ప్రేయసి అందాన్ని వర్ణించడానికి మాటలు లేని వేళ అది. అయితే మాటలు రాకపోయినా ఆ అందాన్ని వర్ణించడానికి పదాల్ని అరువుగా తెచ్చుకుని పాటగా పాడుతున్నానంటున్నాడు ప్రియుడు. పరువపు వానలో తడిసి పులకించిపోతున్న ప్రేయసీప్రియుల ఆనందానుభూతిని ఆవిష్కరిస్తుందీపాట. అదే..’ ప్రేమదేశం’ (2023) సినిమా కోసం కరుణాకర్ అడిగర్ల రాసిన పాట. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
ప్రేమికులిద్దరు ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుకుంటున్న సందర్భాన్ని, అలవికాని అనుభూతిని వ్యక్తపరుస్తున్న సందర్భాన్ని గీతరచయిత కరుణాకర్ అడిగర్ల ఎంతో అద్భుతంగా వివరించాడు. చిన్ని చిన్ని మాటల్లోనే ప్రేమ చేసే వింతగారడిని, ప్రేమలోని తీయదనాన్ని మృదువుగా తెలిపాడు. తన మనసు దోచుకున్న అమ్మాయిని వర్ణించడానికి తన దగ్గర పదములే లేవు. పదములు దొరకని, భావాలకు అందని అందం ఆమెది. అందుకే అరువుగా తెచ్చుకునైనా సరే తన పలుకులుగా మార్చుకుని అమ్మాయి పేరును తన పెదాలతో పిలిచి పులకించి పోవాలనుకుంటున్నాడు హీరో.. ఆమె చూపు శీతాకాలపు చలిమంటై వెచ్చగా తాకి అతన్ని గిలిగింతలకు గురిచేస్తుంది. ఏ ప్రియునికైనా చెలిచూపు చలిమంటలా అనిపించడం సర్వసాధారణమే. కాని శీతాకాలపు చలిమంటలా అనిపిస్తుంది ఎందుకో మరి.. అనడం ఇక్కడ కవి ప్రతిభకు తార్కాణమని చెప్పవచ్చు. శీతాకాలం చలిమంట మనకు వరంలాగా అనిపిస్తుంది. వయసు అనే చలిలో రగిలే తనకు చెలి సొగసే చలిమంటలా తోచిందని మనం భావించుకోవాలి. ఇదిలా ఉంటే.. అమ్మాయి కూడా ప్రియుని నవ్వే మంచు పూలవానలాగా తడిపేస్తుందని తన్మయత్వంతో చెబుతోంది. ఈ వింతకి కారణమేమిటని తనను తాను ప్రశ్నించుకుంటోంది..
ఇరువురు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమను తెలుపుకుంటున్నారు. ప్రియున్ని ప్రేయసి మాయ చేసిందని, ప్రేయసిని ప్రియుడు మాయ చేశాడని తీపి మాటలకు తేనె వలపునద్ది ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. నా చిన్నిగుండె చుట్టూ ఉన్న పిట్టగోడను దాటుకుని వచ్చి తేనెటీగలా గుచ్చి ఏం తెలియనట్టు వెళ్ళిపోయింది ఎవరో తెలుసా? అంటాడు ఆ ప్రియుడు. ఇక్కడ ఆ కొంటెపని చేసింది – అంటే తన మనసులో చొరబడి ప్రేమను చిగురెత్తించింది ప్రేయసే అని నేరుగా చెప్పకుండా కొంటెగా ఎవరో తెలుసా అని ఓ విసురు విసురుతాడు. దానికి బదులుగా ఆమె ఓ చిన్ని రెక్కలిచ్చి బోలెడన్ని ఊహలున్న ఆకాశంలోకి నన్ను ఎగరేసినదెవరు? ఈ అనుమానం తీర్చేదెవరో మరి అంటుంది. ఇక్కడ ఆ చిలిపి పని చేసింది తన మనసులో వలపు చిలికింది ప్రియుడేనని నేరుగా చెప్పకుండా ఎవరో తెలుసా అని ఆమె కూడా ఓ విసురు విసురుతుంది. నా మనసులో ఉన్న మాట ఆపలేను, అలా అని చెప్పలేను అని ప్రియుడంటే, నేను కూడా దాచలేను అలా అని దాటలేను, మొహమాటం వల్ల ఏమి చేయలేకపోతున్నానని ప్రేయసి అంటుంది. తన పెదవులపై ఓ పదం – (అదే.. ఆమె పేరు అని ఇక్కడ అర్థం) నిశ్శబ్దమైపోతుందని, నా మౌనాలతో ఈ క్షణం యుద్ధాలు జరుగుతున్నాయని ప్రేయసీప్రియులు- ఇలా ఇద్దరు తమ సల్లాపాన్ని, సంతోషాన్ని పంచుకుంటారు..
ఏదో కల్లోలంలాగా, ఏదో ప్రళయం జరిగినట్టుగా నాలోన ఏదో గుబులవుతుంది. అయినా ఈ గుబులు, దిగులు బాగుంది అని ప్రియుడంటే – నీకు కూడా నాలాగే ఉందా! ఇదేదో చిత్రంగా ఉన్నా చంపేసే హాయల్లే ఉందే.. అని ప్రేయసి చెబుతుంది. ఇరువురిలో ఒకటే సంఘర్షణ – అది ప్రేమ సంఘర్షణ.. ప్రేమ వింతమహిమ అది..
మొదటి చరణంలో ప్రియుడు తన మనసులో అలజడి రేపిందెవరో తెలుసా? అని పరోక్షంగా అడిగాడు. కాని రెండవ చరణంలో నీ గుండెలోన దాచుకుంటూ గొంతుదాటి బయటకు రాను అంటూ గుట్టుగా ఉన్నవాణ్ణి నేనే కదా! నీ గుండెలోని రూపం నాదే కదా! నువ్వే బయటపడడం లేదు అని ప్రేయసి మనసులో ఉన్నది నేనేనని స్పష్టం చేసుకుంటున్నాడు. దానికి ప్రతిగా ప్రేయసి – నీ నిద్రనంతా చెదరగొట్టి నీ కళ్ళపైన వాలుతున్న కలలలో తేలుతూ ఉన్న ప్రేయసిని నేనే కదా! ఆ రూపం నాదే కదా! ఆ విషయం నువ్వు చెప్పడం లేదుగా అని ప్రేయసి ప్రియునికి తనపై ఉన్న ప్రేమను గూర్చి తానే చెబుతుంది.
ఇలా ఒకరినొకరు తమ ప్రేమను తెలుపుకుంటూ, ప్రియునిపై ప్రేయసికున్న ప్రేమను ప్రియుడే చెప్పడం, ప్రేయసిపై ప్రియునికున్న ప్రేమను ప్రేయసే చెప్పడం చేస్తుంటారు. వింతగా, కవ్వింతగా ప్రేమను పంచుకోవడం, స్పష్టం చేసుకుంటారు. ప్రేమ చలువను, ప్రేమ విలువను తెలిపిన ఈ పాట సంగీతపరంగాను ఎంతో అద్భుతంగా ఉంటుంది. మణిశర్మ సంగీతం ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాట: పదములే లేవు పిల్లా పిల్లా అరువుగా తెచ్చుకోనా!/ పలుకుగా మార్చి ప్రేమను కూర్చి/ నీ పేరుగ నా పెదవితొ పిలిచైనా!/ ఓ నీ చూపే శీతాకాలం చలిమంటై/ వెచ్చగా తాకే ఎందుకంటావే/నీ నవ్వే మంచు పూలవానల్లే తడిపేస్తుందే ఏమిటీ వింతే/ నా చిట్టిగుండె చుట్టు ఉన్న పిట్టగోడ దాటుకొచ్చి తేనెటీగలా గుచ్చి కుట్టి కుట్టి వెళ్ళిపోయెనంట/ అది ఎవరో తెలుసా!/ ఓ చిన్ని చిన్ని రెక్కలిచ్చి బోలెడన్ని ఊహలున్న నింగిలోకి నన్ను పంపి ఎగరేసినదెవరంట ఈ అనుమానం తీర్చేదెవరంట/ ఆపలేను చెప్పలేను మదిలోని మాట/ దాచలేను దాటలేను మోహమాటం వల్ల/ నా పెదాలపై ఓ పదం ఒక నిశ్శబ్దమైపోయే/ నా మౌనాలతో ఈ క్షణం తెగయుద్ధాలు జరిగేలే!/ ఏదో కల్లోలంలాగా ఉందే నాలోనా అయినా బాగుందే ఏమైనా/ అరె నీకు నాలాగే ఉందా చిత్రంగా ఉన్నా చంపేసే హాయనుకోనా!/ నా గుండెలోన దాచుకుంటు గొంతుదాటి రాను అంటు గుట్టు గుట్టుగున్న వాడు నేను కాక ఇంకా ఎవరంట నువు బయటపడవుగా/ నీ కునుకునంత చెదరగొట్టి కనులపైన వాలుతున్న కలలలోకి తేలుతున్న కన్నెపిల్ల రూపం ఎవరంట? అది నేనేగ నువు చెప్పవుగా!
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com