రాఘవపూర్‌కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్‌ కుమార్‌
నవతెలంగాణ-సిద్ధిపేటరూరల్‌
మండలం పరిధిలోని రాఘవపూర్‌ గ్రామానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని రాఘవపూర్‌ ఎస్‌ఎఫ్‌ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాఘవపూర్‌ గ్రామం నుంచి కామారెడ్డి వెళ్లే బస్సులు ఉన్న ఏ ఒక్క బస్సు గ్రామం వద్ద ఆపకుండా వెళ్తాయన్నారు. చుట్టుపక్కల ఉన్న దాదాపు ఐదు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులంతా రాఘవపూర్‌ స్టేజిపై వచ్చి బస్సు ఎక్కి పోతుంటారు. బస్సులు ఆపకుండా వెళ్లడం వల్ల విద్యార్థులు కళాశాలకు సరైన సమయానికి వెళ్లలేకపోతున్నారు దీనివల్ల క్లాసులు మిస్‌ అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. కాబట్టి విద్యార్థుల సమయానికి అనుకూలంగా బస్సు ఏర్పాటు చేయాలన్నారు . లేనిపక్షంలో మరిన్ని పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గ్యార వంశి, కమిటీ సభ్యులు శ్రావణ్‌, శశి, రాకేష్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.