రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ

రొటీన్‌కి భిన్నంగా ఉండే కథఅజయ్ ఘోష్‌, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్‌ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలోనే డైరెక్షన్‌ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్‌ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది. పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్‌ అవుతుందని, కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్‌ షాప్‌ మూర్తి కథను రాసుకున్నాను.
పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను. అజయ్ ఘోష్‌ అయితే బాగుంటుందని ఆయనతో ఈ క్యారెక్టర్‌ వేయించాను. చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన క్యారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. పవన్‌ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు. మా సినిమా కంటెంట్‌, మా చిత్రంలోని ఎమోషన్స్‌ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది’ అని దర్శకుడు శివ పాలడుగు చెప్పారు.