అలిగిన ఎంపీ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇప్పుడిప్పుడే గాడిలో పడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కీలక పదవుల్లో అధిష్టానం మొండి చెయ్యి చూపింది. దీంతో అలిగి ఏ సమావేశానికీ రావడం లేదు. స్క్రీనింగ్‌కి తన అభిప్రాయాన్ని చెప్పలేదు. తన దరఖాస్తును కూడా వ్యక్తిగత సహయకునితో పంపించారు. ఏఐసీసీ నియమించిన కీలక పదవుల్లో ఆయనకు చోటు దక్కకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. కొత్తగా పునర్‌ వ్యవస్థీకరించిన ఏఐసీసీలో, ఎన్నికల సమయంలో నియమించిన కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీ చైర్మెన్‌ను కూడా ఆయన కలవలేదు. కోమటిరెడ్డితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల వారి వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రంగంలోకి దిగారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జూనియర్‌ లెక్చరర్ల వేతనాలు వెంటనే చెల్లించండి : సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ
తెలంగాణలో కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్‌ లెక్చరర్లు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. బుధవారం ఈమేరకు సీఎంకు రేవంత్‌ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్‌ చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014 టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చినట్టు తెలిపారు.
ఆశించినట్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనీ, కానీ కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లను మాత్రం రెగ్యులర్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా సకాలంలో జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. ఈఎంఐలు సకాలంలో కట్టలేక, ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి వచ్చింది. ఇదేనా ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? అని ప్రశ్నించారు.ఇది ధనిక రాష్ట్రమని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్టు లెక్చరర్స్‌కు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. వారికి సకాలంలో జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలవడమే కాక, వారి తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు సైతం సిద్ధమవుతుంది’ అని రేవంత్‌ హెచ్చరించారు.
నేడు పాదయాత్రలు చేయండి పార్టీ శ్రేణులకు మహేష్‌కుమార్‌గౌడ్‌ పిలుపు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతమై…ఏడాది గడిచిన సందర్భంగా గురువారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాదయాత్రలు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ లేఖలో సూచించిన విధంగా జిల్లా కేంద్రాలలో సాయంత్రం 5 గంటల నుంచి 6గంటల వరకు పాదయాత్రలు, తర్వాత భారత్‌ జోడో బహిరంగ సభలు నిర్వహించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విషయంలో ఏఐసీసీ సూచనలను కచ్చితంగా పాటిస్తూ పెద్దఎత్తున కార్యక్రమా లు నిర్వహించి, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, పేపర్‌ క్లిప్స్‌ గాంధీభవన్‌ మెయిల్‌, వాట్సాప్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు.
17న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్‌కు చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ …బుధవారం సాయంత్రం పార్టీ నేతలతో కలిసి 17న నిర్వహించబోయే బహిరంగ సభ కోసం గచ్చిబౌలి స్టేడియాన్ని పరిశీలించారు. ఆ తర్వాత తుక్కుగూడలోని స్థలాన్ని సైతం పరిశీలించారు. అనం తరం పార్టీ సీనియర్లతో సమావేశమై తుక్కుగూడలో బహి రంగ సభను నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 16, 17 తేదీలలో జరిగే సీిడబ్ల్యూసీ సమావేశాలు, ఏర్పాట్లపై సీనియర్‌ నాయకులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇతర నేతలు ఉన్నారు. ఇప్పటికే పరేడ్‌ గ్రౌండ్‌, ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణ కోసం అనుమతి కోరిన టీపీసీసీ నేతలు… జాతీయ నేతల సూచనల ఆధారంగా సభా వేదికను నిర్ణ యించనున్నారు. అంతకు ముందు శంషా బాద్‌ విమానా శ్రయంలో కేసీ వేణుగోపాల్‌కు రేవంత్‌ రెడ్డి, ఠాక్రే, భట్టి విక్రమార్క, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.