టైటిల్‌కు మెట్టు దూరంలో

– చిరాగ్‌-సాత్విక్‌ జోడి
– తొలిసారి కొరియా ఓపెన్‌ ఫైనల్లో ప్రవేశం
సియెల్‌: భారత స్టార్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి జోడీ మరో టైటిల్‌కు చేరువైంది. ప్రతిష్టాత్మక కొరియా ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన రెండో సీడ్‌. లియాంగ్‌ వీ కెంగ్‌-వాంగ్‌ చాంగ్‌పై వరుససెట్లలో గెలుపొందింది. 40 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన సాత్విక్‌-చిరాగ్‌ 21-15 24-22తో విజయం సాధించారు. తొలిసెట్‌లో ఆరు గేమ్‌ పాయింట్లు సాధించిన భారత ద్వయం రెండో సెట్‌లోనూ జోరు కొనసాగించింది. దాంతో, చైనా జోడీపై హ్యాట్రిక్‌ ఓటమి నుంచి తప్పించుకుంది.
ఇటీవల జరిగిన ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన భారత తొలి డబుల్స్‌ ద్వయంగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో ఇండోనేషియాకు చెందిన టాప్‌సీడ్‌ ఫజర్‌ అల్ఫేన్‌, మహ్మద్‌ రియాన్‌ జోడీ 17-21, 21-16, 21-18తో కొరియా జోడీని ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి 2వ సీడ్‌ అన్‌-సే-యంగ్‌(కొరియా), టైజు-యింగ్‌(చైనీస్‌ తైపీ), పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి 4వ సీడ్‌ లో- కియాన్‌-వురు (సింగపూర్‌), ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) ప్రవేశించారు.