– రూ.600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం
హైదరాబాద్: ఇంజనీరింగ్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కొత్తగా ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదిత పత్రాలను (డిఆర్‌హెచ్‌పి)ని సెక్యూరిటీస్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను జారీ చేయడం ద్వారా రూ.250 కోట్లు, అదే విధంగా 18,444 మిలియన్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో జారీ చేయడంతో రూ.350 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఈ నిధులను మూలధన వ్యయాలు, కొన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి, సాధారణ పరిపాలన అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూలో ఎస్2 ప్రమోటర్లు కందుల రామక్రిష్ణ, కందుల క్రిష్ణవేణి, నాగేశ్వర్‌రావు కందుల, కాట్రగట్ట మోహన్ రావు, కాట్రగడ్డ శివప్రసాద్, కుండరవల్లి పున్న రావులు తమ హోల్డింగ్స్‌లో కొంత భాగాన్ని విక్రయించనున్నారు. ఈ కంపెనీ రెవెన్యూ 2022-23లో రూ.497.59 కోట్లుగా ఉండగా.. 2023-24లో రూ.543.67 కోట్లకు పెరిగింది.