లేత వయసులో ఉన్న ప్రేమికులకు పరిమళించిన వసంతరాత్రులు కనిపించగానే మనసుల్లో ఏదో తెలియని అలజడి చెలరేగుతుంది. అది చెప్పలేని ఆనందానుభూతిని కలిగిస్తుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అది పాట రూపంలో పొంగి వస్తే ఇలా ఉంటుంది. వసంతమాసపు చిగురింతలను, యువ హృదయాల్లో పూసిన పులకింతలను పాటలో పలికించాడు పింగళి నాగేంద్రరావు. ఈ మధురమైన పాట 1951 లో కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పాతాళభైరవి’ సినిమాలోనిది. ఆ పాటనిపుడు చూద్దాం.
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన ఘనతను దక్కించుకున్న అతి కొద్ది చిత్రాల్లో పాతాళభైరవి ఒకటి. ఆ సినిమా కథ, మాటలు, పాటలు అన్నీ పింగళి నాగేంద్రరావే రాశాడు. ప్రతీ పాట అద్భుతమే. యువ ప్రేమికుల్లో చెరగని ముద్ర వేసిన ‘ప్రేమకోసమై వలలో పడెనే’, ‘కలవరమాయే మదిలో’ పాటలు సంచలనం రేకెత్తించాయి. అంతేకాదు సినిమా ప్రారంభంలో వచ్చే వసంతగానం కూడా గుండెల్ని ఉయ్యాలలూపుతుంది. ఆ సాహిత్యం హృదయాల్ని పరవశింపజేస్తుంది. ఆ పాట గురించి ఇపుడు మాట్లాడుకుందాం.
తీయని ఊహలతో హాయిని కలిగించే ఆ వసంతగానమే హాయి.. అసలైన హాయి.. చెప్పలేనంత హాయి.. హాయిలో హాయిగా తీయగా వయసు, మనసు రెండూ కలిసి సాగిపోతుంటాయని పింగళి నాగేంద్రరావు అభివ్యక్తీకరించాడు.
వసంతంలో పాడే పాటే కాదు. చేసే నాట్యం కూడా హాయే.. హృదయాలు పులకించి గళాలు పాడే పాట, తన్మయత్వంతో శరీరమూగి ఆడే ఆట… రెండూ చెప్పలేనంత హాయిని, సౌందర్యాన్ని కలిగిస్తాయి.
వసంతం అంటేనే చెట్లు చిగురిస్తాయి. ప్రకృతి పరవశిస్తుంది. అది చూసి మనమూ పరవశించిపోతాం. ఈ చిగురించిన తీగెల చాటున దాగి పువ్వులు ఘుమఘుమ నవ్వుతుంటే వనమంతా పరిమళించిపోయిందట.. అలా వనమంతా పరిమళించడం చూసి మనసెంతగానో పరవశించిందని అంటున్నాడు కవి. ఇక్కడ.. పింగళి నాగేంద్రరావు పువ్వులు నవ్వాయని సాధారణంగా చెప్పలేదు. పువ్వులు ఘుమఘుమ నవ్వాయని వినూత్నంగా చెప్పాడు. పువ్వులు ఘుమఘుమలతో పరిమళించడం వాటి సహజత్వం. వాటి సహజ పరిమళమే వాటి నవ్వుగా భావించడం కొత్తగా ఉంది.
చిరుగాలి వద్దకు వచ్చి మెల్లగా గిలిగింతలు కలిగించి, శబ్దం చేస్తుంది. అలా గాలి చేసే గిలిగింతల శబ్దంతో వనమంతా జలదరించిపోయిందని, శరీరమంతా పులకరించిపొయిందని అంటున్నాడు పింగళి. గాలి పెట్టే గిలిగింతలకు ఉక్కిరి బిక్కిరైన ప్రేమికులు తమ యవ్వనాన్ని, కోరికల్ని పరోక్షంగా ప్రకటించుకున్న తీరు కనబడుతుంది.
సరికొత్త రాగంతో కోయిల కూయగానే ఆ రాగంతో వనం రవళించిందని, అది తననెంతో మురిపించిందని ప్రేయసి అంటుంది. కోయిల రాగం అపుడే చిగురించిన కోరికలకు బాట వేస్తుంది. మనసులోని ఆశలను అందలమెక్కించి ప్రియుని కోసం ఆరాటపడేలా చేస్తుంది. యవ్వనానికి, వనానికి మరింత ఉత్సాహాన్నిచ్చే మంత్రశక్తి కోయిల గానంలో ఉందని పింగళి నాగేంద్రరావు చెప్పకనే చెప్పాడు..
తీయగా హృదయాలను తాకి మైమరపించే పాట ఇది. ఈ పాట వచ్చి 75 సంవత్సరాలు గడిచినా వసంతమంతటి నిత్యనూతనంగా నేటికీ పరిమళిస్తూనే ఉంది. పరవశింపజేస్తూనే ఉంటుంది. ప్రకృతిలో వసంతమున్నంత కాలం ఈ వసంతగీతముంటుంది.
పాట:-
తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి/ వసంత నాట్యమే హారు హారు/ చివురుల దాగీ తీవెల నుండి పూవులు ఘుమఘుమ నవ్వగా/ వని అంతా పరిమళించెనే/ మనసెంతో పరవశించినే/ గిలిగింతల చెరలాడి చిరుగాలి సరాగము చేయగా/ వని అంతా జలదరించెనే/ తనువెంతో పులకించెనే/ కొత్తరాగమున కుహూకుహూయని మత్తిలి కోయిల కూయగా/ వని అంతా రవళించెనే నన్నెంతో మురిపించెనే.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682