‘న్యూస్ క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ తదితరులపై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, వాస్తవానికి, తీవ్రవాదం మినహా మరే ఇతర నేరాలను వెల్లడించని అస్పష్టమైన ఆరోపణల సమ్మేళనంగా వుంది. ‘న్యూస్‌క్లిక్’లో ప్రచురితమైన ఏ వార్తా కథనం లేదా సమాచారాన్ని ఉటం కించకుండానే, దేశ భద్రతను దెబ్బ తీయడానికి కుట్ర పన్నడం దగ్గర నుండి 2019 పార్లమెంట్ ఎన్నికలకు అంతరాయం కలిగించడం వరకు, ప్రభు త్వంపై అసంతప్తికి కారణమవడం నుండి కీలక సేవలకు అంతరాయం కలిగించడం వరకు అనేక నేరాలకు పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. కుట్రకు పాల్పడ్డారని, వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంపొందించ డానికి ప్రయత్నించారంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ. పి.ఎ -ఉపా), ఐపిసి నిబంధనలను వర్తింప చేశారు. చట్టవ్యతిరేక కార్యకలా పంగా లేదా తీవ్ర వాద చర్యగా పేర్కొనగలిగే ఎలాంటి విధ్వంసకర చర్య ను ఆ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తా వించక పోవడం అన్నింటి కంటే గుర్తుంచుకోదగ్గ అంశంగా వుంది. ప్రభుత్వం పై అసంతృప్తిని రగిల్చి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే, దేశ ఐక్యత, భద్రతకు ముప్పు కలిగించే లక్ష్యంతో, శత్రువులు భారత్‌లోకి అక్రమం గా విదేశీ నిధులను చొప్పించారనే సాధారణ వర్ణన మాత్రమే ఆ ఎఫ్‌ఐ ఆర్‌లో వుంది. అరుణాచల్‌ప్రదేశ్, కాశ్మీర్‌లు భారత్‌లో భాగం కాదని చూపించే ఇ-మెయిల్స్ మార్పిడి ప్రాతిపదికగా కుట్ర జరిగిందంటూ ఎఫ్‌ఐఆర్ ప్రస్తావించింది. 2020-21లో రైతుల ఆందోళన సుదీర్ఘంగా సాగేలా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయని, తద్వారా సేవలు, ఇతర నిత్యావసర సరఫరాలకు ఆటంకం కలిగిందని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.
మొత్తం మీద, ‘న్యూస్ క్లిక్’కు అమెరికన్ కోటీశ్వరుడు నెవిల్లె రారు సింగమ్ జరిపే చెల్లింపులు, అలాగే ఆ వెబ్‌సైట్ జర్నలిస్టు సమాచారాన్ని కలిపి దేశ భద్రతను దెబ్బ తీసేందుకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను రెచ్చ గొట్టేందుకు, తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు చైనా నిధులను విని యోగిస్తున్నారనే ఒక కేసును రూపొందించేందుకు పోలీసులు ప్రయత్నిం చారనేది స్పష్టమైంది. ఇటువంటి దుర్వినియోగానికి యు.ఎ.పి.ఎ (ఉపా) కూడా చాలా అనుకూలంగా వుంటుంది. ఎందుకంటే విస్తృతంగా నిర్వచించబడిన దీని నిబంధనలు చాలా సులభంగా వ్యక్తులను వారి చర్య లకు బాధ్యులుగా చేసినట్లుగా, వారి ‘ఆలోచనా నేరాలకు’ నేరస్తులుగా చేయ డానికి సాయపడతాయి. అసమ్మతివాదులను, అయిష్టులను సుదీర్ఘకాలం కటకటాల వెనుక వుంచేందుకు, విస్తృత మీడియా సోదరులకు ఒళ్లు గగుర్పొ డిచే సందేశాన్ని పంపడానికి ‘ఉపా’ను వర్తింప చేయడం కూడా చాలా ఎత్తుగడతో అమలు చేసిన చర్యే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చైనా కుట్ర సిద్ధాంతాన్ని పాలక బీజేపీ వాడుకునేందుకు కూడా అవకాశం వుంది. రెండు టెలికం కంపెనీలు బూటకపు కంపెనీలను సృష్టించాయని ఏ మాత్రమూ సంబంధం లేని రీతిలో ఎఫ్‌ఐ ఆర్‌లో ఆరోపించడం కేవలం సాధారణ ప్రస్తావన తప్ప మరేమైనా అందులో వుందా లేదా అన్నది ఇక్కడ సంబంధిత ప్రశ్నగా వుంది. తీవ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడానికి ఈ కంపెనీలు అనుకూలంగా వ్యవహరించాయన్న అంశంపై విడిగా దర్యాప్తు జరపాలా లేదా అన్నది కూడా ఇందుకు సంబంధించిన ప్రశ్నగానే వుంది. ఈ కంపెనీల తరపున వాదించడం కోసం లీగల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో ఒక లాయర్ వున్నారంటూ ప్రస్తావించడం చూస్తే ఆ లీగల్ సర్వీసులను నేర పూరితం చేయడానికి పోలీసులు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. వ్యక్తి గత, మీడియా హక్కులకు విఘాతం కలిగించేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేయడం, జాతీయ భద్రతకు సంబంధించి మనోభావాలను రెచ్చగొట్టడం ప్రస్తుత ప్రభుత్వ ప్రవృత్తిగా వుందనే ఒక ఆందోళనకరమైన ధోరణిని ఈ కేసు ఎత్తిచూపుతోంది.
(‘హిందూ’ సంపాదకీయం)