ఓ ఆడపిల్ల కథ

ఓ ఆడపిల్ల కథఅనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. కొడుకు, కోడలు, అత్త- మామ కలిసి ఉండేవారు. వాళ్ళ కోడలు గర్భవతి. ఒకరోజు రాత్రి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళకు బాగా కలిసి వచ్చింది. వాళ్ళు పండించిన పొలం బాగా పండి ఎంతో లాభం వచ్చింది. అందుకని ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచసాగారు.
మళ్ళీ సంవత్సరం తిరిగే లోపే వాళ్ళ కోడలు మళ్ళీ గర్భవతి అయింది. పుట్టింటికి వెళ్లింది. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తుంటే దారిలో వాళ్ళ అత్తామామలకు యాక్సిడెంట్‌ జరిగి దెబ్బలు తగిలాయి. ఆ పుట్టిన ఆడపిల్ల వలనే తమకు దెబ్బలు తగిలాయని ఆ పిల్లను చూడకుండానే వెళ్ళిపోయారు.
కొద్దినెలల తర్వాత కోడలు ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారింటికి వచ్చింది. ఆ పిల్లను తీసుకుని ఎందుకు వచ్చావు? ఆ పిల్ల దరిద్రపుది. ఆ పిల్లను మా ఇంటికి తీసుకుని రావద్దు. అసలు ఆ పిల్లను ఎక్కడైనా వదిలిరా అని తిట్టి కోడలిని ఇంట్లో నుండి వెళ్ళ గొట్టారు. ఆ కోడలు చాలా కుమిలి పోయింది. కోడలు తల్లి ఆమెను ఓదార్చి ‘ఈ చిన్న పిల్లని నేను పెంచుకుంటాను. నా మనవరాలు మీకు బరువేమో కానీ నాకు బరువు కాదు” అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది.
ఐదు సంవత్సరాలు గడిచాయి. ఆ ”పాపను చూడాలని వుంది” అని కోడలు అన్నది. అప్పుడు భర్త ”మా అమ్మానాన్న చెప్పారు కదా! ఆ పాప వద్దు. నువ్వు చూడటానికి వెళ్ళొద్దన్నాడు. ఎలాగోలా బతిమిలాడి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చింది. అయితే అత్తామామ ముట్టుకోలేదు. తండ్రి కూడా దగ్గరకు తీయలేదు. ఇవన్నీ చూస్తూ ఆ తల్లి చాలా బాధ పడేది.
ఇదంతా నచ్చక మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. చక్కగా బడికి పంపింది. ఆ అమ్మాయి బాగా చదివేది.
”అమ్మమ్మా! నేను ఏం తప్పు చేశాను. నన్ను మా అమ్మానాన్న వాళ్ళు దగ్గరకు తీయడం లేదు” అని ఓరోజు ఏడుస్తూ అడిగింది.
అప్పుడు అమ్మమ్మ జరిగిన విషయం అంతా చెప్పింది. అది విని ఆ అమ్మాయి చాలా బాధ పడింది.
ఏడుస్తూ ”అమ్మమ్మా! నువ్వు కూడా నన్ను వద్దు అనుకుంటే నేనిప్పుడు అనాధాశ్రయంలో ఉండేదాన్ని కదా!” అంది.
”అలా అనకు. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి. నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవద్దు” అని ఓదార్చింది.
అలా ఆ అమ్మాయి అమ్మమ్మ చెప్పిన విధంగా విని బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం సంపాదించింది. అది చూసి తల్లిదండ్రులు తమ తప్పు తెలుసుకొన్నారు. ఇంత గొప్ప ఆడపిల్లను వద్దని దూరం పెట్టామని నానమ్మ తాతయ్య బాధ పడ్డారు.
ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చి చేతులు పట్టుకుని తప్పయిందని అన్నారు.
ఇదంతా చూస్తూ తల్లి చాలా సంతోషపడింది. ఇన్నాళ్ళకి తన బిడ్డను మెచ్చుకున్నందుకు సంతోషపడుతూ బిడ్డను దగ్గరకు తీసుకుంది.
ఆడపిల్ల బరువు కాదు. ఆడపిల్ల వల్ల ఎలాంటి కష్టాలు, నష్టాలు రావు. ఆడపిల్ల ఇంటికి అదష్టం. ఈ మాట అందరూ తెలుసుకోవాలి. ఆడపిల్లలకు చక్కగా నేర్పిస్తే అన్నింటిలో ముందుంటారు.
– కె.జ్యోతి, 10వ తరగతి, జి.ప.ఉ.పా.పాపకొల్లు, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా.