వింతైన వంటకంబు..!

A strange dish..!‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు హ్హ… హ్హ… నాకె ముందు…’ అంటూ మాయాబజారులో పాట వస్తుంటే, వంటకాల ప్రదర్శన భళే నోరూరిస్తుంది. భోజన ప్రియులకు మరీనూ. మానవ సామాజిక పరిణామంలో వంట కనుగొనడం ఓ గొప్ప ఆవిష్కరణ. పచ్చికాయలు, గడ్డలు, పండ్లు, ఆకులు, అలమలు ఏరుకుని తిన్న మానవుడు నిప్పు కనుగొన్న తరువాతనే వంట పంటకు మార్గమేసి ఉంటది. అదీ బహుశా మాంసాహారమయి ఉంటదని అనుకోవచ్చు. ఏది ఏమయినా వంట అనేది మానవుని ‘రసా’యన శాస్త్ర అభివృద్ధికి ఒక సూచిక. వంటతోనే రుచుల వైవిధ్యత మరింత విస్తృతమైంది. వంటిల్లు, వంటగది, వంటగత్తె, వంట మనిషి, వంటల వల్లభుడు, నలభీములు.. ఇలా ఎన్ని ఏర్పడ్డాయి! స్త్రీలను వంట ఇంటికే పరిమితం చేసిన పరిణామాలు, సామూహిక వంటశాలలు, ఉమ్మడి వంటశాలలు ఇలా ఎన్నో వాటిని మనం చూస్తాము. వంట ఒక శాస్త్రంగా తయారైంది. మహిళల వంటపని వెలకట్టనిదిగా ఉంటోందన్న విమర్శ కూడా వెల్లువెత్తింది. వంటపని మహిళలకు ఓ గుదిబండగానూ మారింది.
అదలా ఉంచితే, అనేకానేక పనులు, ఒత్తిడి, ఆదాయ వ్యవహారాల్లోపడి ఇంట్లో వంటకు సమయాన్ని కేటాయించడం తగ్గిపోతున్నది. హోటళ్లు, కర్రీపాయింట్లు, మెస్‌లు ఇపుడు పట్టణాలలో, నగరాలలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇంకేముంది హాయిగా రకరకాల రుచులకు ఒక్క ఆర్డరుతో భుజించవచ్చని భావిస్తున్నారు. అందులో స్విగ్గీ, జమాటోలాంటి ఏజెన్సీలు వచ్చేశాక పది నిముషాల్లో కోరుకున్న వంటకం ఇంటి ముందుంటుంది. ముఖ్యంగా నగరాల్లో విద్యార్థులు, కోచింగ్‌లు తీసుకునే వాళ్లు, ఉపాధి కోసం వచ్చిన వాళ్లు, ఎందరో హోటళ్ల తిండి మీదనే జీవితాలను లాగించేస్తున్నారు. ఇక వీకెండ్స్‌లో ఉద్యోగాలు, కుటుంబాలు ఇంటి వంటను దూరం పెట్టి కొత్త రుచుల కోసం, విశ్రాంతి కోసం బయట తినడం ఫ్యాషనయిపోయింది. అందుకనే ఆహార వ్యాపారం ఇపుడు అత్యంత పెద్దదిగా మారిపోయింది. ఉదయమే మనం చేసుకుని తినే అల్పాహారానికి సంబంధించిన ఇడ్లీ పండి, దోసెపిండిని షాపుల్లో ప్యాకెట్లలో తయారుగా అమ్ముతున్నారు. తినడానికి సిద్ధంగా ఉండే (రెడీటూ ఈట్‌) ప్యాకెట్ల ఆహారాలు ఇపుడు విపరీతంగా ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేసిన, నిల్వ కోసం రసాయనాలు కలిపిన ఆహారాలను తినడం పాశ్చాత్యులకే కాదు మాకూ తెలుసని మనమూ అలవాటు చేసుకున్నాము. ఆహారం ఘనమైన వ్యాపారమయ్యాక, లాభాలు పెరిగాక, జరగకూడనివన్నీ జరిగిపోతుంటాయి.
అందువల్లనే మన దేశంలో ఊబకాయం, మధుమేహం విపరీతంగా పెరిగిపోతున్నది. అనేకరకాల అనారోగ్యాలూ తలెత్తుతున్నాయి. ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలవల్ల శరీరంలో కొవ్వు పెరిగి వ్యాధులబారిన పడుతున్నారు. ఇటీవల చెన్నరుకు చెందిన మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ మొదలైన సంస్థలు పరిశోధనలు చేసిన అధ్యయన వివరాలు వెల్లడించారు. అనేక ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పాంక్రియాస్‌పై వత్తిడి పెరిగి మధుమేహం పెరుగుతున్నదని చెప్పారు. ప్రాసెస్‌ చేసిన ఆహారంవల్ల కాలేయ కొవ్వు పెరిగిపోతున్నదనీ తెలిసింది. చక్కెర, సోడియం ఎక్కువగా ఉండడంవల్ల రక్తపోటు వ్యాధికి కారణమవుతోందనీ అధ్యయనం తెలుపుతోంది. ఇక పానియాలు (డ్రింక్స్‌) థమ్స్‌అప్‌, ఫాంటా, మాజా, స్ప్రైట్‌ వగైరాలలో కూడా చక్కెరలు, పిండిపదార్థాలు, ఇతర రసాయనాలుంటాయని, అవి అనారోగ్యానికి కారణమవుతాయని తెలిపారు. వీటిని మన సినిమా హీరోలు మరీ ప్రచారం చేసి వ్యాపారం పెంచుతుంటారు. ఆహారం నిల్వ ఉంచడం కోసం వేసే రసాయనాలు, ఆకర్షణీయంగా కనపడడం కోసం వాడే రంగులు, మొదలైన వాటితో క్యాన్సర్‌ వ్యాధి పెరుగుతోందని చెబుతున్నారు. ఇవిగాక ఇంకా కల్తీ పదార్థాలు, కుళ్లిన, పనికిరాని పదార్థాలనూ అమ్మటం విపరీతంగా పెరిగిపోయింది.
ఇకపోతే దేశంలో ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు, పానీయాలు, మొదలైన బయటి తిండ్లపై ఖర్చు పెరిగిందని, ఇంటిలో వండే ఆహారంపై ఖర్చు తగ్గించారని కుటుంబ వినియోగ సర్వే చెబుతోంది. అందుకను గుణంగానే వ్యాధులు పెరుగుతున్నాయి. దేశంలో 56శాతం వ్యాధులకు ఈ అనారోగ్యకరమైన ఆహారమే కారణమని ఈ ఏడాది ఆర్థిక సర్వే ఉటంకించింది. ఒకవైపు సరైన తిండి దొరకక, పౌష్టికాహార కొరతతో బాధపడుతూ చస్తున్నారు. మరోవైపు అనారోగ్యకర ఆహారంతో రోగాల బారినపడి చస్తున్నారు.
ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న, ప్రాణాలకే ముప్పు తెస్తున్న వ్యాపారంపై ప్రభుత్వాలకు సరయిన నిఘా కానీ నియంత్రణ కానీ లేదు. అటువైపుగా ఆలోచించటమూ లేదు. ఎవరి ఆరోగ్యం వారి బాధ్యతే అన్నట్టుగా చూస్తున్నాయి ప్రభుత్వాలు. వ్యాపారాన్ని మాత్రం యధేచ్ఛగా సాగించటానికి తోడ్పాటునిస్తున్నాయి. ఈ వ్యాపారాలను నియంత్రించి ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వాలు కాపాడాలి. రుచుల మోజుల్లోపడి బయటి తిండిని తగ్గించుకుంటే మంచిదని దీనివల్ల తెలుసుకోవాలి. ఇంటివంటా.. వంట ఇల్లూ.. వర్థిల్లితేనే మనకు ఆరోగ్యం.