ఆవిరి యంత్రం టూ ఆధునిక కంప్యూటర్‌

A steam engine is a modern computer– కొత్త పుంతలు తొక్కుతున్న ఇంజినీరింగ్‌ రంగం
–  మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశిష్ట సేవలు
– పారిశ్రామిక విప్లవానికి నాంది ఆవిరి యంత్రం
– నేడు జాతీయ ఇంజినీర్స్‌ డే
మేకల కృష్ణ
‘ఇంజినీరింగ్‌ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలు, వ్యవస్థలు, యంత్రాలు, వస్తువులు, పదార్ధాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఇంజినీరింగ్‌ పదం ఇంజన్‌ నుంచి వచ్చింది. పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఆవిరి యంత్రం మొదలుకొని నేటి ఆధునిక సాప్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ద్వారా అందించే వస్తువులను ఆధునిక సమాజం తన దైనందిన జీవితంలో ఉపయోగిస్తుంది. యంత్రాలు, వంతెనలు, భవనాలు, వాహనాలు, ప్రాజెక్టులు, రహదారులు, కంప్యూటర్లు ఇలా అన్నీ ఇంజినీరింగ్‌ సృష్టించిన అద్భుతాలే. అందుకే ఇంజినీరింగ్‌ రంగం ఎంతో విశాలమైనదిగా చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు తయారు చేసిన చక్రం, పుల్లీ, లివరు మొదలు భవనాలు, గృహౌపకరణాలు, రోడ్లు, రైళ్లు, అంతరిక్ష నౌకల వరకు ఇంజినీరింగ్‌ వినియోగం విస్తరిస్తూ వచ్చింది. మానవ జీవితంలో ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఇంజినీరింగ్‌ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ సివిల్‌ ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరిట సెప్టెంబర్‌ 15న మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఇంజినీర్స్‌ డేగా జరుపుకుంటున్నాం.
ఇంజినీర్స్‌ డే..
మైసూర్‌ రాజ్యంలోని ముద్దెనహల్లిలో 1861 సెప్టెంబర్‌ 15న జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య బెంగుళూరులో ప్రాథమిక విద్యనభ్యసించారు. మద్రాస్‌ విశ్వ విద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ పొందారు. పూణేలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివి డిప్లమా పొందారు. బ్రిటీష్‌ ఇండియా ప్రభుత్వంలో పనిచేశారు. 1899లో ఇండియన్‌ ఇరిగేషన్‌ కమిషన్‌లో చేర మని ఆహ్వానించబడ్డారు. అక్కడ దక్కన్‌ పీఠభూమిలో ఒక క్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థను అమలు చేశారు. 1903 లో పూణే సమీపంలోని ఖడక్వాస్లా డ్యామ్‌ వద్ద మొదటి సారి ఆటోమేటిక్‌ వీర్‌ వాటర్‌ ప్లడ్‌గేట్‌ల వ్యవస్థను రూపొందిం చారు. ఆ గేట్లు రిజర్వాయర్‌లో నిల్వ స్థాయిని గరిష్ట స్థాయికి పెంచడంతో డ్యామ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అదే వ్యవస్థను గ్వాలియర్‌లోని టిగ్రా డ్యామ్‌ వద్ద, తర్వాత కర్నాటకలోని మైసూర్‌ వద్ద ఉన్న కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొల్లాపూర్‌ సమీపంలోని లక్ష్మీ తలవ్‌ డ్యామ్‌కి ఛీప్‌ ఇంజనీర్‌ అయ్యారు. 1909లో మైసూర్‌ రాష్ట్ర ఛీప్‌ ఇంజనీర్‌గా చేరా రు. తుంగభద్ర డ్యామ్‌కు ఇంజనీర్ల బోర్డు చైర్మెన్‌గా కూడా పనిచేశారు. 1912లతో మైసూర్‌ దివాన్‌గా నియమించ బడ్డారు. మైసూర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంలో విశ్వేశ్వరయ్య సృజనాత్మక ప్రతిభ దాగి ఉంది. పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిం చారు. అందుకే ఆయనకు 1955లో భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వబడింది. లండన్‌ ఇతర దేశాల్లోనూ ఆయన అనేక పురస్కారాలను అందుకున్నారు.
ప్రాచీన కాలం నుంచి ఆధునిక సమాజం వరకు..
ప్రపంచ ప్రాచీన వింతలుగా పేర్కొనబడు తున్న పిరమిడ్లు, వేలాడే ఉద్యానవనాలు, ఫారోస్‌ లైట్‌ హౌస్‌, డయానా దేవాలయంతో పాటు అనేక కట్టడాలు అనాటి ఇంజినీరింగ్‌ విద్యకు తార్కానాలుగా నిలుస్తాయి. నవీన వింతల్లో చెప్పబడే తాజ్‌ మహాల్‌, చైనా వాల్‌, మాక్టిమస్‌ సర్కస్‌, బాసిలికా చర్చి, పిసా వాలుతున్న గోపురం వంటి అత్యద్భుతాలెన్నో ఇంజినీరింగ్‌ నిపుణుల సృజనశీలతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. 1698లో ఆవిరి యంత్రంతో పునాదులు పడిన పారిశ్రామిక విప్లవం అంతటితో ఆగిపోలేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కొత్త పుంతలు తొక్కి అనేక ఆధునిక యంత్రాల తయారీకి నాంది పలికింది. ఆ తర్వాత రసాయనాల కోసం కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఖనిజాల కోసం మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేతలను సంతరించుకున్నాయి.
1800లో సాధించబడిన ఎలక్ట్రిసిటీ పరిశోధనలతో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రత్యేకంగా చెప్పకోదగినవి. అనేక ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌తో సమాచార, సంచార, సాంకేతిక రంగాలు సృష్టించబడ్డాయి. తొలుత సాధారణ విద్యతో మొదలై ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఉన్నత విద్యను దాటి 21వ శతాబ్దంలో ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య సామాన్య వృత్తి విద్యగా మారింది. సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, కెమికల్‌, ఏరోనాటికల్‌, ఆటోమొబైల్‌, సాప్ట్‌వేర్‌ ఇలా అనేక ఇంజినీరింగ్‌ కోర్సులు వచ్చాయి. ఆర్టిఫిషల్‌ ఇంజినీరింగ్‌తో ప్రపంచంలో అనేక అధ్భుతాలు సృష్టించబడు తున్నాయి.
శరవేగంగా నిర్మాణాలు
ఇంజినీరింగ్‌లో వచ్చిన నూతన ఆవిష్కరణల ఫలితంగా నిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రాష్ట్ర సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నమ్మశక్యం కాని కాలపరిమితుల్లో పూర్తి చేసిన అనుభవాలున్నాయి. మన రాష్ట్రంలో సుమారు రూ.లక్ష కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అత్యద్భుతమైన సాగునీటి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌గా పేరొందింది. అంతటి ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్ల కాలంలోనే పూర్తి చేయడం అంటే ఇంజినీరింగ్‌ రంగంలో వచ్చిన నూతన ఆవిష్కరణ ఫలితం పలు రిజర్వాయర్లు, లిప్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటివి సివిల్‌ ఇంజినీరింగ్‌ లో వచ్చిన ఆధునిక మార్పుల వల్లనే త్వరితగతిన పూర్తి చేయగలిగామని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదే విధంగా పారిశామ్రిక రంగం విస్తరిస్తోంది. అదే విధంగా భవన, రహదారులు, వంతెనల నిర్మాణాల్ని పరిశీలిస్తే కూడా ఎంతో వేగం పెరిగింది. అత్యాధునిక పద్దతుల్లో వంతెనలు, డైవర్షన్స్‌, సర్వీస్‌ రోడ్లు, జంక్షన్లను నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్ర, జాతీయ రహదారుల నిర్మాణంలోనూ కొత్త దనం కనిపిస్తోంది. భవన నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకుంది. ఆకాశాన్ని తాగేలా అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. సమాచార, కమ్యూనికేషన్‌ రంగంలోనూ కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. ఇంజనీరింగ్‌ ప్రతిభావంతులకు మంచి ఉపాధి అవకాశాలు వస్తుండటంతో ఇంజినీరింగ్‌ వ్యవస్థలో వస్తున్న మార్పులే ప్రధానకారణం.