బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడంట వెనకటికి ఎవడో! ఈ మధ్య కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో కనీసం పదివేల ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టే చర్యలకు పూనుకుంటోంది. మేకిన్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా, స్టాండ్ అఫ్ ఇండియా అని పేర్లు చెప్పడమే తప్ప యువతకు కేంద్రం చేసింది శూన్యం. కేంద్ర ఉద్యోగ, ఉపాధి కల్పన సంస్థలు, శిక్షణ సంస్థలు నిధులు లేక, సరైన జీతాలు లేక వెలవెల పోతున్నాయన్న అన్న సంగతి కిషన్‌రెడ్డికి తెలియదా? మరి నిరుద్యోగ దీక్ష ఎందుకు చేపట్టినట్టు? బీజేపీ పాలనలో యువతకు కేవలం స్విగ్గిస్, జొమాటో, గో డాడీ కొరియర్ అండ్ కార్గో, అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ, టెలికాలర్స్, ఆఫిస్ బార్సు, డ్రైవర్, పెట్రోల్ పంపులో ఆపరేటర్ ఉద్యోగాలు తప్ప గవర్నమెంట్‌లో కొలువులు ఎండమావిగానే మిగిలాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉన్న తరుణంలో గరిష్ట నిరుద్యోగ రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మోడీ నేతత్వంలోని కేంద్రానికి సవాల్‌గా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జాబ్ మార్కెట్‌లోకి వస్తున్న కోట్లాది మంది యువతకు ఉద్యోగాలను కల్పించడం బీజేపీ సర్కార్‌కు ప్రధాన ఛాలెంజ్‌లుగా ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తి చూపుతుంది. దీన్ని మోదీ ప్రభుత్వ వైఫల్యంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, ప్రయివేటీకరణ లక్ష్యంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడం వెరసి భారత్‌లో నిరుద్యోగం ఏటికేడూ పెరిగిపోతున్నది. కార్పొరేటు ఎగవేతదారులకు లబ్ది చేకూరే విధంగా పన్నెండు లక్షల కోట్లు బ్యాంకు రుణాలు రైటాఫ్ చేసారంటే ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయి? వీటన్నింటిని పక్కనపెట్టి కొత్తగా నిరుద్యోగ దీక్ష చేపడితే వచ్చేదేముంది? ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించిన పార్టీయే నిరుద్యోగ దీక్ష పేరుతో ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. -ముచ్చుకోట సురేష్‌బాబు