ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తిందామంటే తిండి దొరకని నిరుపేదలున్నారు. తలదాచుకోవడానికి నిలువ నీడ లేని అభాగ్యులున్నారు. అమాయక ప్రాణులున్నారు. చదువుకోవాల్సిన వయసులో తాపీపని చేసే బాలకార్మికులున్నారు. ఈ దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం వంటి సమస్యలు తీరేదెప్పుడో? కూడు, గుడ్డ, గూడు వంటి కనీస అవసరాలకు కూడా నోచుకోని బడుగుజీవుల వెతలు తీరేదెన్నడో? అంటూ ఆవేదనతో రాచపల్లి ప్రభు రాసిన పాటనిపుడు పరిశీలిద్దాం..
ఒకే ఒక్క పాటతో తెలుగు సినిమారంగాన్ని ఒక ఊపు ఊపేసిన కవి రాచపల్లి ప్రభు. ఆయన సినిమాల్లో ఒక్క పాటను మాత్రమే రాశారు. అది ‘ఎర్రమల్లెలు’ (1981) సినిమాలోని ”నాంపల్లి టేషను కాడి రాజాలింగో రాజాలింగా” అనే పాట. ఈ పాట వినని తెలుగువాడు ఉండడు. తెలుగుపాటలు వినే ప్రతీ తెలుగువాడు ఈ పాట వినే ఉంటాడు. అంతటి సంచలనం సృష్టించిన పాట ఇది. ప్రభు ప్రజానాట్యమండలి కళాకారునిగా ఉన్నప్పుడే రాసిన పాట ఇది. తరువాత ఈ పాట సినిమాలోకెక్కి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ ఒక్క పాట కోసమే థియేటర్లకు పరిగెత్తిన వాళ్లున్నారు. సామాజిక దృక్కోణంలో ఎలుగెత్తిన ఉప్పెనంటి గీతమిది. తెలుగు సినిమాల్లో 100 ఉత్తమ గీతాల్ని ఎంపిక చేసినపుడు అందులో ఈ పాట చోటు దక్కించుకోవడం విశేషం.
హైదరాబాద్ పాతనగరంలోని శాలిబండకు చెందిన రాచపల్లి ప్రభు చిన్నప్పటి నుంచి అభ్యుదయభావాల్ని నరనరాన నింపుకున్నవాడు. అభ్యుదయ భావజాలంతో ఆయన రాసిన పాటలు ఆంధ్రదేశమంతటా మారుమ్రోగాయి. అయితే ప్రజానాట్యమండలి కళాకారుడిగా ఉంటూ ఆయన రాసిన ”నాంపల్లి టేషను కాడి రాజాలింగో” అనే పాట 1970 దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాది వేదికలను ఉర్రూతలూగించింది. వేములవాడ జాతర పాట బాణీలో రాసిన ఈ గీతం విశేష జనాదరణ పొందింది. ప్రభు ఈ పాటతో అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను ప్రజల భాషలో, ప్రజల బాణీలో వ్యక్తం చేశాడు. ప్రజానాట్యమండలి గీతంగా ప్రతి నోటా మోగుతున్న ఈ పాటను రెడ్‌స్టార్ గా పేరొందిన మాదాల రంగారావు తాను దర్శకత్వం వహిస్తున్న ‘ఎర్రమల్లెలు'(1981) సినిమాలో ఉపయోగించుకున్నారు. గాయనిగా ఎస్.పి.శైలజ కు ఇది తొలిగీతం. అప్పటికే ప్రజల్లో ప్రఖ్యాతి గాంచిన ఈ పాట సినిమాలోకెక్కిన తరువాత మరింత ప్రాచుర్యం పొందింది. అంతే కాదు.. ఈ పాటలో నటించిన కుర్రవాడు మాదాలరంగారావు కుమారుడు మాదాల రవియే..
సినిమా కథ పరంగా చూసినట్లయితే ఆకలికి అల్లాడే ఓ కుర్రవాడు ఆవేదనతో పాడే పాట ఇది. పాడిపంటలతో సస్యశ్యామలంగా విరాజిల్లిన ఆనాటి రామరాజ్యం నేడు నిరుద్యోగంతో, దోపిడీతో, అరాచకాలతో, అధర్మంతో తాండవిస్తుంది. ఇదేనా రామరాజ్యం? అని ప్రశ్నిస్తూ పాడుతుంటాడు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేద్దామంటే ఏ పనీ దొరకదు, ఎక్కడికైనా పోదామంటే తావూ లేదు. గుక్కెడు గంజి లేక ప్రాణాలు బక్కచిక్కిపోతున్నాయి. డొక్కల్లో శక్తిలేక అమాయకులు విలవిలలాడిపోతున్నారు. బీదప్రజల పొట్టను కొట్టి, వారి శ్రమను, శక్తిని దోచుకొని ఉన్నవారు మేడమీద మేడ కడుతూనే ఉన్నారు. పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. అప్పటికే 34 ఏళ్ళ స్వాతంత్య్రం మనకు ఏమిచ్చింది? ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నిస్తున్నాడు.
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన కొందరు స్త్రీలకు కట్టుకునే బట్ట కూడా బరువైపోయిందట. ఫ్యాషన్లకి, జల్సాలకి అలవాటు పడి చిన్న చిన్న దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు. మన సంస్కృతిని, సభ్యతను మరిచిపోతున్నారు. ఇదిలా ఉంటే.. నిరుపేదరాలికి కట్టుకోవడానికి బట్టలు లేక అతుకులతో వేసిన దుస్తులు ధరించి, చాలీ చాలని బట్టల్లో శరీరాన్ని దాచుకునే పరిస్థితి దాపురించింది. ఇది నేటి మన దేశ దుస్థితి అని అంటున్నాడు.
అధికారమున్నవారు, డబ్బు ఉండి దర్పమున్నవారు ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఎందరి నెత్తినో చేతులు పెడుతుంటారు. అలా ఎంతోమంది నిరుపేదలను తొక్కి మేడలు కట్టి సుఖంగా జీవిస్తుంటారు. ఇలా వెనకాల తప్పులు చేసి, గుళ్ళో దేవుడి ముందు మాత్రం మొక్కులు మొక్కి ముడుపులు కడుతుంటారు. ఇదంతా వేడుక చూస్తున్న దేవుడు మాత్రం ఏం మాట్లాడడం లేదే అని కుర్రవాడి ప్రశ్న. ధర్మం నలిగిపోతూనే ఉంది. అధర్మం పెచ్చుపెరిగి మరింత వికృతంగా తాండవిస్తూనే ఉంది. ఈ దుస్థితి ఏనాటికి తొలగిపోతుంది? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ స్వాతంత్య్ర భారతంలో సమానత్వం ఏనాటికి వెల్లివిరుస్తుంది. ఉన్నవాడు, లేనివాడు ఒక్కటేనన్న సామ్యవాద సమాజం ఎప్పుడు ఉదయిస్తుందో అని ప్రశ్నిస్తున్న తీరు ఈ పాటలో కనిపిస్తుంది.
అవినీతిని, అక్రమాల్ని ఆవేశంతో ప్రశ్నిస్తూ, నిరుపేదల వైపు నిలబడి పిడికిలెత్తిన పాట ఇది. అమాయకుల చీకటి జీవితాల వైపు వెలుగు బావుటానెత్తి నిలబడిన పాట ఇది. ఎప్పటికీ ఎర్రగా మండే అక్షరకాగడా లాంటి పాట ఇది. తెలుగు సినిమాపాట బతికున్నంతకాలం ఈ పాట బతికే ఉంటుంది..
పాట:-
నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా/
రామారాజ్యం తీరు సూడు శివాశంభులింగా..
లింగా రామారాజ్యం తీరు సూడు శివాశంభులింగా/
తిందామంటె తిండీ లేదు ఉందామంటె ఇల్లే లేదు/
చేదామంటె కొలువు లేదు పోదామంటె నెలవు లేదు/
గుక్కెడు గంజి కరువైపాయె బక్కటి ప్రాణం బరువైపాయే/
బీదాబిక్కి పొట్టలు కొట్టి మేడలు గట్టె సీకటి శెట్టి/
లేని అమ్మది అతుకుల బతుకు/
ఉన్న బొమ్మకి అందం ఎరువు/
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె/
ముందు మొక్కులు ఎనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును/
ఉలకావేమి పలకావేమి బండరాయిగ మారిన సామి..
– డా||తిరునగరి శరత్ చంద్ర,
sharathchandra.poet@yahoo.com