ఉద్యమాల బాటలో నడవమన్న పాట

A song to walk in the path of movementsఅన్యాయం జరిగినప్పుడు పిడికిలెత్తి ఎదురు తిరగడం సహజమే. ఆ అన్యాయాన్ని కాలరాసి న్యాయాన్ని గెలిపించడం మనిషి ధర్మమే. అయితే అధర్మం విచ్చలవిడిగా సంచరించినపుడు, అది సామాన్య మానవులను తీవ్రంగా బాధిస్తున్నప్పుడు ఆ అధర్మానికి ఎదురు తిరగమని, యుద్ధం చేయమని ఏ తల్లైనా తన కొడుకుకి చెబుతుంది. అలా.. తనకు, తన కుటుంబానికి, తన ఊరికి జరిగిన అన్యాయాన్ని కొడుకుకి చెబుతూ, అతనిలో అభ్యుదయ భావాలను మొలకెత్తిస్తూ ఉద్యమబాటలో నడవమని కొడుకుని ప్రేరేపిస్తుంది ఓ తల్లి. అలా తల్లీకొడుకుల మధ్యన ఆవేదనతో, ఆవేశంతో సాగే పాట ఇది. 1997 లో బి. గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అడవిలో అన్న’ సినిమాలో జయరాజు రాసిన ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.
జయరాజు అసలు సిసలైన ప్రజాకవి. ఆయన పాటల్లో ఆర్ద్రత ఉంటుంది. ఆవేశం ఉంటుంది. కన్నీటి జీవితాలను వ్యాఖ్యానించాలన్నా, ఉద్యమానికి ఉసిగొలిపే అభ్యుదయగీతం రాయాలన్నా, స్వచ్ఛమైన పలుకుబళ్లతో అచ్చమైన జానపదగీతం రాయాలన్నా అది జయరాజుకే సాధ్యం. ఆయన రాసిన ప్రతీ పాట జనం నోళ్లలో నానుతూనే ఉంది. అడవిలో అన్న సినిమాలో కార్యసాధకుడైన తన కొడుకుని ఉద్యమానికి ఉసిగొలుపుతూ ఓ తల్లి పాడే పాటను రాశాడు. కొడుకు తన తల్లి ఆశీస్సులందుకుంటూ, తల్లి చెప్పే సంగతులన్నింటిని తనలో ఆకళింపు చేసుకుంటూ ఉద్యమానికి సిద్ధమవుతాడు.
సినిమాకథ పరంగా చూస్తే.. ఊరి దొరలు తన తండ్రిని భూమికోసం అన్యాయంగా చంపేస్తారు. తన తల్లిని హింసించి, అమాయకులను చిత్రవధ చేస్తారు. అందుకే కొడుకైన హీరో తనకు, తన కుటుంబానికి, తన ఊరికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తన తండ్రి రుణమూ తీర్చుకోవాలనుకుంటాడు. ఇదీ సందర్భం..
అమ్మా.. వందనాలమ్మా అంటూ తన తల్లికి నమస్కరిస్తూ పల్లవిని ప్రారంభించాడు. తన తల్లిని దైవంగా భావిస్తూ ఆమె చూపిన మార్గంలోనే ప్రయాణించాలనే సంకల్పంతో ఉన్నాడు హీరో. కొడుకు నమస్కారాలను స్వీకరించిన ఆ తల్లి, కొడుకును సల్లగా బతుకుమని, సూర్యునిలా తేజోవంతంగా వెలగమని ఆశీర్వదిస్తుంది.
తన తల్లి నిర్మలమైన మనసు గలది. కరుణతో అందరినీ ఆదరించే వ్యక్తిత్వం గలది. ఎప్పుడూ శ్రీరాముడినే దైవంగా ఆరాధిస్తుంది. అయినా ఆమె కష్టాలు తీరలేదు. ఆమె జీవితం మారలేదు. ఆ విషయాన్నే తన తల్లికి విన్నవిస్తూ ఇలా అంటున్నాడు హీరో. నిత్యం రాముడిని కొలిచావు. ఎన్నో పూజలు చేశావు. అయినా నీ బాధలు తీరలేదు. ఉన్న గూడు చెదిరిపోయింది. గుండెలవిసిపోయాయి. అయినా ఆ రాముడు కొండదిగి రాలేకపోయాడని కొడుకు తల్లితో అంటాడు. నీతి కొరకు రాముడే వనవాసం చేశాడు.. భూమికోసం నీ తండ్రి రక్తాన్ని చిందించాడు. అని చెబుతుంది. రాముడంతటివాడికే వనవాసం తప్పలేదు. అలాంటిది మామూలు మనిషిని, నాకు ఇలాంటి పరీక్షలు, కష్టాలు ఉండడం పెద్ద విశేషమేమీ కాదు. అనే విషయాన్ని కూడా అంతర్లీనంగా చెబుతోంది ఆ తల్లి.
తన తండ్రి భూమి కోసం జీవితాన్నే ధారబోసిన విషయాన్ని కొడుకుకి గుర్తు చేసి అతనిలో విప్లవాన్ని, ఆవేశాన్ని నూరిపోస్తోంది. తరువాత వాక్యాల్లో.. తలవంచి నిలవద్దని, ఏది ఏమైనా ఎదిరించే నడవాలనే ధైర్యాన్ని కూడా కొడుకుకి నూరిపోస్తోంది. తన తండ్రిని మించిన కొడుకుగా పేరుపొందాలంటుంది. అందుకే.. ఉద్యమపతాకాన్ని అందుకొమ్మని, అనుకున్నది సాధించేవరకు, కోరుకున్న విజయం దరిచేరేవరకు ఆ జెండాను వదలవద్దని చెబుతోంది.
ఆ మాటలకు కొడుకు సమాధానం చెబుతూ.. వీరతిలకం దిద్దినావు. నన్ను ఉద్యమాలబాటలో నడవమన్నావు.. నువ్విచ్చిన ఈ వీరోత్సాహం నేను మరవను.. చావైనా, బతుకైనా వెనుకడుగువేయనమ్మా.. నీ మాటను నేను జవదాటనమ్మా.. నిన్ను వీడబోను.. నీ మాట మరిచిపోను.. అంటూనే తన తల్లికి మాట ఇస్తున్నాడు.
ఇంకా.. ఏం చేయాలో ఆ తల్లి చెబుతూనే ఉంది. రావణుడు కూలాలి.. రాజ్యం మారాలి. అని చెబుతోంది. అంటే.. రావణుడనే దొర కూలిపోవాలి.. రాముని రాజ్యం రావాలి. ప్రజలంతా నీతిమార్గంలో నడవాలి.. సుఖశాంతులతో సుభిక్షంగా అందరూ బతకాలి.
అణచివేయబడ్డ వాళ్ళంతా, చెరచబడ్డవాళ్ళంతా వీరావేశంతో, ప్రతీకారంతో కామందు దొరగాని కంఠాన్ని నరకాలి. అణచివేయబడ్డ వాళ్ళకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో కామందు దొరకు తెలిసేలా తగిన శాస్తి చేయాలని చెబుతోంది. ఇక పోరుబాటలో కదలమని, గెలవమని చెబుతోంది. కొడుకు మీదే తన ఆశ, ధ్యాస, సర్వస్వం అన్నీ వున్నాయని, కొడుకు వల్లనే తన జీవితం తూర్పున సూర్యునిలా వెలగాలని కోరుకుంటోంది. కొడుక్కి ఆవేశాన్ని, ఉద్యమబాటలో నిరంతరం సాగే ఉత్సాహాన్ని, నిండైన ధైర్యాన్ని కలిగిస్తోంది తల్లి. విజయమార్గంలో నడిచి, జీవితాన్ని పణంగా పెట్టైనా సరే తండ్రి రుణాన్ని తీర్చుకొని, ఊరి ప్రజలకు సంతోషాన్ని కలిగించమని బోధిస్తోంది.
అన్యాయాలకు, అక్రమాలకు ఎదురుతిరిగి ఉద్యమావేశాన్ని రంగరించుకొమ్మని బోధిస్తోందీ పాట. కొడుకుని వీరున్ని చేసి మంచికోసం పోరాడమని చెప్పే తల్లి ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా తెలుస్తుంది.
పాట:
వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా/
వందనాలమ్మా నీకు వందనాలమ్మా/
సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు/
సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లు/
సుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ/
రామున్ని కొలిచినావమ్మా/
నిత్యం పూజలే చేసినావమ్మా/
గూడు చెదిరిపోయే గుండెలవిసిపాయె/
కొలిచినా రామయ్య కొండదిగి రాడాయే/
నీతికై రామయ్య రాచిన్న/
వనవాసమేగాడురా కన్నా/
భూమికై నీ అయ్యరా చిన్నా/
రక్తాన్ని చిందాడు రా కన్నా/
తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి/
తండ్రినే మించిన తనయుడవ్వాలిరా/
అందుకోవయ్య ఆ జండానొదలబోకయ్యా/
వీర తిలకం దిద్దినావు/ పోరుదారిలో నడవమన్నావు/
చావైన బ్రతుకైన వెనుదిరగనోయమ్మ/
కనతల్లి మాటను జవదాటనోయమ్మ
వీడబోనమ్మా నీ మాట/ మరువలేనమ్మా/
రావణుడు కూలాలి రా చిన్నా/
రాజ్యమే మారాలి రా కన్నా/
అణచబడ్డోళ్ళంతా చరచబడ్డోళ్ళంతా/
కామందు దొరగాని కంఠాన్ని నరకాలి/
కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా/
నీ మీదే నా ఆశ నీ మీదే నా ధ్యాస/
నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి/
కదలరా చిన్నా పోరులో గెలవాలి కన్నా/
కదలరా చిన్నా/ పోరులో గెలవాలి కన్నా..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682