మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001_2002 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక పద్మశాలి విజయ సంఘ భవనంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒకచోట కలిశారు. సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులంతా ఒకరిని ఒకరి ఆత్మీయ పలకరింపులతో ఉప్పొంగి పోయారు.ఈ ఆత్మీయ సమ్మేళనానికి తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు రుక్మయ్య, దామోదర్, రాజేశ్వర్, గంగాధర్ లను ఆహ్వానించి పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పూర్వ విద్యార్థులంతా తమ గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకచోట చేరిన విద్యార్థులు ఆనాటి మధురస్మృతులను జ్ఞాపకం చేసుకొని ఆనందంతో ఉత్సాహంగా గడిపారు. సహపంక్తి భోజనాలు చేసి గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుడ్ల నవీన్, సుధాకర్, జగన్, ప్రవీణ్, రమేష్, నరేష్, బాలరాజ్, బాల్ రెడ్డి, అరుణ్ రెడ్డి, భూపేశ్, అనిల్, విద్యార్థినిలు సృజన, స్రవంతి, మంజుల, సృజన, తదితరులు పాల్గొన్నారు.