ప్రేమికుల నవ్వుకు భాష్యం చెప్పిన పాట

ప్రేమికుల నవ్వుకు భాష్యం చెప్పిన పాటనవ్వు గొప్పతనాన్ని గూర్చి కవులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. నవ్వును గూర్చి వివరిస్తూ ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. అలాంటి నవ్వును – అందునా ప్రేమికుల నవ్వు చలువను తెలుపుతూ సినీకవి చంద్రబోస్‌ ఒక పాటను రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
చంద్రబోస్‌ పాటల్లో సరికొత్త ప్రయోగాలు పరుగులు తీస్తాయి. ఆయన ప్రతి పదాన్ని కూడా ఎంతో అర్ధవంతంగాను, అద్భుతంగాను ప్రయోగిస్తాడు. ట్రెండ్‌కు తగినట్టుగా ఆయన ఎన్నెన్నో కొత్త కొత్త పదాలను సృష్టించాడు. జంట పదాలు, కొంటెపదాలు, వింతపదాలు, గిలిగింత పదాలు ఇలా ఎన్నో రకాలుగా పదాలకు పురుడు పోశాడు.
అయితే – ఎం.ఎస్‌.నారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘కొడుకు'(2004) సినిమాలో అలాంటి పాటే ఒకటి రాశాడు. సరికొత్త పదాలతో కొంగ్రొత్త భావాల్ని ప్రకటించి ఔరా! అనిపించాడు. ఇందులో – నవ్వును ఎన్నెన్నో తీర్లల్లో ఊహించాడు. అయితే – ఆ నవ్వు మామూలు నవ్వు కాదు. ప్రతి మనిషికి చెందినది కాదు. కేవలం ప్రేమికులదే. ఇది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం..
అలిగిన ప్రేయసిని నవ్వించడానికి, కంటనీరుతో వెలవెలబోయిన ప్రేయసి ముఖాన్ని వెలిగించడానికి హీరో పాడే పాట ఇది. నెలవంకలాగా వెన్నెలలు వెదజల్లుతూ నవ్వమని, పసిపాపలాగా నిర్మలంగా, స్వచ్ఛంగా నవ్వమని ప్రేయసిని కోరుతున్నాడు ఆ ప్రియుడు.
మాట నవ్వితే పాటవుతుంది. మల్లెపూవు నవ్వితే అది విరగగాసి తోటవుతుంది. మబ్బు నవ్వితే అలజడి చెలరేగి అది వర్షమవుతుంది. అలాగే – ప్రేయసి మనసు నవ్వితే అది ప్రేమవుతుందంటాడు. అంటే – ప్రేయసి మనసు నవ్వు ప్రేమకు సంకేతమన్నమాట. అయితే – ఇక్కడ ప్రేయసి నవ్వును గూర్చి చెప్పడానికి సృష్టిలోని సహజ సౌందర్యాన్ని గూర్చి చెబుతూ, ప్రాకృతిక విషయాలను ఉదాహరణలుగా చెబుతూనే ప్రేయసి నవ్వును గూర్చి వివరిస్తున్నాడు. అంటే – ఆమె మనసులోని నవ్వు ప్రేమకు చిరునామా అయితే – అలా పుట్టిన ప్రేమ తనకే సొంతం కావాలన్న తపన కూడా ప్రియునిలో అంతర్లీనంగా కనబడుతుంటుంది.
కాయ నవ్వితే అది పండవుతుంది. ఎందుకంటే – కాయ పరిపక్వత చెందే దశ పండే కదా! ఆ పండే కాయ నవ్వుగా భావిస్తున్నాడు. కాకమ్మ నవ్వితే అది కబురవుతుందట. కాకి కబురు అంటాం కదా! కబురుగా కాకి నవ్విందని ఇక్కడ అర్థం.. అది ప్రేమ కబుర్లు మోసుకొచ్చిందని కూడా భావించుకోవచ్చు. చిరునవ్వు నువ్వు నవ్వితే అది చలిమంటవుతుంది. ఆ చలిమంట ప్రియుని మనసులో పుడుతుందని మనం గ్రహించాలి. ఇక్కడ – కాయ నవ్వు గురించి, కాకి నవ్వు గురించి చెప్పడం కవి ఉద్దేశ్యం కాదు. ప్రతి చరణం చివరివాక్యంలో ఉదాత్తంగా, ఉత్తమోత్తమంగా ప్రేయసి నవ్వు గురించి చెప్పడమే కవి ఉద్దేశ్యం. దానికి బదులుగా – ఇక్కడ ప్రేయసి కూడా ప్రియుని నవ్వును గూర్చి పొగుడుతుంది. ఆమె కూడా ప్రియునిలాగే ప్రాకృతిక విషయాలను గూర్చి ముందుగా వివరిస్తూనే ప్రియుని నవ్వును గూర్చి తెలియజేస్తుంది.
పాలు నవ్వితే అది తోడుకొని పెరుగుగా మారుతుందట. దీపాలు నవ్వితే వెలుగవుతుందట అని చెబుతూనే ముసిముసినవ్వులతో నువ్వు నవ్వితే అది ముసురవుతుందని చమత్కరిస్తుందామె. దానికి ప్రతిగా ప్రియుడు నిన్న నవ్వితే అది నేడైపోతుంది. నేడు నవ్వితే అది రేపైపోతుంది. నువ్వు, నేను నిండుగా నవ్వితే నూరేళ్ళవుతుందంటాడు. అంటే నూరేళ్ళ జీవితమవుతుందని అర్థం. ప్రేయసిని అతడు చిరునవ్వుగా భావిస్తే, ప్రేయసి అతడిని ముసినవ్వుగా భావిస్తుంది. ఇది మరో ప్రత్యేకత. ఇలా ఒకరినొకరు, ఒకరి నవ్వును గూర్చి ఇంకొకరు చెప్పుకోవడంలోనే ఇరువురి మధ్యన ఉన్న ప్రేమ స్పష్టమవుతుంది.
ప్రేయసి చూపు నవ్వితే చాలు ఆమె ముందు వాలిపోతానంటాడు. ఆమె చెంప నవ్వితే చాలు అది ముద్దవుతుందని భావిస్తున్నాడు. అంటే – ముద్దు పెడితేనే ఆమె చెంప నవ్వులు చిందిస్తుందని అర్థం. ఆమె పైట చెంగు నవ్వితే చాలు ఆమె ముందు సాగిలపడి ఉంటానని ప్రేయసితో చెబుతున్నాడు. పై వాక్యాల్లో ఆమె ముందు, ఆమె నవ్వుముందు తాను దాసోహమంటూ నిలుచున్నానని తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు.
అపుడు ప్రేయసి – మువ్వ నవ్వితే అది పదమవుతుంది. చెవిదుద్దు (చెవికమ్మలు) నవ్వితే కథ వింటాను. నా చీర కొంగు నవ్వితే సిగ్గవుతుందంటుంది. అంటే – ఆమె మువ్వ కదిలిందంటే అడుగు కదిలినట్టే కదా! ఆమె చెవిదుద్దు కదిలిందంటే చెవిలో ప్రియుడు రహస్యమైన వలపుకథలు చెప్పినట్టే కదా! ఇక సిగ్గుపుట్టిందంటే చీరకొంగు జారిందన్నమాట. చీరకొంగు జారడాన్నే చీరకొంగు నవ్వినట్టుగా చెప్పడం వినూత్నంగా ఉంది. దానికి ప్రతిగా ప్రియుడు – కలలు నవ్వితే పగలవుతుందంటాడు. ఎందుకంటే ప్రేయసీప్రియులు ప్రేమలో ఉంటే పగటికలలు కంటూనే ఉంటారు కదా! కలల్లో కూడా ఒకరి ధ్యాసలో ఒకరు ఉంటారు. ఇక ఆమె కురులు నవ్వితే అది రేయవుతుందంటున్నాడు. ఆమె కురుల నల్లదనాన్ని రేయిగా భావిస్తున్నాడు. ఇది కావ్యాల్లోని, ప్రబంధాల్లోని ఉపమానమే. పగలు, రాత్రి, పరువం (వయసు) ఈ మూడు నవ్వితే అది సరసమవుతుందంటున్నాడు. అంటే – నిండైన రసానందాన్ని, మెండైన రసానుభూతిని అవ్యక్తమైన ప్రేమను ఈ చివరి వాక్యంలో తెలియజేశాడు. ఇది ప్రేయసి నవ్వుకు మొదట ప్రియుడు అర్థం చెబితే, దానికి ప్రతిగా ప్రియుని నవ్వుకు ప్రేయసి అర్థం చెప్పడం సరికొత్తగా ఉంది. ప్రేయసీప్రియుల నవ్యాతినవ్యమైన ప్రేమానుభూతి వారిరువురి నవ్వులలో స్పష్టంగా తెలియజేయబడింది.
పాట:-
నవ్వూ నవ్వూ నెలవంకల్లే నవ్వూ/ నవ్వూ నవ్వూ పసిపాపల్లే నవ్వూ/ మాట నవ్వితే పాట మల్లె నవ్వితే తోట/ మబ్బు నవ్వితే వాన నీ మనసు నవ్వితే ప్రేమా! /కాయ నవ్వితే పండంట కాకమ్మ నవ్వితే కబురంట/ చిరునవ్వు నువ్వు నవ్వితే చలిమంట/ పాలు నవ్వితే పెరుగంట దీపాలు నవ్వితే వెలుగంట/ ముసినవ్వు నువ్వు నవ్వితే ముసురంట/ నిన్న నవ్వితే నేడంట నేడు నవ్వితే రేపంట/ నువ్వు నేను నిండుగా నవ్వితే నూరేళ్ళంట/ చూపు నవ్వితే ముందుంటా నీ చెంప నవ్వితే ముద్దంటా/ నీ పైట చెంగు నవ్వితే పడి ఉంటా/ మువ్వ నవ్వితే పదమంటా చెవిదుద్దు నవ్వితే కథ వింటా/ నా చీరకొంగు నవ్వితే సిగ్గంటా/ కలలు నవ్వితే పగలంటా నీ కురులు నవ్వితే రేయంట/ పగలు రేయి పరువం నవ్వితే సరసాలంటా..

sharathchandra.poet@yahoo.com