఏడాది జూన్‌లో 4శాతానికి పరిమితమై 20 నెలల కనిష్టానికి పడిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలు 2023 జూన్‌లో 8.4 శాతం వృద్ధిని కనబర్చాయి. ఈ కీలక రంగాలు గడిచిన జూన్‌ నెలలో భారీగా తగ్గడంతో 2022 ఆక్టోబర్‌ నాటి 0.7 శాతం కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన సమయంలో కీలక రంగాల ఉత్పత్తి 5.7 శాతానికి పరిమితమయ్యింది. గతేడాది ఇదే సమయంలో 6 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఈ ఎనిమిది రంగాలు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
గడిచిన జూన్‌లో ముడి చమురు, రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి వరుసగా ఏకంగా మైనస్‌ 2.6 శాతం, మైనస్‌ 1.5 శాతానికి పడిపోయాయి. సహజ వాయువు, ఎరువులు, స్లీల్‌ రంగాలు వరుసగా 3.3 శాతం, 2.4 శాతం, 2.7 శాతం, 1.9 శాతం చొప్పున మందగించాయి. కేవలం బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తి రంగాలు మాత్రమే 14.8 శాతం, 7.7 శాతం చొప్పున సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.