శ్రమశక్తిని చాటిన పాట

శ్రమశక్తిని చాటిన పాటశ్రామికుడి కష్టాన్ని దోచుకునే దోపిడీదారులను, అవినీతి పరులను ఎదిరించి ప్రశ్నిస్తూ ఎంతోమంది ప్రజాకవులు పాటలు, గేయాలు రాశారు. అడుగడుగునా ఎదురయ్యే దుర్మార్గాన్ని తమ పాటలతో ఎలుగెత్తి ప్రశ్నించి అక్రమాలను కాలరాశారు. అలాంటి ఉప్పెనలాంటి పాటలు ప్రజాకవుల కలాల్లో పుట్టి గళాల్లో పెరిగి అమాయక ప్రజలలో చైతన్యం కలిగించాయి. వారిని ఉద్యమానికి నడుం బిగించేలా చేశాయి.. అలాంటి పాటల్లో ఉద్యమకవి గూడ అంజయ్య రాసిన ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ పాట ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. 1994 లో ఆర్‌.నారాయణమూర్తి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్రసైన్యం’ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
గూడ అంజయ్య గొప్ప ఉద్యమకవి. అణచివేత, ఆక్రందనలు, అన్యాయాలు కంటికి కనిపిస్తే చాలు నిప్పులాంటి పాటలతో ఆవేశంలా విరుచుకుపడతాడు. ఉద్యమ చైతన్యాన్ని రగిలించే ఆయన పాటలు తెలంగాణ పల్లెపల్లెలో, గుండె గుండెలో మారుమోగాయనడం అతిశయోక్తి కాదు. నేటికీ తెలంగాణీయుల గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన పాట చిరంజీవంగా ఉంది. ఆయన రాసిన ప్రతీ పాట ఆణిముత్యమే. అందునా.. ‘ఎర్రసైన్యం’ సినిమాలో రాసిన ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా’ పాట ప్రజాకవిగా, సినీకవిగా ఆయనకు ప్రత్యేకతను తీసుకువచ్చిందని చెప్పవచ్చు.
శ్రామికుల కష్టాన్ని దోచుకుంటూ, వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోగా, వారిని వెట్టి చాకిరీకి గురి చేస్తుంటే.. వాళ్ళలో ఉన్న ఓపిక నశిస్తుంది. వాళ్ళలో ఉన్న అమాయకత్వమూ నశిస్తుంది. దోపిడీ చేసే దొరను, వాడి అధికారాన్ని, అహంకారాన్ని పాతర వేయాలన్న కసి, కోపం రగులుతుంది. ఆ కోపంతో శ్రామికులంతా దొరను ఎదిరించే సంకల్పంతో ఒక దండులా కదులుతారు. అప్పుడు ఈ పాట మొదలవుతుంది.
ఊరు మనది. వాడ మనది. మనం ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్న ఈ పల్లె మన సొత్తు. ఈ పల్లెలో అనేక కులవృత్తుల వారున్నారు. కూలీ పని చేసే శ్రామికులు, పొలం పనులు చేసుకునే రైతులూ ఉన్నారు. ప్రతి పని కూడా మనమే చేసుకుంటున్నాం. సుత్తె పట్టి రాళ్ళు పగులగొట్టడం, కత్తి, పలుగు, పారా పట్టి కూలీ చేయడం.. అన్నీ మనమే.. అలాంటప్పుడు మధ్యలో ఈ దొర ఎవడు? వాని దూకుడు ఏమిటి? వానికి ఈ అధికారం ఎక్కడిది? మనపై పెత్తనం చెలాయించే హక్కు వాడికెక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు శ్రామికులు.
ఈ పాటలో పేదల కన్నీళ్ళు, కష్టం కనిపిస్తున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించే వైనం స్పష్టంగా కనబడుతుంది. పొలం దున్నేది మనమే. కంచె కాడ కాపలా మనమే. మంచె కాడ పిట్టలను తోలేది మనమే. పాడి, పశువుల దగ్గర ఉండేది మనమే. పశువుల పేడ ఎత్తేది, పాలు పితికేది మనమే. ఇలా అన్ని పనులు మనమే చేసుకుంటుంటే మధ్యలో దొరకు పెత్తనం ఇవ్వడమెందుకు? ఎవరి కష్టానికి తగినట్టుగా వాళ్ళే ఫలితాన్ని పొందాలని శ్రామికుల ఆవేదన.. ఆ ఆవేదనతోనే వాళ్ళు దొరపాలనపై తిరగబడతారు.
శ్రామికుల్లో అన్ని కులాలవాళ్ళూ ఉన్నారు. సమ్మెట పట్టి కమ్మరి పని చేసేది, బరువులు మోసేది, చాకిరేవు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతికేది, సారెలు తిప్పి కుండలు చేసేది, మగ్గం పట్టి చీరెలు నేసేది, పగ్గం పేనేది, ఎవరైనా చస్తే డప్పు కొట్టేది, పెళ్ళిళ్ళలో సన్నాయి మోగించేది… ఇలా అన్ని పనులు, అన్ని వృత్తులు మనమే చేసుకుంటున్నప్పుడు మనకు మనమే నాయకులమవుతాం. మనకు మనమే దొరలమవుతాం కాని ఎవడి అధికారానికో, అహంకారానికో మనం బానిసలమెలా అవుతాం? అని అంటున్నారు.
ఈ దొరలు శ్రామికులతో చేయించుకునే వెట్టి చాకిరీకి అంతు ఉండదు. కాసింతైనా కనికరముండదు. శ్రామికులను మనుషుల్లాగా చూడరు. రోజంతా వాళ్ళతో పని చేయించుకుంటూనే ఉంటారు. ఒకవేళ పని చేసి చేసి, కాళ్ళు, చేతులు లాగుతున్నాయని కూర్చుంటే దొర కఠినంగా ప్రవర్తిస్తాడు. వాడు మాత్రం గట్టు మీద నీడలో చెట్టులాగా నిలబడి ఉంటాడు.
పసిబిడ్డకు పాలిచ్చి వస్తానని చెప్పినా వినకుండా, తల్లి, భార్య అనే వావి వరసలు లెక్క చేయకుండా ఆడవాళ్ళను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం చేస్తాడు. ఇలాంటి అమానుష చర్యలు, క్రూరత్వం కప్పుకున్న దొంగ రాజకీయాలున్నాయి. పల్లెలో పేదలపై చూపిస్తున్న ఈ పెత్తనం ఇకనైనా నశించంపజేయాలనే ఉద్దేశ్యంతో న్యాయపోరాటం చేస్తారు శ్రామికజనం.. ఎక్కడ దుర్మార్గం కనబడినా ఎదురు తిరిగి పోరాడమనే సందేశాన్ని, ధైర్యాన్ని అందిస్తుందీపాట.. తెలంగాణ యాసను, ఆవేశాన్ని ఈ పాటలో చూడవచ్చు. ఈ పాటతో ప్రజాకవిగా గూడ అంజయ్య తన ముద్రను పదిలపరుచుకున్నాడు.
పాట:
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా/ సుత్తె మనది కత్తి మనది పలుగు మనది పారమనది హా../ బండి మనదిరా బండెడ్లు మనయిరా/ నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో/ ఏరు జాలిమ్‌ కౌన్‌ రే ఉస్కా జులూమ్‌ క్యారే/ అరకలు పట్టేది మనం సెలకలు దున్నేది మనం/కంచె కాడ మనం ఆ మంచె కాడ మనం/ పాడి కాడ మనం ఆ పశుల కాడ మనం/ దొడ్డి కాడ మనమే గడ్డాము కాడ మనమే/ నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో/ సమ్మెట పట్టేది మనం బరువులు మోసేది మనం/ చాకిరేవు కాడ మనం సారెలు తిప్పేది మనం/ మగ్గం పెట్టింది మనం పగ్గం పేరేది మనం/ చావు కాడ మనమే సన్నాయి కాడ మనమే/ నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో/ ఏరు జాలిమ్‌ కౌన్‌ రే ఉస్కా ఝూమండు క్యారే/కాయ కష్టం చేసి కాళ్ళు గుంజి కూకుంటే పసిబిడ్డ ఏడుపిని పాలియ్యబోతుంటే/ గట్టు మీద కుర్రోడు చెట్టులెక్క నిలిసుంటే/ ఆలి నుండి అమ్మ దాకా వాయి వరస లేకుండా/ ఆ..తిట్టుడేందిరో వాడి కొట్టుడేందిరో/
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com