రుణానుబంధమై అల్లుకున్న పాట

రుణానుబంధమై అల్లుకున్న పాటకొన్ని బంధాలు పుట్టుకతో పెనవేసుకుంటాయి. రక్తపాశాలై తోడుంటాయి. మరికొన్ని బంధాలు యుగాల నాటి రుణాలను అల్లుకొని ఉంటాయి. తరాలు గడిచినా, కాలాలు మారినా అవి మన వెంటే వస్తుంటాయి. అలా – అనుకోని బంధమై అల్లుకున్న ఆప్యాయతలను ఎంతో మధురంగా వివరిస్తుందీపాట. ‘బింబిసార'(2022) సినిమా కోసం ఎం.ఎం. కీరవాణి రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీత దర్శకుడు. ఎన్నో వేల పాటలకు సంగీతం అందించి తన ముద్రను పదిలంగా వేశాడు. అతను గాయకుడు, గీతరచయిత కూడా. చాలా పాటలు తానే రాసి స్వయంగా పాడాడు. చక్కని చిక్కని కవిత్వంతో పాటను పరిగెత్తించగలడు. ‘బింబిసార'(2022) సినిమాలో బాగా పాపులర్‌ అయిన ఈ పాటను తానే రాసి, సంగీతమందించాడు. స్వరకల్పన, సాహిత్యం, గానం ఈ మూడూ ఈ పాటకి ప్రత్యేకార్షకాలు. మోహన భోగరాజు, శాండిల్య పిసపాటి గానం, నందమూరి కల్యాణ్‌ రామ్‌ నటన కూడా సినిమాకి, పాటకి ప్రత్యేకతను చేకూర్చాయి.
సినిమాకథ పరంగా మనం చూసినట్లయితే – హీరో పూర్వయుగంలో కర్కశుడైన రాజు. తన కరడు కట్టిన హృదయంతో, పగతో ఎంతోమంది జీవితాలను పొట్టన పెట్టుకున్నాడు. అలా ఓ పసిపాప చావుకి కూడా కారణమయ్యాడు. గత జన్మలో పసిపాపని చంపిన ఆ రాజు (బింబిసారుడు) విధివశాత్తు మరో కాలంలో ఎన్నో చిత్రవిచిత్రమైన సమస్యలో ఇరుక్కుంటాడు. అతని ప్రాణానికి ముప్పు కూడా వస్తుంది. అప్పుడు గత కాలంలో తాను ఏ పాపనైతే చంపాడో అదే పాప ఈ కాలంలో అతని ప్రాణాలను కాపాడుతుంది. అప్పుడు అతనిలోని కర్కశత్వం, అహంకారం నశిస్తాయి. అతనికి కనువిప్పు కలుగుతుంది. మమకారం విలువేంటో అప్పుడు తెలిసొస్తుంది. విశేషమేమిటంటే.. ఇది ఆ పాపకు మాత్రమే కొత్త జన్మ. అతను ఒకే జన్మలో ఉన్నాడు. కాని వేరే కాలానికి వచ్చాడు. అది ఆ పాప మళ్ళీ పుట్టి బతుకుతున్న కాలానికి విధివశాత్తు వచ్చాడు. ఏదో తెలియని రుణపాశం ఆ పాపని, అతన్ని కలిపింది. ఇక తన తప్పు తెలుసుకుని ఆ పాపకి ఏ ముప్పూ కలగకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ పాప కుటుంబానికి దగ్గరై వారిలో ఒకడిగా కలిసిపోతాడు. ఆమె కోసం ప్రాణమివ్వడానికైనా వెనుకాడడు. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.
గుండెల్లో నుంచి, గొంతుల్లో నుంచి పొంగివస్తున్న మమకారపు స్వరమది. రాజకీయపు జిత్తులతో, యుద్ధాల వ్యూహాలతో మోడుబారిన అతని మనసులో ఏదో తీయని ప్రేమ తొణికిసలాడుతుంది. ఏదో ప్రాణం పలికింది. అప్పటిదాకా ఆ రాజు వేరు. ఇప్పుడు అతని తీరు వేరు. అతనిలోని కోపం, అహం అన్నీ నశించిపోయాయి. తాను మామూలు మనిషినని ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ కన్నులలో ఆనందం గంగలాగ పొంగింది. అంటే ఆనందబాష్పాలు కురిశాయని అర్థం.
కాలంతో పరిహాసాలాడిన స్నేహమది. ఉదయాలు దాటి, పగళ్ళు దాటి, రాత్రులు దాటి, లోకాలు దాటి, యుగయుగాలు దాటి ఒక పాశం చెయ్యమందించమని అడిగింది. అది రుణపాశం. విధి ఆటలో ఇద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. ఒకప్పుడు కాఠిన్యం కాలుదువ్వింది. ఇప్పుడేమో కారుణ్యం అలలెత్తింది. ఇది నాటికి నేటికి ఉన్న తేడా.
అతనిలోని మనసు మాట్లాడుతోంది. ఇన్నాళ్ళు మనసే లేని వాడిగా బతికాడు. ఇప్పుడు మొదటిసారిగా మాట్లాడుతుంది. మానవత్వంతో, మమకారంతో మాట్లాడుతోంది. ఆ పాప అడిగితే ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతానని, తాను పిలిస్తే వెంటనే పలికే తోడు నీడైపోతానని. ఆ పాపతో ఉంటే ఏ సామ్రాజ్యాలు సరితూగవంటున్నాడు. రాజ్యాధికారాలు, భోగాలు, వైభవాలు అన్నింటిని వదిలేసి తన నిర్మలమైన నవ్వులు చూస్తూ అలాగే ఉండిపోవాలనుకుంటున్నాడు. రాత్రి, పగలు తేడా లేదు. ఆమెను చూస్తూ ఉంటే ఏ దిగులూ లేదు, రాదు. అతని కనులు తడితో నిండిపోయాయి.
ఏదో తెలియని తన్మయత్వంతో అతడున్నాడు. ఇది వరకెరుగని ప్రేమ ఇది. గారాబం ఇది. ప్రాణాలైనా ఇస్తానంటుంది ఆ రుణబంధం. ఇది విధి ఆటే కావచ్చు. కాని ఆ పాపతో ముడిపడిన ఎడతెగని బంధం. తులలేని బంధం. విలువైన బంధం.
నోరార వెలిగే ఆ పాప నవ్వుల్ని కళ్ళారా చూస్తూ అలాగే ఉండిపోతానంటున్నాడు. ఆ రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో తనను తాను కొత్తగా కలుసుకుంటున్నానంటున్నాడు. తనతో వుంటే ప్రతి నిమిషం ఓ హరివిల్లులాగా కొత్త రంగులతో కనబడుతుంది ప్రపంచం. ఉల్లాసంగాను, ఉత్సాహంగాను తోస్తుంది. ఇదివరకెరుగని ఈ ప్రేమబంధంలో హృదయాలు మురిసిపోతున్నాయి.
ఆ పాపతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ ఇలనే స్వర్గంగా భావిస్తున్నాడు. తాను రాజునని మరిచిపోయి ఆ పసిపాపకు బంటైపోతాడు. ఆమె ముందు మోకరిల్లుతాడు. రాజే బంటై పోయిన రాజ్యాన్ని ఆ పాపకే రాసిస్తానంటాడు.
పసిపిల్లల చిరునవ్వుకు ఏ రాజ్యాలైనా తలవంచుతాయన్న సందేశాన్నిస్తుందీపాట. అనురాగపు మాధుర్యాన్ని ఎంతో గొప్పగా తెలియజేస్తుందీపాట. అనుబంధాల ముందు అధికార దర్పాలు నిలబడలేవని తెలుపుతుందీపాట.

పాట:
గుండెదాటి గొంతుదాటి పలికెందేదో వైనం/
మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం/
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం/ కాలంతో పరిహాసం చేసిన స్నేహం/ పొద్దులుదాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణపాశం విధివిలాసం/ అడగాలే గాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా!/
పిలవాలే గాని పలికేటి తోడునీడైపోతా!/ నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు/
రాత్రిపగలు లేదే దిగులు తడిసే కనులు/ ఇదివరకెరుగని ప్రేమలో గారములో/ చెయ్యందించమంది ఒక పాశం రుణపాశం విధివిలాసం/
ప్రాణాలిస్తానంది ఒక బంధం రుణబంధం/ నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళారా చూశా!/
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిశా!/
నీతో వుంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు/
రాత్రి పగలు లేదే దిగులు మురిసే ఎదలు/ ఇది వరకెరుగని ప్రేమలో గారములో/ ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం/ రాజే నేడే బంటైపోయిన రాజ్యం నీకే సొంతం.
డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com