భిన్న కాన్సెప్ట్‌తో సౌండ్‌ పార్టీ

 With a different concept Sound partyఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 1గా వి.జె.సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్‌ సమర్పణ. సంజరు శేరి దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఈ చిత్ర టైటిల్‌, పోస్టర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాన్సెప్ట్‌ కూడా ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉండబోతున్నట్లు టైటిల్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇటీవల విడుదల చేసిన టైటిల్‌కు వచ్చిన స్పందనే పోస్టర్‌కు కూడా వస్తోంది. మా యూనిట్‌ అంతా ఎంతో శ్రమించి అనుకున్న దానికన్నా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని నిర్మాత రవి పోలిశెట్టి చెప్పారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ, ‘మా చిత్ర పోస్టర్‌ని కవిత లాంచ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని చెప్పారు.
దర్శకుడు సంజరు శేరి, సమర్పకుడు జయశంకర్‌ మాట్లాడుతూ, ‘మేము ఏ ఉద్దేశ్యంతో టైటిల్‌ పెట్టామో దానికి రీచ్‌ అయ్యాము. టైటిల్‌ విన్న వారంతా కూడా చాలా బావుంది అంటున్నారు. మా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్‌తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశాము’ అని తెలిపారు.