వి’చిత్ర’ ప్రచారం

– ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రచార హౌరు
– ఒకే చోట రెండు పార్టీల పోటా పోటీ ప్రచారం
నవతెలంగాణ-కొడంగల్‌
ఎన్నికల్లో ప్రచారం ఎంతో కీలకం. ఆయా పార్టీలు తమ ప్రచారానికి పదను పెట్టిన విషయం విధితమే. వినూత్న రీతిలో పార్టీలు ప్రచారాన్ని చేస్తున్నాయి. ప్రజలకు త్వరగా అర్థం అయ్యేలా టెక్నాలాజీని ఉపయోగించి ప్రచారంలో దూసుకుతున్నాయి. ఇలాంటి ఘటనే కొడంగల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రచారం నిర్వహించాయి. వివరాళ్లోకి వెళ్తే.. కొడంగల్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రచారం నిర్వహించాయి. ఒకవైపు కాంగ్రెస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ రథాన్ని ఉంచి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలుపై స్క్రీన్‌ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ ప్రచార రథం ఉంచి బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాల తో పాటు భవిష్యత్తులో చేసే సంక్షేమ పథకాలను ఎల్‌ఈడి స్క్రీన్‌ ద్వారా వివరించారు. ఒకే చోట రెండు రథాలు పెట్టిన ప్రచారం చేయడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య హౌరా హౌరి పోరు ఉన్నట్టే.. ప్రచార రథలు కూడా పోటా పోటీగా పెట్టారని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.