మధ్యతరగతి జీవితమంటేనే ఎన్నెన్నో సమస్యల వలయం. రెంట్‌కి, కరెంట్‌కి, పిల్లల ఫీజులకి… ఇలా ఎన్నో ఖర్చులు. సంతోషం కొంత, బాధ మాత్రం ఎంతో..! కలిసి పంచుకునే బాధలోనే సంతోషాన్ని వెతుక్కునే జీవితాలు మధ్యతరగతి వాళ్ళవి. అలాంటి జీవితాల సంగతులను, సందళ్ళను, విశేషాలను వివరిస్తూ తరుణ్ సైదులు రాసిన పాటనిపుడు చూద్దాం.
1990 దశకం మధ్యతరగతి జీవితకథను ఎంతో మధురంగా మలచి, 90s A Middle Class Biopicμ (2024) పేరుతో మనముందుకు తీసుకువచ్చారు ఆదిత్యహాసన్. ఈమధ్యే విడుదలైన ఈ వెబ్ సిరీస్ అందరి మనసుల్ని దోచుకుంది. మధ్యతరగతి జీవితాలకు అద్దంపడుతూ ఎంతో గొప్పగా చిత్రించబడింది. ఇందులో కథ అంతగా ఏమీ లేదు. కేవలం మన జ్ఞాపకాల సమాహారమే ఈ సినిమా. ఇందులోని టైటిల్ సాంగ్‌ని తేలికైన పదాలలో తరుణ్ సైదులు అద్భుతంగా రాశాడు.
పక్కా తెలంగాణ మాండలికంలో రాసిన పాట ఇది. తెలంగాణలో వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మ్యాథమేటిక్స్ టీచర్ గా పనిచేస్తుంటాడు కథానాయకుడు. అతడు మధ్యతరగతి కుటుంబీకుడు. ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అతనికి ముగ్గురు పిల్లలు. ఇంటి ఖర్చులకు, పిల్లల స్కూల్ ఫీజులకు బడ్జెట్ వేసుకుని జీవితాన్ని నెట్టుకొస్తున్న మాష్టారాయన. ఆ బతుకుచిత్రాన్ని ఈ పాట ద్వారా మన కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు తరుణ్ సైదులు.
ఈ మధ్యతరగతి బతుకులో ఏదీ అబద్ధం కాదు. వినాలే కాని ప్రతి మనసు మనసులో ఓ వ్యథార్థగాథ దాగి ఉంది. ఆలోచించాలే కాని ప్రతి ఇంటిలో మన కళ్ళముందే ఓ యథార్థగాథ కనబడుతుంది. నిలకడలేని బతుకే ప్రతి మనిషిది. కష్టాలకు, కన్నీళ్ళకు కుంగిపోవడం, చిన్ని సంతోషాలకే పొంగిపోవడం, పట్టరాని దు:ఖమొచ్చినా, పట్టరాని సంతోషమొచ్చినా ఆపుకోలేకపోవడం మధ్యతరగతి మనుషులు నిత్యం చేసే పనే. సమయానికి జీతం రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, వడ్డీలు చెల్లించకపోవడం, ఫోన్ వస్తే చాలు చిట్ ఫండ్ నుంచే కాబోలు అన్న భయం.. ఇలా మన మధ్యతరగతి బతుకులు చిత్రవిచిత్రంగా ఉంటాయని ఈ పాటలో తెలియజేశాడు.
తెల్లారితే చాలు… ఉరుకుల పరుగుల జీవితం. స్కూల్‌కి టైమవుతుంది. రెడీ అవ్వడం, బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, డ్యూటీకి వెళ్ళడం, డ్యూటీ ముగించుకుని ఇంటికి రావడం.. మళ్ళీ యధావిధిగా కొనసాగుతుందీ ధారావాహిక. ఇంట్లో భార్యకి చెప్పి పాస్‌బుక్ తీసుకుని బ్యాంక్‌కి వెళ్ళడం, రహదారుల్లో నడుస్తూ నడుస్తూ వేడికి మలమలమాడిపోవడం, గంటల తరబడి క్యూలో నిలబడి నిలబడి విసుగు చెంది వెనక్కి రావడం, చెప్పడానికి వీలులేని ఎన్నో తిప్పల్ని తనలో తాను అనుభవిస్తూ బతుకు లెక్కలు వేసుకుంటున్న లెక్కల మాష్టారు జీవితమిది అంటూ సినిమాకథ మొత్తాన్ని ఈ పాటలో ఇమిడ్చాడు తరుణ్.
మధ్యతరగతి జీవితాలకు పెద్ద ఆశలేమీ ఉండవు. పై నుంచి విమానం పోతుంటే అందులో కూర్చోవాలన్న కోరిక. ఆ విమానాన్ని చూస్తూ లోలోపల ఎన్నెన్నో ఊహించుకోవడం, కేరింతలు కొట్టడం, పెరుగన్నంతోనే కడుపునింపుకోవడం.. ఇవే- మధ్యతరగతి మనుషుల మనసుల్లో ఉన్న చిన్న ఆశలు, కోరికలు. పండుగ వస్తే ఇంటికి సున్నం కొట్టడం, ఆదివారం కోడిని తెచ్చుకొని కోసి కూర వండుకొని ఇంటిల్లీపాది తినడం, అమృతం, పంచతంత్రం వంటి కామెడీ సీరియళ్ళను, వినోదభరితమైన ధారావాహికలను చూస్తూ వారి జీవనయంత్రం సాగిపోతుంటుంది. ఇది మధ్యతరగతి బతుకుల కథ. ఇంతకు మించి వాళ్ళ జీవితంలో ఏమీ ఉండదు. సంతృప్తి, బాధ, ఆశలు అన్నీ కలగలుపుకొని సాగిపోతూ ఉంటుంది.
ఇది సినిమా సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన పాటైనా ఇది వింటే ప్రతి మధ్యతరగతి మనిషి తన కోసమే రాశాడా? అన్నంత అద్భుతంగా అనిపిస్తుంటుంది. ప్రతి మనిషి మనసు పొరల్లో దాగి ఉన్న జ్ఞాపకాల మూటను ఒక్కసారిగా తడిమినట్లుగా అనిపిస్తుంది. ఈ పాట విన్నా, సినిమా చూసినా వర్తమానంలో ఉన్న ప్రతి మనిషి ఒక్కసారిగా 1990 దశకంలోకి వెళ్ళి హాయిగా తీయని జ్ఞాపకాలను నెమరవేసుకుంటాడు. జ్ఞాపకాలతో నిండిన హృదయాన్ని, కళ్ళను తడి చేసుకోకుండా ఉండలేడు. ఈ పాటకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించి, తరుణ్ సైదులుతో కలిసి పాడారు. శివాజీ, వాసుకి ఆనంద్, రోహన్ రారు, మౌళి, స్నేహల్ కామత్ ల నటన ఈ సినిమాకి, పాటకి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు.
పాట:
రామ రామ ఈడా ఏది కల్లా కాదు సున్ లోనా!/
నిలకడ లేని బతుకే నీదీ నాదీ సోచోనా!/
సాలరీ లేటయింది చిట్టిలోని ఫోనా ఏంది/
నీ స్కూల్ కి టైమయింది ఇస్తిరి గొట్ట లేటయింది/
డర డిప్ప డిప్ప డిప్ప డర డిప్ప డిప్ప డిప్ప/
డర డిప్ప డిప్ప డిప్ప డిప్పారే/
పాసుబుక్కు తీసుకో తల్లి యాలయితాంది/
తొవ్వ పొంటి గరిమెల ఫుల్లు హీటైతాంది/
బ్యాంకు కాడ బొచ్చెడు జనం/
బ్యాకు స్టెప్పు ఏసుడె మనం/
చెప్పలేని తిప్పలు గప్పుతు లెక్కల మాష్టారు/
మీది మోటరువోతుంటె మేమండ్ల కూసుంటం/
పెద్ద ఆశలేమీ లేవు పెరుగన్నమైనా తింటం/
పండగొస్తె సున్నంగొట్టి ఐతారం కోడినివట్టి/
అమృతం పంచతంత్రం చూస్తూ సాగే జీవనయంత్రం/
డర డిప్ప డిప్ప డిప్ప డర డిప్ప డిప్ప డిప్ప/
డర డిప్ప డిప్ప డిప్ప డిప్పారే..
– డా||తిరునగరి శరత్‌చంద్ర, sharathchandra.poet@yahoo.com