‘ఆకాశంలో ఒక తార’..

'A star in the sky'..దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. లైట్‌ బాక్స్‌ మీడియా బ్యానర్‌పై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, గుణ్ణం గంగరాజు కలిసి ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా వంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్‌, అశ్విని దత్‌ తదితరులు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా, అశ్విని దత్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణలకు సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.
‘భిన్న చిత్రాలకు, పాత్రలకు దుల్కర్‌ సల్మాన్‌ కేరాఫ్‌. ఇటీవల ఆయన ‘లక్కీభాస్కర్‌’తో బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన సినిమా అంటే అందరిలోనూ ఆసక్తితోపాటు అంచనాలూ పెరుగుతున్నాయి’ అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు: సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం, సమర్పణ – గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా, దర్శకుడు: పవన్‌ సాదినేని, రచయిత: గంగరాజు గుణ్ణం, డిఓపీ : సుజిత్‌ సారంగ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : శ్వేత సాబు సిరిల్‌.