నీట్‌పై ప్రత్యేక కమిటీ వేయాలి

– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీట్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పరీక్షపై ప్రత్యేక కమిటీని వేయాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రాల వారీగా నీట్‌ పరీక్షను నిర్వహించాలంటూ తమిళనాడులో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అనుసరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ ముట్టడి
నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌తోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు నీట్‌ అవకతవకలపై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై గవర్నర్‌ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.