విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటం

– 18,19 తేదీల్లో మండలాల్లో బైక్‌ ర్యాలీలు
– ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
– సెప్టెంబర్‌ 1న చలో హైదరాబాద్‌
– ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు ఖండన
– ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలి
– పీఆర్సీ కమిటీ వేసి వెంటనే ఐఆర్‌ను ప్రకటించాలి : యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యుల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యారంగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై దశలవారీ పోరాటం చేపట్టనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్‌ కుమార్‌, పి నాగిరెడ్డి, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, సయ్యద్‌ షౌకత్‌ అలీ, కొమ్ము రమేష్‌, ఎన్‌ యాదగిరి, బి కొండయ్య, ఎస్‌ హరికృష్ణ, వి శ్రీను నాయక్‌, జాదవ్‌ వెంకట్రావు, వై విజయకుమార్‌ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జంగయ్య, అశోక్‌కుమార్‌, సోమయ్య, పోచయ్య, షౌకత్‌అలీ, కొమ్ము రమేష్‌, కొండయ్య, హరికృష్ణ, జాదవ్‌ వెంట్రావ్‌, విజయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18,19 తేదీల్లో మండలాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చేనెల 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామన్నారు. అదేనెల మూడో వారంలో రాజకీయ పార్టీల నాయకులతో జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబర్‌ ఒకటిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడతామనీ, ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నా ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు సంఘాలకతీతంగా ఈ ఉద్య మంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యూఎస్‌పీసీ నాయకులకు చర్చలకు పిలవాలని కోరారు.
ఆగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని వారు విమర్శించారు. మొదటి పీఆర్సీ గడువు ముగిసినా పూర్తి స్థాయిలో అమలు జరగనేలేదని వివరించారు. ఇంకా రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నియామకం కాలేదన్నారు. గత పీఆర్సీలో 22 నెలల ఆర్థిక ప్రయోజనం నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే పీఆర్సీ కమిటీ వేయాలనీ, ఈనెల ఒకటో తేదీ నుంచి వర్తించేలా మధ్యంతర భృతి (ఐఆర్‌)ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి హక్కుగా సాధించుకున్న మొదటి తేదీన వేతనాలివ్వాలనీ, ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్‌, పీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని ఉద్యోగులపై భారం పడకుండా సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అన్ని యాజమాన్యాల విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్‌ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని సూచించారు.
విద్యావాలంటీర్లను నియమిస్తేనే విద్యార్థులకు మేలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నియామకాల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశమున్నందున తక్షణమే విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు. సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యవేక్షణాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సమీక్ష చేయడం లేదన్నారు. కేసీఆర్‌ మనవడు హిమాన్షు చెప్పినట్టు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ సమస్యలున్నాయని వివరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్‌గ్రేడ్‌ చేసిన పండిట్‌, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని సూచించారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలల్లో సర్వీస్‌ పర్సన్లను నియమించాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని, 13 జిల్లాల్లో మిగిలిపోయిన భార్యాభర్తలను ఒక దగ్గరకు చేర్చాలని కోరారు. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. 2004 సెప్టెంబర్‌ ఒకటికి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా ఎన్‌ఈపీ
విద్యా కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణలను పెంచి పోషించేదిగా ఉన్న జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020)ని రద్దు చేయాలని యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. భారతదేశ అవసరాలకు అనుగుణంగా లేదనీ,, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామిక, శాస్త్రీయ విలువలతో కూడిన ప్రత్యామ్నాయ విద్యావిధానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. ఎన్‌పీఎస్‌, పీఎఫ్‌ఆర్డీఏ బిల్లును రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని కూడా రూ.ఎనిమిది లక్షలకు పెంచాలనీ, పొదుపు మొత్తాలపై ఇచ్చే పన్ను రాయితీని రూ.మూడు లక్షలకు పెంచాలని సూచించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను వై అశోక్‌కుమార్‌ ఖండించారు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరని అన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు వాస్తవమని పోచయ్య చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవిస్తున్నామని అన్నారు. జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టినా బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించలేదని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఖాళీలు, పర్యవేక్షణ అధికారుల ఖాళీలతో విద్యారంగం కునారిల్లిందని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల ఆలస్యమైతే విద్యావాలంటీర్లను నియమించాలనీ, లేదంటే విద్యావ్యవస్థ మరింత నాశనమవుతుందని విమర్శించారు.