లేతవయసున చిగురు తొడిగిన ప్రేమ వయసుతో పాటే పెద్దదై కాలంతోటి ప్రయాణం చేస్తుంది. ఒకరి కోసం ఒకరంటూ కలిసి సాగుతున్న ఆ జంట ప్రేమకు చిరునామాగా నిలవాలనుకుంటారు. ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఆ వయసులు ఎంత చిగురైనవో, ఆ మనసులు ఎంత కమ్మనైనవో చెబుతూ అనంతశ్రీరామ్ రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం…
ప్రేమపాటలు, అందునా విరహగీతాలు రాయడంలో అందెవేసిన చెయ్యి అనంతశ్రీరామ్ ది. అంటే – మిగితాపాటలు రాయలేడని కాదు. ఆయన అన్నిరకాల పాటలు రాశాడు. అయితే.. ప్రేమపాటల్లో అతని కలం కొత్త పోకడలు పోయింది. ప్రత్యేకముద్రను పదిలపరుచుకుంది. ఈ మధ్యే విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ‘బేబి'(2023). కథపరంగాను, సంగీతపరంగాను, సాహిత్యపరంగాను.. అన్నింటిపరంగా ఈ సినిమా ఓ అద్భుతమే. ఈ సినిమాలోని అన్ని పాటలు బాగున్నాయి. అయితే వాటిలో బహుళ జనాదరణ పొందిన ”ఓ రెండు ప్రేమ మేఘాలిలా..” పాట గురించి ఇపుడు మాట్లాడుకుందాం.
విద్యార్థిదశ నుంచే ప్రేమలో ఉన్న ఓ జంట కథను పాటలో పొదిగి చూపించాడు అనంతశ్రీరామ్. ఏమీ తెలియని వయసులోనే వారి మధ్యన ప్రేమ మొగ్గ తొడిగింది. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏమీ పట్టించుకోలేనంత గాఢంగా ప్రేమలో మునిగి ఉన్నారు. తొలిప్రాయం వాళ్ళలో ఏదో తెలియని పారవశ్యాన్ని, సంతోషాన్ని నింపింది.
అందుకే – ఇది ఏం మాయనో కదా ప్రాయమా! లోకమంతా మాయమైనదా? కంటికి ఏం కనిపించడం లేదా? అన్నంతగా వాళ్ళు ప్రేమలో ఉన్నారు. ఇదంతా వయసు చేసిన మాయనే అనుకుంటున్నారు. వాళ్ళ గుండెల్లో ఏ ధ్యాసా లేదు. ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకోవడం, ఒకరికోసం ఒకరన్నట్టు బతకడం, ఇదే వారి లోకం. పరవళ్ళు తీస్తున్న వారి ఆశల ప్రయాణంలో వేరు కావడమనేది వారికి కలలో కూడా రాని ఆలోచన.
ఇద్దరిదీ ఒకే ప్రయాణం. ఇద్దరిది ఒకే ప్రపంచం. వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకటే. ఇద్దరి ఊపిరి ఒకటై మెల్లమెల్లగా అడుగులు కలిసి పడుతుంటాయి. వారు రెండు ప్రేమమేఘాలై సాగుతున్నారు. ఆ రెండు మేఘాలు కలిసి ఒకటై వానలాగా దూకుతున్నారు. కాని, ఆ వాన వాలు ఏ వైపుకు సాగుతుందో ఎవరమూ చెప్పలేం. ఎందుకంటే వారి ప్రేమ ఎలా మలుపు తిరుగుతుందో, ఎటువైపు ప్రయాణిస్తుందో అదంతా కాలమే తేల్చుతుంది. ప్రేమ ఒక్కటే వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. వారి ప్రేమ చేరుకునే గమ్యాన్ని నిర్ణయించేది కాలమే అంటున్నాడు కవి. ఇక్కడ – కాలమే నిర్ణయించేది అనడంలో ఓ అంతరార్థముంది.
సినిమాకథ పరంగా చూసినట్లయితే వారిప్పుడు ప్రేమగా కలిసి ఉండొచ్చు కాని వారి ప్రేమ, వారి జీవితాలు ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నెన్నో సమస్యల్ని చవిచూస్తాయి. ఆ విషయాన్ని ‘ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా’ అనే వాక్యంలో పొదిగి చెప్పాడు. ఇదంతా సినిమాకథపరంగా జరిగే పరిణామాలు.
కాని – ఇప్పుడు వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను గూర్చి అక్షరీకరించడమే కవి చేసిన పని. ఎంతో మంది ప్రేమికులకు ఆదర్శంగా వారి ప్రేమజంట కనిపిస్తుందట. అందరి కళ్ళకు ఈ జంట కలలకే నిజములాగా అన్నట్లు తోస్తుందట. వారు సాగిన దారి, నడిచిన బాట నిర్మలమైన స్నేహానికి రుజువా అన్నట్లుందట. చెలిమి అని ఎందుకన్నాడంటే – మొదట వారు స్నేహితులుగానే పరిచయం. ఆ స్నేహమే ప్రేమగా మారింది. కంటిరెప్ప, కనుపాప ఎప్పుడూ వీడిపోవు. కనుపాపకు కంటిరెప్పనే రక్షణ. కంటిరెప్పలేనిదే కనుపాప లేదు. ఇలాగే చివరిదాకా వారుంటారేమో.. చందమామ, సిరివెన్నెలలాగా వందేళ్ళయినా కూడా విడిపోకుండా వారుంటారేమో అన్నంత అమరంగా, శాశ్వతంగా, మధురంగా వారి ప్రేమ ఉందని ఇక్కడి భావన. ఈనాటికి ఏనాటికీ ప్రేమికులు పాడుకునే మధురాతిమధురమైన ప్రేమగీతమిది. ప్రేమికులందరికీ అనంతశ్రీరామ్ ఇచ్చిన అపురూపమైన కానుక ఈ పాట..
పాట:-
ఏం మాయే ఇది ప్రాయమా!/ అరె ఈ లోకమే మాయమా!/ వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో/ వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో/ ఇద్దరిది ఒకే ప్రయాణంగా/ ఇద్దరిది ఒకే ప్రపంచంగా/ ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా మెల్లగా/ ఓ రెండు ప్రేమమేఘాలిలా దూకాయి వానలాగా/ ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా/ తోచిందే ఈ జంట కలలకే నిజములా/ సాగిందే దారంతా చెలిమికే రుజువులా/ కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక/ సందామామ సిరివెన్నెలలాగ వందేళ్ళయినా విడిపోక..
– డా||తిరునగరి శరత్ చంద్ర,
sharathchandra.poet@yahoo.com