ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ప్రతి ప్రయాణానికి గమ్యం ఉంటుంది. అయినా ఒక్కోసారి మనలో మనకే అంతుపట్టని కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. జవాబు కోసం పెనుగులాట మొదలవుతుంది. ప్రయాణం ఎంత చేస్తున్నా ఒక్కోసారి గమ్యం మన కళ్ళకు కనబడదు. కాళ్ళకు అందదు. కనిపించే దృశ్యంలో కనిపించనిదేదో ఉందని, వినిపించే శబ్దంలో వినబడనిదేదో ఉందని అనిపిస్తుంది. అలా కనిపించని దాని కోసం తీక్షణంగా వెతుకుతూ, నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న శబ్దాన్ని చెవులకు పరిచయం చేస్తూ, అందని దాన్ని కూడా అందుకోవాలనే సంకల్పంతో, అన్వేషణతో సాగే అద్భుతమైన పాటను ‘కార్తికేయ-2’ (2022) సినిమా కోసం రామజోగయ్యశాస్త్రి రాశాడు. ఆ పాటను ఇప్పుడు పరిశీలిద్దాం.
రామజోగయ్యశాస్త్రి ప్రతీ పాటలో ఓ చమత్కారం, ఓ కొత్తదనం చూపిస్తాడు. అదీ ఆయనకున్న ప్రత్యేకత. సినిమాపరంగా చూసినట్లయితే ఈ పాటలో నిరంతరం అన్వేషించే కథానాయకుని హృదయాన్ని పట్టి చూపిస్తున్నాడు. అన్వేషించే హృదయమున్న వాడికి ప్రపంచమంతా ప్రశ్నగానే కనబడుతుంది. తనతో సహా. ప్రశ్నలకు తగిన జవాబు దొరికే వరకు ప్రయాణం ఆగదు. అలుపు లేకుండా అతడు ప్రయాణిస్తూనే ఉంటాడు. ఎంత సేపు ప్రయాణించినా గెలుపు దక్కేదాకా దానిపై శ్రద్ధాసక్తులు విడువడు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే దాకా ఒకేలాగా ఉంటాడు.
ఇక్కడ కథానాయకుడు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయాలనే ఆలోచనలతో, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఒక గొప్ప పనిని సాధించుకొస్తాననే సంకల్పంతో బయలుదేరుతాడు. మన తరతరాల చరిత్రకు సంబంధించిన వారసత్వ సంపదను శోధించి శోధించి సాధించుకొస్తాడు.
అతని ఆలోచనల్లోనే ఒక లోతైన తపన కనబడుతుంది. ప్రతిరోజూ ఒక కొత్త ప్రశ్నలాగా తాను పుడతానని, తనకు దొరికిన సమాధానంతో నిండుగ బలపడిపోతుంటానని చెబుతున్నాడు. ఆయన మార్గం అనితర సాధ్యం. ఓటమికి తలవంచని నైజం అతనిది. అడుగడుగునా తన తెలివికి పదును పెట్టుకుంటాడు. తెలియని విషయాలెన్నో తెలుసుకుంటూ ఉంటాడు. బతుకంటే తీరని దాహం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియనిది ఉంటుంది. పూర్తికాని ఖాళీలాగా అతడుంటాడు. ఆయన వెళ్ళే దారిలో ఎన్నో సందేహాలు ఎదురవుతాయి. వాటికి సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలు వెతుకుతూ వెళుతుంటాడు. ఆయన ఒక సమస్యను పరిష్కరించడానికి వెళ్తే దారి మధ్యలో మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటూ తను పరిష్కరించాలనుకున్న ప్రధాన సమస్యను కూడా పరిష్కరించేస్తాడు. ఇదీ అతని నైజం. ప్రతిరోజూ ఏదో కొత్త సంగతిని కనుక్కొనే ధ్యాసలోనే ఉంటాడు.
ఏ నిమిషం ఏ కొత్త విషయాన్ని నేర్పిస్తుందో, ఏ సమయం ఏ వివరాలను మనకు వినిపిస్తుందో అని ఉవ్విళ్లూరుతుంటాడు. ప్రతి విషయానికి విజ్ఞానమై అందుతాడు. బాధను ఛేదించడానికి ఏ ఉపాయం కావాలో అతనికి తెలుసు. ఏ వివరం ఎలాంటి కొలతలకు మందిస్తుందో అతనికి తెలుసు. మన విలువలను కాపాడడానికే, దేశసేవకే తనలోని జ్ఞానాన్నంతా వాడుతాడు. అన్వేషణతో, విజయాల పరంపరతో ఈ శక్తిగానే ఎప్పటికీ ఆరిపోకుండా జ్వలిస్తానంటాడు. అంతులేని ఆసక్తితోనే ప్రతి పనిగా ఫలిస్తానంటాడు. ఇలా నిరంతర సాధన వల్ల మనిషికి దొరికేది సంతప్తే కదా! కాబట్టి అందమైన సంతప్తిగానే నేను జీవిస్తానంటాడు.
నిక్షిప్తమైన నిధి కోసమో, అర్థమవ్వని చిక్కు ప్రశ్న కోసమో, నిరంతరం సాగే సంఘర్షణతో, తపనతో రగిలిపోతూ, వెలిగిపోతూ అతని జీవితం సాగుతుంటుంది. కాని గెలుపులేని ప్రయాణం చేయడు. ఇదీ ప్రత్యేకమైన విషయం. సినిమా మొత్తం ఈ పాటపై ఆధారపడి ఉంటుంది.
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే యువకులకు, విద్యార్థులకు ఈ పాట ఒక ఆయుధంలా ఉపయోగపడుతుంది.
పాట:-
ప్రతి ఒక ఉదయం ప్రశ్నగనే పుడుతుంటా/
తెలిసిన బదులుతొ నిండుగ బలపడుతుంటా/
అడుగడుగడుగున తెలివికి పదునెడుతుంటా/
బ్రతుకొక తరగని తృష్ణగ కదిలెలుతుంటా/
పూర్తిగా కాని ఖాళీలాగే నేనుంటా/
తీరిపోని సందేహాలే దారంతా/
రోజో కొత్త సంగతేదో సాధించే ధ్యాసలో ఉంటా/
ఏ నిమిషం ఏ విషయం నేర్పిస్తుందో/
ఏ సమయం ఏ వివరము వినిపిస్తుందో/
ఆశగా అందనా విజ్ఞానం/
ఏ విషయం ఏ కలతను ఛేదిస్తుందో/
ఏ వివరం ఏ కొలతకు మందిస్తుందో/
సేవకే వాడనా నాలో జ్ఞానం/
జ్వలిస్తా ఆరిపోని ఈ శక్తిగా/
ఫలిస్తా అంతులేని ఆసక్తిగా/
జీవిస్తా అందమైనా సంతృప్తిగా సదా!/
– డా||తిరునగరి శరత్ చంద్ర, sharathchandra.poet@yahoo.com