సామరస్యంతోనే పరిష్కారం..ఘర్షణతో నష్టం

– కృష్ణా జలాల హక్కులపై సీపీఐ సభ్యులు కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీటికి సంబంధించిన సమస్యలను సామరస్య పద్ధతుల్లో, సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే కీలకమనీ, ఒక రాష్ట్రం మరో రాష్ట్రంతో ఘర్షణకు దిగితే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. కేఆర్‌ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కూడా అవసరమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జలవనరుల మంత్రి చైర్మన్‌ ఉన్న అపెక్స్‌ కౌన్సిల్‌ ఉభయ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంటే ఈ పాటికి సమస్య పరిష్కారం అయ్యేదని, ఒకవేళ వాళ్ళ నుండి చొరవ ఉండి, మన దగ్గర లేక మనమే చెడగొట్టుకుంటే ఏమీ చేయలేమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని మర్చిపోయిందని విమర్శించారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డి పాడు సామర్థాన్ని 11వేల క్యూసెక్కు 44వేలకు పెంచిన సందర్భంలోనే నీటి తరలింపునకు బీజం పడిందన్నారు.
ఆ సమయంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసే ఉన్నాయని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు సామర్థం పెంచినప్పుడు కూడా వారంతా కలిసే ఉన్నారనీ, తొలుత ఆటంకం చెప్పినా ఆ తర్వాత అంగీకరించారని చెప్పారు. రాయలసీమకు పోతిరెడ్డిపాడు నీళ్ల తరలింపునకు సంబంధించి గొడవ మొదలైందని గుర్తుచేశారు. ఇంత కాలం మౌనంగా ఉండి, తామే అభ్యంతరం వ్యక్తం చేశామశ్రీష, లేఖలు రాశామని చెబుతున్నారని, అవన్నీ కూడా అంతర్గత అవగాహన మాత్రమేనని చెప్పారు.
ఆనాడు 44వేల క్యూసెక్కుల కోసం ఎంతో హడావుడి చేశామని, తరువాత ఏకంగా 94వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్ళినప్పుడు ఏమైనా ఆందోళన జరిగిందా అని నిలదీశారు. ఇద్దరు సీఎంల మధ్య సాన్నిహిత్య సంబంధం ఉందనీ, ఈ విషయంలో ఎప్పుడైనా కచ్చితంగా ప్రశ్నించారా? అని అడిగారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీలను తీసుకెళ్ళుంటే ఏమి చేశారని అడిగారు.
ఏపీతో ఐక్యంగా కొట్లాడాల్సిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఇక్కడ సభలో కొట్లాడుకుం టున్నాయన్నారు. కేఆర్‌ఎంబీ కోసం గత ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందనీ, అంటే బోర్డును అంగీకరించడమేనని చెప్పారు. పదేండ్ల నుంచి నీళ్ళు తరలించుకుపోతుంటే ఎందుకు ప్రజాందోళన చేయలేదని ప్రశ్నించారు. కృష్ణానదిలో 50 :50 నిష్పత్తిలో నీటి వాటాను ఎందుకు వదులుకున్నారని నిలదీశారు. ప్రస్తుతం పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీటి తరలింపు కొనసాగితే రోజుకు 9.5 టిఎంసిల నీరు గ్రావిటీ ద్వారా తరలిపోతాయనీ, 17-18 రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అయ్యి మనకేమి మిగల బోవని హెచ్చరించారు. దీనివల్ల మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై శాసనసభలో ప్రత్యేక చర్చ జరగాలన్నారు.