పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన 2008-09 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  అపూర్వం అద్వితీయం అన్నట్లుగా అద్భుతంగా సాగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. పదిహేనేళ్ల  క్రితం విడిపోయిన మిత్రులంతా ఒకచోట కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులను చూసి ఉప్పొంగిపోయారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోటకు చేరారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బాల్య మిత్రులతో సరదాగా గడిపారు.నాటి ఆ పాత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆడి పాడారు.తమకు మార్గదర్శనం చేసిన ఆనాటి గురువులను శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వారు చెప్పిన బోధనలు తమ జీవితాలకు ఎలా బాటలు వేశాయో సోదాహరణంగా వివరించారు. పూర్వ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు సైతం మురిసి పోయారు. వయస్సు మరిచి వారితో కలిసి పోయారు.విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం చేసి, దీవేనలు తీసుకున్నారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగి, ఆత్మీయంగా సామూహిక భోజనాలు చేశారు.